Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనిశ్చిత పరిస్థితి, ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు తననుతాను కాపాడుకోవడంతో పాటు మరికొందరికి దారి చూపించే మార్గాలను మహిళలు అన్వేషిస్తారు. విజయం సాధిస్తారు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ మహిళల్లోని ఎన్నో సరికొత్త కోణాలను ఆవిష్కరించింది. నాలుగు గోడల మధ్యనే జీవితం బంధించబడినా ఆమె ఆలోచనలు మాత్రం అంతర్జాల వేదికపై అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకువచ్చాయి. ఎంతో మంది మహిళలు కుటుంబసభ్యుల యోగక్షేమాలకు ప్రాధాన్యత ఇస్తూనే తమలోని సృజనాత్మకతకు మెరుగుదిద్దారు. యూట్యూబ్‌లో, బ్లాగ్‌ల్లో సక్సెస్ సాధించిన మహిళలు ఎందరో ఉన్నారు. ఈ కోవాకే చెందిన యువ వ్యాపారవేత్త నిధి బండారి.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన నిధి బండారి మాస్టర్స్ ఇన్ గ్లోబల్ బిజినెస్ ఇన్ ఫైనాన్స్ చదివి ఒక ప్రముఖ కంపెనీలో ఫైనాన్స్ డిపార్ట్ మెంట్లో ఉద్యోగం చేసేది. అయితే 2020 ఆరంభంలో ప్రారంభమైన కరోనా లాక్డౌన్ ఆమె జీవితంలో కొత్త దారిలో పయనించేలా చేసింది. ఉద్యోగాలు కోల్పోయిన చాలామందిలా కుంగిపోకుండా తనలోని సృజనాత్మకతను వెలికితీసింది. అంతేకాదు ఆమె చేసిన ఆ ఆలోచన ఎంతో మంది మహిళలు ధైర్యంగా తమ కాళ్ళపై తాము నిలబడేలా చేసింది.
వేషధారణలో వివక్ష
ఆనాది కాలం నుంచి మహిళల వేషధారణలోనూ విపరీతమైన వివక్ష ఉంది. మహిళలు ఇవే ధరించాలని అంటూ కేవలం మగడిజైనర్స్ రూపొందించిన ఫ్యాషన్ మాత్రమే అనుసరిస్తున్నాం. సాధారణంగా కాలర్ ఉన్న దుస్తులు మగవారు మాత్రమే ధరిస్తారు.
కాలర్ ఎగురేసి
మగాడిలా కాలర్ ఎగురేసి బతకాలి అంటూ వేషధారణకు లింగ బేధం ఆపాదిస్తున్నారు. దీనిని గమనించిన నిధి అమ్మాయిలు ఎందుకు కాలర్ ధరించరు, నడుముకు బెల్ట్ ఎందుకు పెట్టుకోరు అని ఆలోచించింది. ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఏ డ్రస్ మీదికైనా సెట్ అయ్యేలా ఫ్యాషనబుల్‌గా కనిపించేలా కలర్, బెల్ట్, షోల్డర్ క్యాప్ వంటివి స్వయంగా తానే తయారుచేసింది. మిషనరీతో సంబంధంలేకుండా హ్యాండ్ మెండ్గా తయారుచేసేలా వాటిని డిజైన్ చేసింది.
వాయిస్ ఆఫ్ థ్రెడ్స్
లాక్‌డైన్ సమయంలో ఇంట్లో ఉండే ఖాళీ సమయంలో తయారుచేసిన వాటితో ఇంస్టాగ్రామ్లో ఒక పేజీ క్రియేట్ చేసింది. ఇప్పుడు మహారాష్ట్రలోనే కాదు ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగినా తన స్టాల్ ఏర్పాటుచేస్తూ అమ్మాయిలు కూడా కాలర్ ఎగురువేయవచ్చు, బెల్ట్ ధరించవచ్చు అంటూ తన డిజైన్స్ ద్వారా లింగ వివక్షను ఎదిరిస్తోంది. నిధి బండారి ఇప్పుడు సొంతంగా 'వాయిస్ ఆఫ్ థ్రెడ్స్' కంపెనీ ప్రారంభించి మరికొంతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ వ్యాపార రంగంలో దూసుకుపోతుంది. ఆమె రూపొందించిన డిజైన్స్ యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.