Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతికూల పరిస్థితులను మనకు అనుకూలంగా మలచుకొని ముందుకు సాగడమే తెలివైన పని. అలాంటి బతుకుపోరులో ధైర్యంగా నిలిచి గెలిచిన ధీర వనిత డా.అడువాల సుజాత. ఆమె జీవితం స్ఫూర్తి దాయకం, ఆదర్శప్రాయం. బీడీ కార్మికురాలిగా అట్టడుగు స్థాయి నుండి ఆత్మవిశ్వాసమే ఆలంబనగా ఉన్నత స్థాయి సాహిత్య శిఖరారోహణ చేసిన ఆమె పరిచయం నేటి మానవిలో...
కరీంనగర్ జిల్లా, జగిత్యాల పట్టణంలో చేనేత కార్మికుల ఇంట జన్మించారు సుజాత. తల్లి సత్తెమ్మ, తండ్రి రాజన్న. వీరికి ఆరుగురు సంతానం. సుజాత రెండవ సంతానం. ఈమెకు ఒక అక్క ఒక చెల్లెలు, ముగ్గురు తమ్ముళ్లు. నిరుపేద కుటుంబం. ఆర్థిక పరిస్థితులు షరా మామూలే. అరకొర వసతులతో బతుకు బండి లాగుతున్న ఏ తండ్రీ అమ్మాయిలను చదివించే సాహసం చేయడు. అయితే రాజన్న తన కూతురు సుజాతను ఇంటర్ దాకా చదివించాడు. తర్వాత అందరిలాగే ఏదైనా మంచి సంబంధం అంటే తమ శక్తికి సరితూగే సంబంధం కుదిరితే పెండ్లి చేయాలనుకున్నాడు. అప్పటికే పెద్దమ్మాయికి పెండ్లి చేశాడు. ఈ బరువు కూడా తగ్గించుకోవాలనుకుంటున్న తరుణంలో కోరుకున్న సంబంధం వచ్చింది. కోరుట్లకు చెందిన మచ్చ రవీందర్‌తో 1989 సుజాత పెండ్లి జరిగింది.
పిల్లలు పుట్టిన తర్వాత...
పెండ్లయితే చేసుకున్నారు కానీ సుజాతకు పై చదువులు చదివి తన కాళ్లపై తాను నిలబడాలన్న ఆకాంక్ష తీరనేలేదు. పుట్టినింట్లో ఉన్నప్పుడే ఆమె మిషన్ కుట్టుకుంటూ కుటుంబానికి సహకరిస్తూ బడికి వెళ్ళి చదువుకున్నారు. అత్తగారింట్లో కూడ బీడీలు చుట్టేవారు. ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత అణగివున్న విద్యాకాంక్ష ఒక్కసారిగా పెల్లుబికింది. వరంగల్‌లో తెలుగు సబ్జెక్ట్ తీసుకొని బి.పి. (లిట్)చేశారు. కేవలం బి.ఏ. తో ఆగిపోతే ఉద్యోగం దొరికేదెట్లా? అందుకే హన్మకొండలో తెలుగు పండిత శిక్షణ (టి.పి.టి) కూడా తీసుకున్నారు.
ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ...
చదువు కొనసాగిస్తూ ముందుకు సాగడానికే నిర్ణయించుకున్నారు. ఒక్కొక్క మెట్టులో పొందుతున్న విజయాలను చూస్తున్న ఆమె ఇక ఆగలేదు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎం.ఏ. తెలుగు పూర్తి చేశారు. 'తెలంగాణా పోరాట నవలల్లో స్త్రీ' అన్న అంశంపై పరిశోధన చేసి ఎం.ఫిల్ పట్టా పొందారు. 2002లో ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించారు. అంతటితో ఆగకుండా రెట్టించిన ఉత్సాహంతో 'డాక్టర్ పి. యశోదారెడ్డి కథలు - సమగ్ర పరిశీలన' అన్న అంశంపై పరిశోధన చేసి పిహెచ్.డి. పట్టా అందుకున్నారు. ఈ రెండూ కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో సాగించిన పరిశోధనాంశాలే.
అమ్మలా ఆదరించారు...
వాస్తవానికి ఎం.ఏ. రెగ్యులర్‌గా చదివిన వాళ్లకు తప్ప మిగతా వాళ్ళకు విశ్వవిద్యాలయాల్లో సీటు దొరకడం అంతసులభమైన విషయం కాదు. అందులో అప్పటికే ప్రభుత్వ రంగంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న సుజాత లాంటి వాళ్లకు గైడుగా ఉండటానికి ఎవరూ సమ్మతించరు. అలాంటి స్థితిలో ఆచార్య బి.రుక్మిణి ఎంతో ప్రేమతో సుజాతను చేరదీశారు. ఎం.ఫిల్, పిహెచ్.డి. అంశాలకు రెంటికీ తానే పర్యవేక్షకురాలిగా ఉన్నారు. ఒకప్పటి బీడీ కార్మికురాలిని డాక్టరుగా లోకానికి చూపడంలో ఎంతగానో సహకరించారు. తల్లి మనసుతో ఆదరించారు. ఆ తర్వాత మద్రాస్ యూనివర్సిటీ నుండి డి.లిట్ కూడా పూర్తి చేశారు.
