Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సృష్టిలో తీయని పదం అమ్మ. ఈ రెండక్షరాల్లో విశ్వమే దాగి ఉంది. అమ్మ... ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఇంకా ఎన్నెన్నో.. ఎంత చెప్పినా తక్కువే.. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. కడుపున పుట్టిన బిడ్డలనే కాదు అణగారిన వారినందరినీ తమ బిడ్డలుగా భావించి సమాజం కోసం కృషి చేస్తున్న ఎందరో తల్లులు మన మధ్యనే ఉన్నారు. తమ అక్షరాలతో, సేవా కార్యక్రమాలతో విశేష సేవలు చేస్తున్న 31మంది మాతృమూర్తులను రాబోయే అమ్మల దినోత్సవాన్ని పురస్కరించు కొని తెలుగు యూనివర్సిటీ మాతృవందనం చేసింది. వారిలో కొందరి గురించి మనమూ తెలుసుకుందాం.
అరుణారుణ సాహిత్య తెమ్మెర
కృష్ణాబాయి తుమ్మల...
తన 60 ఏండ్ల సాహితీ ప్రస్థానంలో వీరు సాహిత్య సమాలోచన వ్యాస సంకలనంతో పాటు 120కి పైగా వ్యాసాలు, సమాజ చరిత్ర ప్రతిబింబంగా చేసిన సమీక్షలు, ముందుమాటలు, స్కెచ్‌లు, ఇంటర్వ్యూలు, ఉత్తరాలు, సాహిత్య విమర్శలు, అను వాదాలు, కథలు ఇలా ఎన్నో సాహితీ రచనలు చేశారు. 'మన చలం' వ్యాస సంపుటికి సంపాదకత్వం వహించారు. విప్లవ రచయితల సంఘం తొలి మహిళ సభ్యురాలు వీరు. అరుణతార పత్రికకు సంపాదకురాలిగా పని చేశారు.
బహుమతులు ఆమె సొంతం
వేముగంటి శుక్తిమతి...
45 ఏండ్ల ఉపాధ్యాయ వృత్తి అను భవం. ఇప్పటివరకు 30 కథలు, 60 కంటే ఎక్కువ వ్యాసాలు. ఆరు నవలలు రాశారు. మొదటి కథ మానవత్వం మరిచిన వేళ. దీనికి 1997లో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ఉగాది కథల పోటీలో మొదటిబహుమతి. నేటి మనిషి అనే కథకు ఉపాసం సంస్థ నిర్వహించిన కథల పోటీలో బహుమతి. సుక్కబర్రె అనే కథకు 2020లో ముల్కనూరు గ్రంథాలయ నిర్వహణ పోటీలో విశిష్ట బహుమతి. ఊరు పిలిచింది అనే కథకు పాలపిట్ట అధ్వర్యంలో జరిగిన కథల పోటీలలోప్రత్యేక బహుమతి అందుకున్నారు. ఇలా ఎన్నో బహుమతులు, సన్మానాలు జరిగాయి.
విద్యా వికాసాల పట్టు
డాక్టర్ సుశీల బట్టు...
సికింద్రాబాద్‌లోని కస్తూర్బా మహిళా కళాశాల ప్రిన్సిపల్‌గా వీరు పని చేశారు. వీరి అనేక పరిశోధనా పత్రాలు ఉత్తమ పరిశోధనలుగా ప్రచురణకు స్వీకరించ బడ్డాయి. బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. ఆకాశవాణిలో సూక్తిముక్తావళితో పాటూ అనేక అంశాలపై ప్రసంగాలు చేశారు. కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డుకు సభ్యురాలిగా ఉన్నారు.
ఆపన్నుల ఆత్మీయ పరిమళ
డా.లక్కరాజు నిర్మల...
ఆత్మీయ నిర్మలగా అందరికీ సుపరిచితులు. 45 ఏండ్లగా ఆత్మీయ మహిళా మండలి ద్వారా, 30 ఏండ్లు ఆత్మీయ మానసిక వికాస కేంద్ర స్థాపకురాలిగా ఎనలేని సేవలు చేస్తున్నారు. అధ్యాపకురాలిగా, మానసిక వికలాంగుల పాఠశాల డైరెక్టర్‌గా అనేక మందికి కౌన్సిలింగ్ చేస్తూ సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
విజ్ఞాన సాహితీ హారతి
డా. బి.విజయభారతి...
