Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే చాలామందికి కండ్లు ఉబ్బినట్టుగా కనిపిస్తాయి. అయితే చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోగానే ఉబ్బిన కండ్లు మళ్లీ మామూలుగా అయిపోతాయి. అయితే నీటితో శుభ్రపరచుకున్న తర్వాత కూడా కండ్లు ఉబ్బినట్ట్లగానే ఉంటే ఏదో సమస్య ఉందని అర్థం అని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి కొన్ని సహజ చిట్కాలు పాటించడం ద్వారా ఉబ్బిన కండ్ల నుంచి ఉపశమనం పొందవచ్చని వారు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం...
శరీరం డీహైడ్రేషన్‌కు గురైనా కండ్లు ఉబ్బినట్టుగా కనిపిస్తాయట. అందుకే నీళ్లు ఎక్కువగా తాగమంటున్నారు నిపుణులు.
నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.
టీ, కాఫీ, కార్బొనేటెడ్ ఎనర్జీ డ్రింకులు తదితర పానీయాలను తరచుగా తీసుకోవడం వల్ల కండ్లు ఉబ్బిపోయి ఆకర్షణ కోల్పోతాయి. కాబట్టి వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది.
కొత్తిమీరను డైట్లో చేర్చుకోవడం వల్ల వేగంగా ఈ సమస్య నుంచి బయటపడచ్చు. ఎందుకంటే కొత్తిమీర మూత్ర పిండాల ద్వారా వ్యర్థ పదార్థాలు, మలినాలను వడపోసి బయటకు పంపించేస్తుంది. సలాడ్లు, సూప్స్‌లలో కొత్తిమీరను కలిపి తీసుకుంటే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా సొంతం చేసుకోవచ్చు. దోసకాయ, కొత్తిమీర, టొమాటో... తదితర పదార్థాలతో తయారుచేసిన జ్యూస్‌ను తీసుకోవడం వల్ల ఉబ్బిన కండ్ల నుంచి వేగంగా ఉపశమనం పొందవచ్చు. మరి ఆ జ్యూస్ తయారు చేయాలో మనమూ నేర్చుకుందాం.
కావాల్సిన పదార్థాలు: దోసకాయ -1, వాము ఆకులు -2, టొమాటో -1, కొత్తిమీర - కొంచెం, నిమ్మరసం - టీస్పూన్,
తయారీ విదానం: పైన చెప్పిన కూరగాయలన్నింటినీ ముందుగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత మిక్సీలో వేసి జ్యూస్ లాగా తయారుచేసుకోవాలి. దీనికి నిమ్మరసాన్ని కలిపి వెంటనే తాగాలి. ఇలా కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా తాగితే ఉబ్బిన కండ్లు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి.
ఉబ్బిన కళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకున్నారుగా... మరి మీకూ ఈ సమస్య ఎదురైతే ఈ చిట్కాలను పాటించండి. అయితే ఇలా చేసినా కూడా సమస్య తగ్గకపోగా.. దురద, మంట, ఎరుపెక్కడం.. లాంటి సమస్యలు ఎదురవుతుంటే మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.