Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కర్నాటక రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి మతోన్మాద తిరోగమన విధానాలకు చెంపపెట్టులాంటిదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు.శనివారం స్థానిక మల్లు వెంకటనర్సింహారెడ్డి భవనంలో జరిగిన ఆ పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 9 ఏండ్లకాలంలో మతోన్మాద విధానాలను అనుసరిస్తూ దేశంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇతర మతాలపై దాడులు, హత్యలు,లైంగికదాడులకు పాల్పడుతూ దేశంలో ఐక్యంగా ఉన్న ప్రజల మధ్యలో చిచ్చు పెట్టిందన్నారు.ప్రజల సంపదను 90శాతంగా ఉన్న దేశ ప్రజలందరికీ అందించాల్సి ఉండగా కేవలం 10 శాతంగా ఉన్న శతకోటీశ్వరులకు అప్పనంగా అక్రమంగా కట్టబెడుతుందని విమర్శించారు.ప్రభుత్వరంగసంస్థలన్నంటిని కారుచౌకగా అమ్మి వేస్తూ అంబానీ, ఆదానీలకు కట్టబెడుతుందన్నారు. దేశ ప్రజలపై పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ వంటి చార్జీలు పెంచి మోయలేని భారం మోపిందని విమర్శించారు.ప్రజలు ఎన్నుకున్న 8 రాష్ట్ర ప్రభుత్వాలను డబ్బుతో కొనుగోలు చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరతపరిచి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్న చరిత్ర బీజేపీదేనన్నారు.రైతు వ్యతిరేక నల్లచట్టాలు తీసుకువచ్చి కార్పొరేట్ శక్తులకు వ్యవసాయరంగాన్ని దారాదత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూసిందని,దానికి వ్యతిరేకంగా దేశ రైతాంగం చారిత్రాత్రికంగా నిర్వహించిన పోరాటానికి కేంద్రప్రభుత్వం తలోగ్గక తప్ప లేదన్నారు.ఎన్ఆర్సీ, సీఏఏ వంటి చట్టాలు తీసుకొచ్చి ముస్లిం ,మైనార్టీలలో చిచ్చు పెట్టిందన్నారు. కర్నాటకలో కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి గెలిసేందుకు బీజేపీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని కానీ ఆ రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు.భవిష్యత్‌లో కూడా జరిగే అన్ని ఎన్నికల్లో మతోన్మాద బీజేపీ ఓటమి లక్ష్యంగా సీపీఐ(ఎం) పనిచేస్తుందన్నారు.15 రోజులుగా రాష్ట్రంలో ఉన్న 9000 మందికి పైగా జూనియర్ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వారిని బెదిరింపులకు గురిచేయాడాన్ని పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. వెంటనే కేసీఆర్ కలగజేసుకొని జూనియర్ గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం అనేక సమస్యలపై వివిధ రూపాలలో ఆందోళన పోరాటాలు, నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.పేదల ఆధీనంలో ఉన్న భూములకు వెంటనే పట్టాలివ్వాలని కోరారు.మే19న జరిగే సుందరయ్య వర్థంతిని వాడవాడల జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, పారేపల్లి శేఖర్‌రావు,మట్టిపల్లి సైదులు, నగరపు పాండు, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.