వీరు కళాప్రపూర్ణ, పద్మభూషణ్ బోయి భీమన్న, నాగరత్నమ్మ దంపతుల ప్రథమ సంతానం. వీరు పౌరహక్కుల ఉద్యమాలలో నాలుగు దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించారు. నిజామాబాద్ మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా, వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 1978 నుండి హైదరాబాదులోని తెలుగు అకాడమీ రీసెర్చ్ ఆఫీసర్‌గా డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలు అందించారు. 1999 నవంబర్‌లో ఇన్చార్జ్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా సంఘ సభ్యురాలుగా పనిచేశారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం వీరికి విశిష్ట మహిళా పురస్కారాన్ని ఇచ్చి గౌరవించారు.
సైరస్‌తో సాహితీ సైరన్ మోగించిన జ్ఞాత
లంక సీత...
వీరు గత 60 ఏండ్లుగా ఢిల్లీలో ఉంటున్నారు. తన జీవితములో ఎదురయిన చేదు అనుభవాలు ఎన్నో పాఠాలు నేర్పాయి అంటారు. చిన్నతనంలోనే భర్తను కోల్పోయి, చదువు లేక, భాష రాక, దేశ రాజధానిలో అష్టకష్టాలు పడ్డారు. వాటికి ఎదురేగిపై చదువులు చదువుకుని మంచి హోదాలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. తనలాగా కష్టపడిన స్త్రీలకు ఏదో రకంగా సహాయ పడాలనే ఉద్దేశంతో సైరస్ అనే సంస్థ స్థాపించి తద్వారా మహిళలకు, పిల్లలకు, వయో వృద్దులకు చేతనయిన రీతిలో ఆరోగ్య, విద్యాపరంగా అనేక సహాయ సహకారాలు అందిస్తున్నారు.
అనేక నవలల జయప్రభ
డా. పెళ్ళకూరి జయప్రద...
తన 14వ ఏటనే రచనలు చేయనారం భించారు ఈ గైనికాలజిస్ట్. వీరు మొత్తం 37 పుస్తకాలు రచించారు. అందులో 12 నవలలు, 15 కథా సంపుటాలు, 3 కవితా సంపుటాలు, 3 వ్యాస సంపుటాలు, ఒక దీర్ఘ కవిత కావ్యం, ఒక నానీల సంపుటి, ఒక రెక్కల సంపుటి, ఒక స్వర్ణోత్సవ సంచిక ఉన్నాయి. వీరు యాత్రా సాహిత్యం, రేడియో టాక్స్, మీడియా టాక్స్, టీవీ ప్రోగ్రామ్స్ అనేకం చేశారు. వీరి సాహిత్యం మీద ఇప్పటివరకు ఐదుగురు పి.హెచ్.డి, ఏం. ఫిల్ చేశారు. ప్రతి ఏటా ఉత్తమ నానీల పుస్తకానికి, ఉత్తమ నవలకు అవార్డు ఇచ్చి రచయితలను ప్రోత్సహిస్తుంటారు.
రసాయన శాస్త్రాల పొదరిల్లు
డా.కృష్ణకుమారి చాగంటి...
వీరు సింగరేణి డిగ్రీ కళాశాల కొత్తగూడెం రసాయన శాస్త్ర ఆచార్యులు, శాఖాధిపతి. 36 ఏండ్ల సర్వీసు అనంతరం పదవీ విరమణ చేసి ఉపన్యాసకురాలుగా పరిశో ధకురాలుగా, రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు, యుట్యూబర్గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వీరు 15 ఏండ్ల నుండి భారత ప్రభుత్వపు విజ్ఞాన ప్రసార్ వారి రేడియో ఎపిసోడ్లకు, ద్విభాష మాసపత్రికకు నాటకాలను, వ్యాసాలను అందిస్తున్నారు.
విద్యారంగాల్లో విరాజిల్లిన పట్టాల పంట
డా. హేమలతాదేవి ఆచంట...
భర్త పిల్లల బాధ్యత వివాహమైన ప్రతి స్త్రీకి ఉంటుంది. కానీ వీరితో పాటు 12 ఏండ్ల పాటు వృద్ధ అత్తగారిని, ఆడపడుచు పిల్లలని కూడా చూసు కుంటూ ఉన్నత చదువులు అభ్యసించడం అంటే మాటలు కాదు. తల్లినే తనరోల్ మోడల్‌గా భావించే పెండ్లి సమయానికి బి.ఇడి.పాసైయ్యారు. కుటుంబ బాధ్యతలు చేపట్టాక స్కూల్ కివెళ్లకుండానే ప్రైవేటుగా పరీక్షలు రాసి పాసైనారు. టెక్కలి ప్రైమరీ స్కూల్ టీచర్‌గా పనిచేశారు. ఉత్కళ్ యూనివర్సిటీలో ఎం.ఏచేశారు. ఎం.ఫిల్., పి.హెచ్.డి ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు.
