Authorization
Mon May 05, 2025 07:49:53 pm
- టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-భీమదేవరపల్లి
జాతీయస్థాయిలో వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుంటుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామిని ఆయన గురువారం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో వామపక్షాలతో పొత్తులు ఉంటాయే తప్ప రాష్ట్రంలో ఉండవన్నారు. కెసిఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయడంలో భాగమేనని అన్నారు. కేసీఆర్ బైరాగి వేషంతో దేశ ప్రజలను మోసం చేయడానికి బీఆర్ఎస్ అంటూ తిరుగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు ప్రజలు బై బై చెప్పే రోజులు వచ్చాయన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంపీగా ఉన్న పొన్నం ప్రభాకర్ గళం విప్పి రాష్ట్రం ఆవశ్యకతను వివరించారని గుర్తు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీని ఒప్పించి తెలంగాణ తీసుక వస్తే నేడు కేసీఆర్ దర్జాగా పదవులు అనుభవిస్తున్నారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే ప్రస్తుత కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. ఆయనతోపాటు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, స్థానిక నాయకులు ఉన్నారు.