Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాలో లూలా పర్యటన
- బైడెన్‌తో భేటీ
వాషింగ్టన్ : ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై, వాతావరణ మార్పులపై ప్రధానంగా దృష్టి సారించి చర్చలు జరిపేందుకు బ్రెజిల్ అధ్యక్షులు లూలా డ సిల్వా అమెరికాలో పర్యటిస్తున్నారు. వైట్‌హౌస్‌కు లూలాను ఆహ్వానించిన అమెరికా అధ్యక్షులు జోరు బైడెన్ ఆయనతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో విజయాలు సాధించినా పదవీచ్యుతులను చేసేందుకు స్వదేశాల్లో జరిగిన మితవాద శక్తుల కుట్రలను ఇరువురు నేతలు ఎదుర్కొన్నారు. వాటిపై తమ అనుభవాలను ఇరువురు పంచుకున్నారు. 'పటిష్టమైన ప్రజాస్వామ్యాలు కలిగిన రెండు దేశాలు కాలపరీక్షలకు నిలిచాయి' అని ఒవల్ ఆఫీసులో సమావేశానికి ముందు బైడెన్ వ్యాఖ్యానించారు. కానీ ఈ రెండు దేశాల్లో ప్రజాస్వామ్యం ప్రబలంగా నిలిచిందని అన్నారు. తిరిగి బ్రెజిల్ స్థానాన్ని ప్రపంచ వేదికపై పునరుద్ధరించాలన్నది తన లక్ష్యమని, ఆ దిశగా కృషి చేస్తున్నామని లూలా చెప్పారు. నాలుగేళ్ళ పాటు బ్రెజిల్ పక్కకు నెట్టివేయబడిందన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య, హైతిలో అభద్రత, వలసలు, వాతావరణ మార్పులు, అమెజాన్‌లో అడవుల నరికివేతను అడ్డుకోవడానికి చర్యలు వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు వైట్‌హౌస్ తెలిపింది. బ్రెజిల్లో విద్వేష సంస్కృతి లేదని సిఎన్‌ఎన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా లూలా చెప్పారు. స్వదేశంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కుట్రలు పన్నిన మితవాద నాయకుడు జేర్ బోల్సోనారోని అప్పగించాల్సిందిగా కోరతారా అని ప్రశ్నించగా, వ్యక్తిగతంగా తాను ఆ విషయాలు మాట్లాడాలనుకోవడం లేదని లూలా స్పష్టం చేశారు. అవసరమైతే బ్రెజిల్ న్యాయ వ్యవస్థ ఆ విషయం చూసుకుంటుందని అన్నారు.