Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డమాస్కస్: సిరియాను తిరిగి చేర్చుకోవటానికి అరబ్ లీగ్ అంగీకరిం చింది. రియాద్‌లో మే19న జరగనున్న శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈ నిర్ణయం జరగటం గమనార్హం. కైరోలో జరిగిన అరబ్ లీగ్‌కు చెందిన ప్రముఖ దౌత్యవేత్తల అంతర్గత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. సిరియా అంతర్యుద్ధ నేపథ్యంలో 2011లో సిరియాను అరబ్ లీగ్ నుంచి సస్పెండ్ చేశారు. అనేక అరబ్ దేశాలు సిరియాతో తమ సంబంధాలను తెంచుకోవటమే కాకుండా సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్ శత్రువులకు తమ మద్దతును పలికారు. సిరియా అంతర్యుద్ధ కాలంలో అనేకరకాల తిరుగుబాటు దారులకు వివిధ దేశాలు మద్దతు పలికాయి. వీరిలో ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు కూడా ఉన్నారు. అయితే సిరియా ఈ తిరుగుబాటుదారులను రష్యా, ఇరాన్ దేశాల సహాయంతో అణచివేసింది.
టర్కీ మద్దతుగల మిలిటెంట్లు ఉత్తర సిరియాలోని కొన్ని భాగాలను నియంత్రిస్తున్నారు. మరోవైపు సిరియా ఈశాన్య ప్రాంతం అమెరికా మద్దతుగల కుర్దిష్ మిలీషియా నియంత్రణలో ఉంది. ఎక్కువ చమురు బావులు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇవి అమెరికా సైనిక ప్రత్యక్ష పర్య వేక్షణలో ఉన్నాయి. గత వారం అమ్మాన్‌లో సిరియా, సౌదీ అరేబియా, జోర్డాన్, ఈజిప్ట్, ఇరాక్ విదేశాంగ మంత్రులు సమావేశమై సిరియా భూ భాగంలో టెర్రరిస్టు కార్యకలాపాలను నిలిపివేయాలని, సిరియా అంతర్గత వ్యవహారాలలో విదేశాల జోక్యం కూడదని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా సిరియా తన భూభాగంలో సార్వభౌమాధికారాన్ని కలిగివుండటానికి కావల సిన మద్దతును తాము ఇవ్వదలిచామని కూడా ఈ సమావేశం ప్రకటిం చింది.ఈ మధ్యకాలంలో సిరియా, యమెన్‌లతోసహా ఈ ప్రాంతంలో ఘర్షణలను నివారించే ప్రయత్నం దౌత్య వర్గాల ద్వారా జరుగుతోంది. గత నెలలో సిరియా విదేశాంగ మంత్రి ఫైజల్ మెక్దాద్ సిరియా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే శక్తులకు మద్దతు పలికిన సౌదీ అరేబియాను దర్శించాడు. సిరియా విదేశాంగ మంత్రి పర్యటన తరువాత సిరియా ప్రాదేశిక సమగ్రతకు, ఐక్యతకు సౌదీ అరేబియా తన మద్దతును ప్రకటించటమే కాకుండా 12సంవత్సరాలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి రాజకీయ పరిష్కారాన్ని కనుగొనటంలో కూడా తన సహకారం ఉంటుందని చెప్పింది. ఇలా అరబ్ దేశాల మధ్య ఐక్యతను సాధించటానికి భూమికగా సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య చైనా మధ్యవర్తిత్వంతో కుదిరిన సంధి ఉన్నది.