Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూయార్క్ టైమ్స్ వెల్లడి
న్యూయార్క్ : ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు ఎంతగా ఆయుధ సరఫరా చేసినప్పటికీ, ఆ దేశ సైన్యానికి ఎంతగా శిక్షణ ఇచ్చినప్పటికీ, ఇంటెల్లిజెన్స్ మద్దతు ఎంతగా ఇచ్చిన ప్పటికీ రష్యాపైన విజయం సాధిస్తుందన్న గ్యారంటీ లేదని న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది. ఉక్రెయిన్ చేయనున్న ప్రతిదాడి(కౌంటర్ అఫెన్సివ్) ఏమాత్రం విఫలమైనా మద్దతు ఇస్తున్న దేశాలు శాంతి కోసం రష్యాతో చర్చించమని ఉక్రెయిన్‌పై వత్తిడి తెచ్చే అవకాశం ఉందని పేర్కొంది. రష్యాపై తాను చేయనున్న ప్రతిదాడి నిర్ణయాత్మకంగా ఉంటుందని ఉక్రెయిన్ తరచూ పేర్కొంటున్నది. ఈ ప్రతి దాడి జూన్-జులైదాకా మొదలవదని ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ స్మిగల్ పేర్కొన్నప్పటికీ ఇది మే నెలలోనే ప్రారంభం కావచ్చని న్యూయార్క్ టైమ్స్ భావిస్తోంది. ఈ మధ్య కాలంలో పెంటగాన్ పేపర్ల పేరుతో లీకైన డాక్యుమెంట్ల ప్రకారం ఉక్రెయిన్ 12 బ్రిగేడ్ల సైన్యాన్ని ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బ్రిగేడ్లలో ఒక్కో దానిలో 4000సైన్యం ఉంటుంది. వీటిలో 9బ్రిగేడ్లకు అమెరికా, దాని మిత్రదేశాలు పాశ్చాత్య ఆయుధాలను ఉపయోగించటంలో జర్మనీలోని అమెరికా సైనిక స్థావరాలలో శిక్షణను ఇస్తున్నాయి. రష్యాపై ఉక్రెయిన్ చేయనున్న ఈ ప్రతి దాడికి మద్దతుగా అమెరికా ఇంటెలిజెన్స్ తోడ్పడనున్నది.
ప్రతిదీ ఈ ప్రతిదాడిపై ఆధారపడివుందనీ, బహుశా ఇది అతి విశ్వాసం కూడా అయివుండొచ్చని, అయితే ఇది ఉక్రెయిన్ భవితను నిర్ణయించే సన్నివేశమవుతుందని రష్యాలో అమెరికా రాయబారిగా పనిచేసిన అలెగ్జాండర్ వర్షబౌ అన్నాడు. రష్యా ఆధీనంలోవున్న అన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే దాకా రష్యాతో చర్చలు జరపనని ఉక్రెయిన్ భీష్మించుకుని ఉంది. కానీ పాశ్చాత్య దేశాలు ఎంతగా మద్దతునిచ్చినా రష్యా ఆక్రమణలోని భూ భాగాలను ఉక్రెయిన్ తిరిగిపొందే అవకాశం లేదని న్యూయార్క్ టైమ్స్ హెచ్చరించింది.
ఈ యుద్ధంలో ఉక్రెయిన్ ఇప్పటికే చాలా నష్టపోయిందనీ, మందుగుండు మీద చాలా వెచ్చించిందనీ, పాశ్చాత్య దేశాల శిక్షణతో ప్రతిదాడి చేయనున్న ఉక్రెయిన్ సైన్యాన్ని ఎదుర్కోవటానికి రష్యా పటిష్టమైన రక్షణ వలయాన్ని ఏర్పరచుకుందని కూడా నూయార్క్ టైమ్స్ తెలిపింది. ఉక్రెయిన్ చేయనున్న ఈ ప్రతిదాడి ముగిస్తే సమీప భవిష్యత్తులో పాశ్చాత్య దేశాలు చేయగలిగేది ఏమీ ఉండదనీ, అమెరికా, దాని మిత్రదేశాల ఆయుధ నిల్వలు అప్పటికల్లా అడుగంటుతాయనీ, అలా ఏర్పడిన లోటును పూడ్చటానికి మరో సంవత్సరం పడుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ లోపు ఉక్రెయిన్‌కు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని రష్యా ఉక్రెయిన్ పైన భీకరమైన దాడులు చేస్తూనే ఉందని, రష్యాకున్న సైనిక సంపత్తి ముందు ఉక్రెయిన్ నిలువలేదనీ, అంతిమంగా విజయం రష్యానే వరిస్తుందని కూడా న్యూయార్క్ టైమ్స్ రాసింది.