Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిమంది ప్రజలు, విదేశీ అతిధుల మధ్య ఇక్కడ వెస్ట్ మినిస్టర్ అబెలో ఈ కార్యక్రమం జరిగింది. 70 ఏండ్ల తర్వాత బ్రిటన్‌లో రాజ పట్టాభిషేకం జరిగింది. గతేడాది సెప్టెంబరులో రాణి ఎలిజబెత్ కన్నుమూసిన తర్వాత అధికారికంగా బాధ్యతలు చేపట్టిన చార్లెస్ ఇప్పుడు వందల ఏండ్ల నాటి సాంప్రదాయాల మధ్య రాజ కిరీటాన్ని ధరించి పట్టాభిక్తుడయ్యారు. చార్లెస్ సతీమణి కెమెల్లా కూడా రాణిగా కిరీటం ధరించారు. చట్టాన్ని పరిరక్షిస్తానని, దయ, కరుణలతో, న్యాయంతో పరిపాలన సాగిస్తానని చార్లెస్ ప్రమాణం చేశారు. అనంతరం ఇంగ్లండ్ చర్చికి విధేయుడైన క్రైస్తవునిగా కొనసాగుతానని మరో ప్రమాణం చేశారు. పట్టాభిషేకం ముగియగానే సభలో ప్రార్ధనలు చేశారు. పట్టాభిషేక వేడుకల్లో ఈసారి భిను మతాల విశ్వాసాలను ప్రతిబింబించేలా ప్రార్ధనలు వుంటాయని కాంటెర్బరీ ఆర్చిబిషప్ కార్యాలయం గతంలోనే ప్రకటించింది. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధానిరిషి సునాక్ బైబిల్లోని కొన్ని వాక్యాలను చదివి వినిపించారు. రాజు చార్లెస్‌కు పలువురు దేశాధినేతలు అభినందనలు తెలియచేస్తూ సందేశాలు పంపారు. భారత్ తరపున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులు ఈ కార్యక్రమానికి హజరయ్యారు. పట్టాభిషేకానికి ఆహ్వానం అందిన ముంబయి డబ్బావాలాలు 'పుణేరి పగడి'ని చార్లెస్‌కు బహుమతిగా అందచేశారు.