Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సురక్షితంగా తప్పించుకున్న కిషిదా
టోక్యో : జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా పాల్గొన్న కార్యక్రమంపై శనివారం బాంబుదాడి జరిగింది. ఈ దాడిలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. పశ్చిమ జపాన్ ఓడరేవు నగరంలో ఒక ప్రచార కార్యక్రమంలో కిషిదా ప్రసంగించడానికి కొద్దిసేపు ముందు ఆ బాంబు పేలింది. 30-40 సెంటీమీటర్ల పొడవైన పైపు బాంబును సభా వేదికవైపు ఓ వ్యక్తి విసిరాడు. ఆ ప్రాంతంలో పేలుడు శబ్దం వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ జపాన్ మీడియా తెలిపింది. అనుమానితుడుగా భావిస్తున్న ఒక యువకుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని హైగో ప్రిఫెక్చర్కి చెందిన 24ఏళ్ల రియూజీ కిమురా గా గుర్తించారు. దాడి జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది ప్రధానిని అక్కడి నుంచి తరలించారు. తొమ్మిది మాసాల క్రితం మాజీ ప్రధాని షింజో అబెను ఎన్నికల ప్రచార సందర్భంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. స్థానిక ఎన్నికల్లో పాలక పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసేందుకు కిషిదా వచ్చారు.. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారని చీఫ్ కేబినెట్ కార్యదర్శి మత్సునో చెప్పారు. ఈ సంఘటన వల్ల ఎన్నికల క్రమానికి ఆటంకం కలగబోదని మనందరం కలిసి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించుకోవాలని కిషిదా చెప్పారు. సంవత్సరం వ్యవధిలో రెండవసారి చోటుచేసుకున్న ఈ దాడి అక్కడి పాలకవర్గాలపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తికి ప్రతీకగా భావించాలా? శాంతి భద్రతల సమస్యగా చూడాలా అన్నదానిపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.