Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రద్ధా సోపర్కర్... ధనవంతుల కుటుంబంలో పుట్టింది. మానసిక వ్యాధితో పుట్టిన తన బిడ్డకు మెరుగైన చికిత్స అందిస్తుంది. తన బిడ్డతో పాటే మరో బిడ్డ చికిత్స కోసం వచ్చింది. ఆ బిడ్డ తల్లి కడుపునిండా తిండి కూడా తినడం లేదు. ఆకలి లేక కాదు బిడ్డ చికిత్స కోసం డబ్బు దాచేందుకు. తను రోజూ కడుపు నిండా తింటే తన బిడ్డకు చికిత్స చేయించలేనని తన భయం. ఈ సంఘటనతో శ్రద్ధ గుండె కరిగిపోయింది. 'మధురం ఛారిటబుల్ ట్రస్ట్' పుట్టుకకు దారి తీసింది. ఇంతకీ ఆ వివరాలేంటో ఈ రోజు మానవిలో తెలుసుకుందాం...
శ్రద్ధా సోపర్కర్ అనే 38 ఏండ్ల మహిళ. సెరిబ్రల్ పాల్సీకి అనే వ్యాధికి చికిత్స పొందుతున్న తన కూతురికి భోజనం పెట్టేందుకు ఆసుపత్రి హాల్లో కూర్చుని ఉంది. ఈ వ్యాధితో బాధపడుతున్ను వారు నడవాలన్నా, తినాలన్నా ప్రతి దానికి ఇతరులపై ఆధారపడాల్సిందే. శ్రద్ధా కూతురు గదిలోకి వెళ్ళి చుట్టూ చూసింది. ఆ గదిలోనే మరొక మహిళ బిడ్డ కూడా చికిత్స పొందుతుంది. ఆ మహిళ మధ్యాహ్న భోజనానికి కేవలం మజ్జిగ మాత్రమే తీసుకోవడం ఆమె చూసింది. ఇది శ్రద్ధకు ఆసక్తిని కలిగించింది. ఆగలేక ఆ మహిళ దగ్గరకు వెళ్ళి భోజనం ఎందుకు చేయలేదని అడిగింది. దానికి ఆమె ''నేను రోజూ తింటుంటే నా కొడుకు చికిత్స కోసం డబ్బులు ఎలా దాచగలను?' అన్నది.
కుటుంబ సహకారంతో...
ఆ తల్లి మాటలు శ్రద్ధకు బాధ కలిగించాయి. 'ఆమె మాటలు విని ఒక్క క్షణం స్తంభించిపోయాను. వెంటనే ఆమె బాబు చికిత్సకు అవసరమయ్యే డబ్బును ఇచ్చి ఆ మహిళకు తాను తోచిన సహకారం అందించాలని అనుకున్నాను'' అని తన భావాలు పంచుకుంది. అలా ఒక బిడ్డతో ప్రారంభించి శ్రద్ధ చాలా మంది పిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందించడం మొదలుపెట్టింది. ఆమె పదవ బిడ్డకు సహాయం చేస్తున్నప్పుడు తన కుటుంబం కూడా ముందుకు వచ్చింది. ఈ సహాయ కార్యక్ర మాన్ని పెద్ద ఎత్తున చేయాలనే నిర్ణయానికి వచ్చాను.
మధురం ఛారిటబుల్ ట్రస్ట్
2019లో 'మధురం ఛారిటబుల్ ట్రస్ట్' పుట్టింది. అహ్మదాబాద్‌కు చెందిన ఈ సంస్థ ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ ద్వారా ప్రత్యేక సామర్థ్యం ఉన్న పిల్లలకు సహాయం చేస్తుంది. అలాగే కీళ్ల శస్త్రచికిత్సలు, బొటాక్స్ సర్జరీలు చేయిస్తూ వినికిడి పరికరాలు, ఊతకర్రలు కూడా అందిస్తున్నారు. 2021లో ట్రస్ట్ స్టెపాథాన్ అనే ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. అది నిరుపేద ప్రజలకు ఉచితంగా కృత్రిమ కాళ్లను అందిస్తుంది.
మెదడుకు నాలుగు చికిత్సలు
శ్రద్ధకు న్యాయశాస్త్రంలో పట్టా ఉంది. కానీ దాన్ని ఆమె వృత్తిగా స్వీకరించలేదు. ఆమె ఒక వ్యాపార కుటుంబంలో పెరిగింది. పెండ్లి జరిగి 2018లో ఆమె బిడ్డకు తల్లి అయ్యే వరకు ఆమె జీవితం వ్యాపారం చుట్టూనే తిరిగింది. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ పాప పేరు శృతి. అయితే శృతికి ఇన్ఫెక్షన్ వచ్చి సెరిబ్రల్ పాల్సీ అని తేలింది. నడవడం, కూర్చోవడం, మాట్లాడటం ఆమెకు చాలా కష్టంగా మారింది. ఇప్పటి వరకు ఆమెకు నాలుగు సార్లు మెదడు శస్త్రచికిత్సలు చేయించుకోవలసి వచ్చింది. ''పిల్లలను పెంచడం చాలా పెద్ద బాధ్యత. అందులోనూ ప్రత్యేక సామర్థ్యం ఉన్న పిల్లల విషయానికి వస్తే తల్లిదండ్రులకు బాధ్యత మరింత పెరుగుతుంది'' అంటారు శ్రద్ధ.