సాధారణ స్థాయి నుండి...
అప్పటి వరకు సుజాత వాసనలేని పువ్వు. వట్టి గడ్డి పువ్వు. కాని స్వయం కృషితో కష్టపడి విద్యావంతురాలిగా ఎదిగి తనతో పాటు కుటుంబాన్ని కూడా పరిమళవంతం చేశారు. సుజాత పట్టువదలని వనిత, ధీర నారి. అందుకే తన చదువు కొనసాగిస్తూనే టైపు రైటింగ్, కంప్యూటర్, ఐఐటి, డ్రెస్ మేకింగ్ లాంటి ఇతర జీవనోపాధి కోర్సులు కూడా చేశారు. ప్రభుత్వ ఉద్యోగానికి ముందు కొంతకాలం మహిళలకు డ్రెస్ మేకింగ్‌లో శిక్షకురాలిగా పని చేశారు. పురుషాధిక్య ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ రోజుల్లో ఒక స్త్రీ, అందులో సామాన్య గృహిణి, మెట్టినింటిలో బరువు బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దకోడలు సుజాత. సాధారణ స్థాయినుండి ఉన్నత స్థాయికి ఎదగడం అసాధారణ విషయమే అనుకోవాలి.
అనేక సాహితీ కార్యక్రమాల్లో...
సుజాత ప్రస్తుతం తెలుగు పండితురాలిగా కరీంనగర్ జిల్లాలోని మామిడాలపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పని చేస్తున్నారు. ప్రవృత్తి పరంగా ఈమె బహుముఖీన రంగాలలో రాణిస్తుంది. అనేక కవి సమ్మేళనాలలో కవయిత్రిగా, సందర్భోచిత వ్యాసాలు రాసి అనేక పత్రికలకు పంపుతున్నారు. పరిశోధకురాలిగా పేరు తెచ్చుకుంటున్నారు. నానీల కనయిత్రిగా 'మట్టి మల్లెలు' తో నానీల అతి పెద్ద కుటుంబంలో స్థానం సంపాదించుకున్నారు. స్థానిక సంస్థల్లో మంచి గుర్తింపు తెచుకున్నారు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా శాఖ ఉపాధ్యక్షురాలుగా, తెలంగాణా రచయితల వేదిక, కరీంనగర్ జిల్లా శాఖకు కోశాధికారిగా, సమైక్య సాహితీ సంస్థకు కార్యవర్గం సభ్యురాలిగా, భారతీ సాహిత్య సమితి, కోరుట్ల సంస్థకు శాశ్వత సభ్యురాలిగా వివిధ సాహితీ సేవా కార్యక్ర మాల్లో 'నేను సైతం' అంటూ తన స్థానాన్ని పదిల పరచు కుంటూ సాహిత్య ప్రస్థానం సాగిస్తున్నారు. తన ఉనికిని చాటుకుంటున్నారు.
ఉన్నతంగా ఎదుగుతూ...
2008 వరకు సుజాత రచనలు పుస్తక రూపం దాల్చలేక పోయాయి. ఆర్థిక పరిస్థితులే అందుకు కారణం. వదాన్యులు ఆర్థిక సహకారంతో పరిశోధనా గ్రంథాలు రెండింటితో పాటు, నానీల సంపుటిని కూడా 2008లో ముద్రించారు. 2013లో 'కాలమా కాస్త వినుమా' వచన కవిత్వం, 2014లో 'బతుకమ్మ పాటలు' సంకలనం, 2017లో 'వ్యాసపారిజాతం', 2017లో 'విలోకనం' అనే సాహిత్య వ్యాసాలు పుస్తక రూపంలో వచ్చాయి. దేశభక్తి గీతాలు సంకలనం అముద్రితంగా వుంది. ఆత్మ స్థైర్యానికి, ధైర్యానికి, పట్టుదలకు మారు పేరుగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకొని, సాహితీ రంగంలో ఉన్నతంగా ఎదుగు తున్నారు.
అందరినీ మెప్పించి
అత్తమామలు, భర్త ప్రోత్సాహం లేకుండా ఒక వివాహిత పై చదువులు చదువుకోవాలన్న కల సాకారం కావడం అంత సులభమేమీ కాదు. ఇక్కడ వారి సహాయ సహకారాలు, ప్రోత్సాహం సంపాదించిన నైపుణ్య మంతా సుజాతదే. చదువుతో పాటు సంస్కారం, వినయ విధేయతలు సుజాతకు పెట్టనికోటలు, సహజాలంకారాలు. ఈ రక్షణకవచాలతో అన్ని అడ్డంకులనూ ఎదుర్కొన్నారు. అందరినీ మెప్పించి ఒప్పించారు. కుటుంబ పోషణకు సహకరిస్తూనే మరొకవైపు ఉన్నత విద్యవైపు దృష్టి సారించారు. ఫలితాలను అద్భుతంగా, అనూహ్యంగా సాధించారు. తన తోటి మహిళలకు ఆదర్శంగా నిలిచారు. 'పుటం పెడితే పుత్తడి ప్రకాశిస్తుంది' అన్న సామెతను మరోసారి రుజువుచేసి, కష్టాల కడలిని ఈదుతూనే గమ్యాన్ని ఛేదించారు.