Authorization
Fri April 11, 2025 01:28:28 am
- శ్రీలంక అధ్యక్షుడు గొటబయకు ఊరట
కొలంబొ : శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమ్ సింఘె బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం శ్రీలంక పార్లమెంట్ మొదటిసారి సమావేశమైంది. డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకునేందుకు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా అధ్యక్షుడు గొటబయ రాజపక్సాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దేశం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోవడానికి మాజీ ప్రధాని మహింద రాజపక్సా, గొటబయ రాజపక్సాలు కారణమంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో మహింద తన పదవికి రాజీనామా చేశారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ తాజా పరిణామంతో గొటబయ రాజపక్సాకి కొంత ఊరట లభించినట్లైంది. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సను వ్యతిరేకిస్తూ తమిళ్ నేషనల్ అలయన్స్ (టీఎన్ఏ) ఎంపీ ఎం.ఎ. సుమంథిరన్ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రధాన ప్రతిపక్షం ఎస్జేబీ ఎంపీ లక్ష్మన్ కిరియెల్లా కూడా ఈ అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. అయితే ప్రధాని విక్రమసింఘె మాత్రం అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టు సమాచారం.
మొత్తంగా ఈ తీర్మానాన్ని 119 మంది ఎంపిలు వ్యతిరేకించగా కేవలం 68 మంది ఎంపిల మద్దతు లభించడంతో అధ్యక్షుడిపై పెట్టిన తీర్మానం వీగిపోయింది.