ఖర్చుతో కూడుకున్నది...
ఇటువంటి వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు మెరుగైన వైద్యం అందిస్తే వారిలో చాలా మార్పు వస్తుంది. వారిలో కూడా నైపుణ్యాలు పెంపొందించవచ్చు. అయితే ఇది ఖర్చుతో కూడుకున్నది. అందువల్ల మధురం ఛారిటబుల్ ట్రస్ట్ చికిత్స, శస్త్రచికిత్సలను అందించడానికి స్పార్ష్ పీడియాట్రిక్ రిహాబిలిటేషన్ క్లినిక్ అయిన హిషు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్వెన్షన్ సెంటర్‌తో జతకట్టింది. మస్తిష్క పక్షవాతంతో పాటు, ఆటిజం, మెంటల్ రిటార్డేషన్, మానసిక ఆరోగ్య సమస్యల వల్ల కలిగే వినికిడి వైకల్యాలు ఉన్న పిల్లలకు ట్రస్ట్ సహాయం చేస్తుంది. ఇప్పటివరకు ఇది 800 మంది పిల్లల చికిత్స ఖర్చు చేసింది. పోలియో, దృష్టి లోపం, వినికిడి వైకల్యం ఉన్న 10 మంది పిల్లలకు శస్త్రచికిత్స ఖర్చును స్పాన్సర్ చేసింది.
ఉచితంగా కృత్రిమ కాళ్లు
2021లో కరోనా సమయంలో థెరపీ సెంటర్లు మూసివేశారు. ఇది శ్రద్ధకు కొత్త ఆలోచనలు చేసేందుకు మార్గమయింది. ట్రస్ట్ స్టెపాథాన్ను ప్రారంభించింది. ఇక్కడ అట్టడుగు వర్గాలకు చెందిన వికలాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లను అమర్చుతారు. ఆ తర్వాత ఫిజియోథెరపీ కూడా చేయిస్తారు. ఇవి ఒట్టోబాక్ నుండి దిగుమతి చేసుకున్న నాణ్యమైన ప్రోస్తేటిక్స్-ఆర్థోపెడిక్ టెక్నాలజీలో వ్యవహరించే జర్మన్ కంపెనీ. శ్రద్ధ దీని గురించి మరింత వివరిస్తూ 'ఈ కాళ్లు తేలికగా ఉంటాయి. మోయడానికి సులభంగా ఉంటాయి. అవి సిలికాన్ లైనర్‌తో వస్తాయి. వాటిని ధరించడం చాలా సౌకర్యవంతం. ప్రొస్తెటిక్ కాళ్లకు హైడ్రాలిక్ మోకాలి కీలు ఉంటుంది. ఇది కదలికను సులభతరం చేస్తుంది. దాని పాదాల థ్రస్ట్ సులభంగా నడిచేలా చేస్తుంది. ఇది పెట్టిన తర్వాత సైకిల్ తొక్కవచ్చు, స్నానం చేయవచ్చు, డ్రైవ్ చేయవచ్చు, ఈ కాళ్ళపై ఎక్కవచ్చు. నా నినాదం ఎల్లప్పుడూ మీ కోసం మీరు ఉపయోగించుకునే వాటిని అందించడమే'' అంటుంది.
ఇప్పుడు డాన్స్ కూడా చేస్తుంది
వీరి సహాయంతో చికిత్స పొందిన రోష్ని ఎడమ పాదం లేకుండా పుట్టింది. స్నానం చేయడం, టాయిలెట్‌కి వెళ్లడం కోసం రోష్ని తనపై ఆధారపడి ఉండేదని ఆమె తల్లి సాజిదా గుర్తుచేసుకుంది. ''ఆమెకు ఐదేండ్లు వచ్చే సరికి నేను తనకు ఆ పనులు చేయలేకపోయాను. మధురం ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా పాపకు ప్రొస్తెటిక్ అమర్చారు. ఇప్పుడు నా కూతురు నడవగలదు, నృత్యం చేయగలదు, గర్బా ఆడగలదు, మెట్లు ఎక్కగలదు, పాఠశాలకు వెళుతుంది. ముఖ్యంగా ఆమె సాధారణంగా పిల్లలతో ఆడగలదు. ఇకపై తనకు నడకలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు'' అంటూ ఆ తల్లి ఎంతో ఆనందంగా చెబుతుంది.
మరింత బాధ్యతగా...
వాస్తవానికి ప్రత్యేక సామర్థ్యం ఉన్న బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడం తల్లిదండ్రుల మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇక అర్థిక సమస్యలు ఉన్నాయంటే పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంటుంది. శ్రద్ధకు ఆర్థిక సమస్యలు లేకపోవడంతో తన బిడ్డకు మెరుగైన చికిత్సను అందించగలుగుతుంది. ''అన్ని వనరులు ఉన్నప్పటికీ మా ప్రయాణం అంత సులభం కాదు. నిత్యం డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి, గంటల తరబడి చికిత్స, పైగా పాపకు ఎన్నో శస్త్ర చికిత్సలు చేయాల్సి వచ్చింది ఇది అత్యంత బాధాకరం'' అంటుంది.