Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కుప్పల వద్ద రైతుల ఆందోళన
నవతెలంగాణ-మల్హర్రావు
రబీ సీజన్లో పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం, అధికారులు కొనుగోలు చేస్తారా..చేయరా ? అని మండల రైతులు ప్రశ్నిస్తున్నారు. మంగళవారం మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలో విక్రయించడానికి అరబోసిన ధాన్యం కుప్పల వద్ద రైతులు విష్ణువర్ధన్ రెడ్డి,శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి,రాపల్లి కుమార్,గై నరేశ్,బొబ్బిలి మొగిలి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వరి కోతలు ప్రారంభించి మూడు వారాలు దాటుతున్న కొనుగోలు కేంద్రాలు ప్రారంబించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే కుప్పలు తెప్పలుగా పోశామని చెప్పారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడంతో అకాల వర్షాల వల్ల అరబోసిన ధాన్యం రాశులు తడిసి ముద్దైతున్నట్లుగా వాపోయారు. ఇటీవల భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పిఎసిఎస్, డిసిఎంస్ ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలు ప్రారంబించాలని,అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా రైతులకు ప్లాస్టిక్ పర్థాలు అందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయినా మండలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంబానికి నోచుకోకపోవడం దురదష్టకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంబించి ధాన్యాన్ని సేకరించాలని విజ్ఞప్తి చేశారు.