విశ్వపుత్రికగా ఎదిగిన గజళ్ళ రాణి
డా. విజయలక్ష్మి పండిట్...
మొట్టమొదటి మహిళా మంత్రి అయిన విజయలక్ష్మి పండిట్ అంతటి కీర్తి ప్రతిష్టలు సాధించాలి అని.. తన కుమార్తెకు.. అదే పేరు పెట్టిన తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా.. ఇంకా చెప్పాలంటే.. అంతకంటే గొప్పగా విశ్వప్రేమ శాంతి అనే విశాల దృక్పథాలను తన రచనల నుండి వెలువరిస్తూ విశ్వ పుత్రికగా వెలుగుతున్నారు. వీరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్‌గా రిటైర్ అయ్యారు.
అపురూప అనువాద ఖ్యాతి
శ్రీపాద స్వాతి..
ఊహ తెలిసినది మొదలు కనిపించిన పుస్తకం చదవడం, అనిపించిన ఊహలకు అక్షరరూపం ఇవ్వడం ప్రవృత్తి. అయితే వృత్తిగా లభించిన అవకాశం కేంద్రీయ విద్యాలయంలో సీనియర్ విద్యార్థులకు ఇంగ్లీష్ బోధన. అచ్చయిన పుస్తకాలు ఎనిమిది కవితా సంపుటాలు, అయిదు కధానికా సంపుటాలు, నాలుగు నవలలు, వీరు తెలుగునుండి ఇంగ్లీష్‌కు, ఇంగ్లీష్ నుండి తెలుగుకు 32 అనువాదాలు చేసారు. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, ఉత్తమ రచయిత్రి పురస్కారం, అపురూప అనువాద పురస్కారం, ఇందూరు అపురూప కధా పురస్కారంతో పాటు ఎన్నో అందుకున్నారు.
విద్యా సాహితీ ప్రతిభా లత
డా.అమృతలత...
నిజామాబాద్‌కు చెందిన రచయిత్రి, కవయిత్రి సాహిత్య సేవకురాలు, విద్యావేత్త, పారిశ్రామికవేత్త కూడా.. విభిన్న ప్రక్రియలో సాహిత్యం రాయడమే కాదు.. సాహిత్యంలో, లలిత కళల్లో అద్భుతమైన ప్రతిభా పాటవాలను చూపిస్తున్న లబ్ద ప్రతిష్టల్ని, యువ రచయితల్ని గుర్తించి, తగు విధంగా సత్కరించి, ప్రోత్సహిస్తున్న సహృదయశీలి. సృష్టిలో తీయనిది (నవల), స్పందన (కథా సంపుటి), అమృత వర్షిణి (ఎడిటోరియల్స్), గోడలకే ప్రాణముంటే.. (నాటికల సంపుటి), చుక్కలలోకం చుట్టొద్దాం! (పిల్లల నాటికల సంపుటి), ఓటెందుకు? (స్కెచెస్), నా ఏకాంత బృందగానం (సచిత్ర స్వీయ చరిత్ర) వంటి రచనలు చేశారు.
బహుకళల కాణాచి
డా. లక్ష్మీ రాఘవ...
రచయిత్రి, ఆర్టిస్ట్. వనితా కాలేజీలో జువాలజీ రీడర్‌గా పదవీ విరమణ చేశారు. ఏడు కథా సంపుటాలు, ఒక స్మారక సంచిక ప్రచురించారు. రెండు కథా సంపుటాలకు కుప్పం రెడ్డెమ్మ పురస్కారాలు, ప్రపంచ తెలుగు మహాసభలలో గుర్తింపు, రచన 'కథా పీఠం' పురస్కారం, నెమలీక నెలవంకవారి 'కలహంస కథా పురస్కారం', కెనడా తెలుగుతల్లి, రైతు బంధు, మలిసెట్టి సీతారాం, రంజని నందివాడ భీమారావు పురస్కారాలు అందుకున్నారు.
అనువాద వికాసాల హేమంత
డా. సి వసంత...
వీరు ఎన్నో అద్భుతమైన పుస్తకాలను తెలుగు నుండి హిందీకి, హిందీ నుండి తెలుగుకు అనువదించారు. వీరు హిందీ పరిశోధన గ్రంథం గీత్ కార్ నీరజ్, మహారాష్ట్రలో వచ్చిన కిలారి భూకంపం ఆధారంగా మృత్యులీల-జీవన హేల అనే హిందీ నవలతో పాటు, రేపటి వసంతం, విముక్త మొదలగు ఆరు రచనలు, గుడిపాటి వెంకటాచలం జీవిత చరిత్ర (రమణీ సే రమణాశ్రమం తక్) హిందీ రచన 1400 పేజీలను మూడు భాగాలుగా రాసారు.