Authorization
Mon April 14, 2025 07:46:52 am
- యూఎన్ చీఫ్ గుటెరస్ పిలుపు
ఐక్యరాజ్య సమితి : లింగ సమానత్వం, మహిళల హక్కుల పరిరక్షణకు కృషి జరగాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ పిలుపిచ్చారు. నేటి సమాజాలు, ఆర్థిక వ్యవస్థలకు సరిపోయేలా పునరుద్ధరించబడి నటువంటి సామాజిక ఒప్పందంలో ఇవి కీలకాంశాలుగా వుండాలని ఆకాంక్షించారు. శాంతియుత, సామరస్య సమాజాల స్థాపనకు మహిళల సమాన నాయకత్వం, భాగస్వామ్యం చాలా కీలకమని వ్యాఖ్యానించారు. మహిళల స్థితిగతులపై కమిషన్ 66వ సమావేశాన్ని ప్రారంభిస్తూ ఆయన ప్రసంగించారు. వాతావరణ మార్పులు, పర్యావరణ, విపత్తుల ముప్పు తగ్గింపు విధానాలు, కార్యక్రమాల నేపధ్యంలో మహిళల సాధికారత, లింగ సమానత్వాన్ని సాధించడం ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి లక్ష్యంగా వుంది. అనూహ్య రీతిలో వాతావరణ సంక్షోభ పరిస్థితులు తలెత్తడం, కాలుష్యం, ఎడారీకరణ, జీవ వైవిధ్య నష్టం, దీనికి తోడు కోవిడ్ మహమ్మారి, అది సృష్టించిన ఆర్థిక ప్రభావాలు, కొత్తగా తలెత్తిన, సాగుతున్న ఘర్షణలు ఇవన్నీ కలిసి విస్తృతరీతిలో సంక్షోభాలను ఉధృతం చేస్తున్నాయి. ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. కానీ మహిళలు, బాలికలు అంతకంటే ఎక్కువ ముప్పులను, తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని గుటెరస్ పేర్కొన్నారు. కేవలం కొద్ది సంఖ్యలో భూ యజమానులు, నేతలు వుండడమే లింగ వివక్ష అని అన్నారు. మహిళల అవసరాలు, వారి ప్రయోజనాలు తరచుగా నిర్లక్ష్యం చేయబడుతుంటాయి. విధాన రూపకల్పన ప్రక్రియలో వారిని పక్కకు నెట్టస్తుంటారని అన్నారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఒప్పందం, క్యోటో ప్రొటొకాల్, పారిస్ ఒప్పందాల్లో నిర్ణయాక పాత్రలో వున్న మహిళలు కేవలం మూడో వంతు మందేనని అన్నారు. పర్యావరణమంత్రులుగా కేవలం 15శాతం మందే మహిళలు వున్నారన్నారు.