Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరు ఆఫీసుకు ఉదయానే ఏడు గంటల షిప్ట్కే వెళ్లాల్సి ఉంటుంది. దాంతో ఇంట్లో అన్నీ రెడీ చేసుకొని వెళ్ళడం చాలా కష్టం. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కాదు. సెలవులతో ఇంట్లో ఉండే పిల్లలు రకరకాల రుచులు కోరుతుంటారు. దాంతో మనకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ వండడం కష్టంగా మారుతుంది. సులువుగా వండే బ్రేక్ ఫాస్ట్ రెసిపీలు తెలుసుకుంటే పెద్ద కష్టపడకుండా అప్పటి కప్పుడే టిఫిన్ రెడీ చేసి పెట్టేయచ్చు. ఉదయానే త్వరగా రెడీ అయ్యే బ్రేక్ ఫాస్ట్ వెరైటీలు కొన్ని ఉన్నాయి. పైగా వాటిలో పోషకాహార విలువలు కూడా అధికం. అవేంటో తెలుసుకుందాం...
బియ్యంపిండితో...
కావాల్సిన పదార్థాలు : బియ్యం పిండి - ఒక కప్పు, ఉల్లిగడ్డ - అర ముక్క, టొమాటో - అర ముక్క, క్యాప్సికం - ఒక ముక్క, పచ్చిమిర్చి - ఒకటి, కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు, జీలకర్ర పొడి - ఒక చెంచా, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - తగినంత.
తయారు చేసే విధానం : ఒక గిన్నెలో బియ్యం పిండి వేసి నీళ్లు కలపాలి. ఉండల్లేకుండా బాగా గిలక్కొట్టాలి. ఉప్పు వేయాలి. ఉల్లిగడ్డ, టొమాటో, క్యాప్సికం, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగులు వేసి బాగా కలపాలి. జీలకర్ర పొడి కూడా వేసి కలపాలి. దోశెలు పోసేంత వీలుగా పిండిని కలుపుకోవాలి. అవసరం అయితే నీళ్లు కలుపుకోవచ్చు. ఆ పిండిని దోశెల్లో పోసుకోవాలి. ఏ చట్నీతో తిన్నా ఇవి టేస్ట్‌గా ఉంటాయి.
శెనగపిండితో...
కావాల్సిన పదార్థాలు : శెనగపిండి - ఒక కప్పు, ఉల్లిగడ్డ - ఒకటి, పసుపు - చిటికెడు, పచ్చి మిర్చి - ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక చెంచా, కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - సరిపడినంత.
తయారు చేసే విధానం : గిన్నెలో శెనగపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. నీళ్లు కలిపి దోశెల పిండిలా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర తరుగు వేసి మళ్ళీ కలపాలి. మనకు ఇష్టమైతే అందులో జీలకర్ర కూడా వేసుకోవచ్చు. పెనంపై నూనె రాసి దోశెలా వేసుకుంటే సరి. పదినిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది.
జొన్నపిండితో...
కావాల్సిన పదార్థాలు : జొన్న పిండి - ఒక కప్పు, పెరుగు - అరకప్పు, ఉల్లిగడ్డ - అర ముక్క, టొమటో - అర ముక్క, క్యాప్సికమ్ - అర ముక్క, ధనియాల పొడి - సగం చెంచా, యాలకుల పొడి - సగం చెంచా, గరం మసాలా పొడి - పావు చెంచా, కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - సరిపడినంత.
తయారు చేసే విధానం : ఒక గిన్నెలో జొన్నపిండిని వేసి ఉప్పు, మసాలాలు కలుపుకోవాలి. పెరుగు కూడా వేసి బాగా గిలక్కొట్టాలి. దోశెలు పోసుకోవడానికి వీలుగా నీరు పోసి కలుపుకోవాలి. ఉల్లిగడ్డ, టొమాటో, క్యాప్సికం, కొత్తిమీర వంటివి సన్నగా తరుక్కోవాలి. వాటిని పిండిలో కలపాలి. స్టవ్ పై పెనం పెట్టి పైన నూనె రాసి దోశెలు పోసుకోవాలి.
గోధుమ పిండితో...
కావాల్సిన పదార్థాలు : గోధుమ పిండి - ఒక కప్పు, ఉల్లిగడ్డ - అర ముక్క, పచ్చిమిర్చి - ఒకటి, కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు, జీలకర్ర పొడి - ఒక చెంచా, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - తగినంత.
తయారు చేసే విధానం : ఒక గిన్నెలో బియ్యం పిండి వేసి నీళ్లు కలపాలి. ఉండల్లేకుండా బాగా గిలక్కొట్టాలి. ఉప్పు వేయాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగులు వేసి బాగా కలపాలి. జీలకర్ర పొడి కూడా వేసి కలపాలి. దోశెలు పోసేంత వీలుగా పిండిని కలుపుకోవాలి. అవసరం అయితే నీళ్లు కలుపుకోవచ్చు. ఆ పిండిని దోశెల్లా పోసుకోవాలి. ఏ చట్నీతో తిన్నా ఇవి రుచిగానే ఉంటాయి.