Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్మనీలో కొనసాగుతున్న సమ్మె
బెర్లిన్ : విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం నేపథ్యంలో తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ విమానాశ్రయాల్లోని ఉద్యోగులు సమ్మె చేయడంతో జర్మనీలో విమానయానరంగం స్తంభించింది. విమానాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దేశంలోని ఏడు విమానాశ్రయాల్లోని క్షేత్రస్థాయి సిబ్బంది, ఫ్లైట్ కంట్రోల్ సిబ్బంది బుధవారం నుంచి సమ్మె చేస్తున్నారు. వేతనాల పెంపు ప్రధాన డిమాండ్‌తో సిబ్బంది ఈ సమ్మెకు దిగారు. ఈ సమ్మె కారణంగా ఇప్పటి వరకూ 2,340 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు, దీంతో 3 లక్షల మంది ప్రయాణికులపై భారం పడిందని జర్మనీ ఎయిర్‌పోర్ట్స్ అసోసియేషన్ (ఎడివి) వెల్లడించింది. జర్మనీలో ఒక ప్రముఖ విమాన యాన సంస్థ లుఫ్తాన్సా ఒక్కటే సుమారు 1,300 విమాన సర్వీసులను రద్దు చేసింది. శుక్రవారం ఫ్రాంక్ఫర్ట్, మ్యూనిచ్ విమానాశ్రయాల నుంచి ఒక్క విమానం కూడా బయలుదేరలేదు. యూరప్‌లోని పౌరవిమాన యాన రంగంలో ఇప్పటికే సిబ్బంది కొరత వేధిస్తుంది. కోవిడ్ మహమ్మారి సమయంలోనూ, తరువాత వివిధ సందర్భాల్లోనూ అనేకమంది ఉద్యోగాలు కోల్పోయారు. ద్రవ్యోల్బణం వల్ల తమ నిజవేతనాలు బాగా పడిపోయాయని, ప్రభుత్వం, యాజమాన్యాలు పట్టించుకోకపోవడం వల్లే సమ్మె చేయాల్సి వచ్చిందని ఉద్యోగులు తెలిపారు.