Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐక్యరాజ్య సమితి ప్రధానాంగ మైన భద్రతా మండలిలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు తగినంత ప్రాతినిధ్యంలేదనీ రష్యా విదేశాంగ మంత్రి సర్గీ లవరోవ్ అన్నారు. అంతర్జాతీయ ఘర్షణలను పరిష్కరించే సంస్థగా ఆధునిక భౌగోళిక రాజకీయ అవసరాలను తీర్చటానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ దేశాల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తిచేశారు. అంతర్జాతీయ సంబంధాల్లోని బహుళపక్ష వాదం(మల్టీలేటరలిజం) ఐక్యరాజ్య సమితిని బహుళ ధ్రువ నిర్మాణ లక్ష్యాలకు అనుగుణంగా మారాలని డిమాండ్ చేస్తుందని ఆయన నూయార్క్ నగరంలోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో చేసిన ఒక ఉపన్యాసంలో చెప్పాడు. అంటే ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో జరగవలసిన సంస్కరణలు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల సభ్యత్వాన్ని పెంచటం ద్వారా జరగాలి. ఐక్యరాజ్య సమితికి చెందిన ఈ ప్రధానమైన విభాగంలో పాశ్చాత్య దేశాలకున్న అతి ప్రాతినిధ్యం బహుళ ధ్రువ నియమాన్ని నీరుగార్చేదిగా ఉందన్నారు. 'పటిష్టమైన బహుళ ధ్రువత్వం'' అనే అంశంపైన జరిగిన చర్చలో లవ్ రోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రొటేషన్ పద్ధతిలో రష్యా భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో ఉంది. భద్రతా మండలిలో వీటో అధికారంవున్న సభ్యదేశాల సంఖ్య ఐదు- అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా. ఇవి కాకుండా ప్రతి రెండు సంవత్సరాల కొకసారి ఐక్యరాజ్య సమితిలోని సాధారణ అసెంబ్లీ భద్రతా మండలి కోసం 10 దేశాలను ఎన్నుకుంటుంది. ఈ దేశాలు శాశ్వత సభ్యదేశాలు కావు.
ప్రస్తుత నియమనిబంధనల ప్రకారం ఈ 10 అశాశ్వత సభ్య దేశాల్లో ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి 5, తూర్పు ఐరోపా దేశం 1, పశ్చిమ ఐరోపా దేశాలు 2, లాటిన్ అమెరికా దేశాలు 2 ఉంటాయి.ప్రస్తుతం స్విట్జర్లాండ్, మాల్టా భద్రతా మండలికి ఎన్నికయ్యాయి. ఆ విధంగా 5 పాశ్చాత్య దేశాలకు భద్రతా మండలిలో సభ్యత్వం వచ్చింది. వీటికి తోడు అమెరికా కూటమిలో భాగమైన జపాన్ కూడా భద్రతా మండలికి ఎన్నికైంది. ఈ విధంగా భద్రతా మండలిలో పాశ్చాత్య దేశాలకు అతిగా సభ్యత్వం ఉండటంతోను, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు తగినంత ప్రాతినిధ్యం లేకపోవటంతోను ఐక్యరాజ్య సమితి నిర్వహణలో సమతౌల్యం లోపించింది.