Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బేబీ కార్న్‌లో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, ఐరన్, విటమిన్ సిలు సమృద్ధిగా ఉంటాయి. దాంతో మన శరీరానికి చక్కని పోషణను ఇవ్వటమే కాకుండా శరీరానికి, మానసిక ఆరోగ్యంను కలిగిస్తాయి. ఇందులో పీచు పదార్థం చాలా సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాంటి బేబీకార్న్‌తో చేసుకునే కొన్ని స్నాక్స్ మీకోసం...
మంచూరియా
కావల్సిన పదార్థాలు: బేబీ కార్న్‌లు - 12, మైదా - మూడు టేబుల్ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్ - రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిగడ్డ - ఒకటి, ఉల్లికాడల తరుగు - టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్లు, కారం - టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, చిల్లీసాస్ - టీ స్పూను, సోయా సాస్, టమాటో సాస్ - రెండు టీ స్పూన్ల చొప్పున, నూనె - వేగించడానికి సరిపడా, వెల్లుల్లి తరుగు - అర టీ స్పూను.
తయారు చేసే విధానం: ఒక గిన్నెలో బీబీ కార్న్‌లు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, కార్న్‌ఫ్లోర్, సరిపడా ఉప్పు పోసి బాగా కలపాలి. తర్వాత బేబీ కార్న్‌లను నూనెలో పకోడీల మాదిరిగా వేసి దోరగా వేగించాలి. ఆ తర్వాత ఒక ఫ్రైయింగ్ పాన్‌లో అర టేబుల్ స్పూను నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు, వెల్లుల్లి తరుగులను వేసి వేగించాలి. తర్వాత చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత బేబీ కార్న్, ఉల్లికాడల తరుగు కూడా వేసి బాగా కలిపి దించేయాలి.
లాలీ పాప్స్
కావల్సిన పదార్థాలు: పనీర్ - రెండు వందల గ్రాములు, క్యాప్సికం - ఒకటి, బేబీ కార్న్‌లు - పది, గరంమసాల, తేనె - అర టీ స్పూను చొప్పున, నిమ్మరసం - టీ స్పూను, నూనె - రెండు టేబుల్ స్పూన్లు, చాట్ మసాల, కారం - పావు టీ స్పూను చొప్పున, ఉప్పు - రుచికి సరిపడా, టూత్‌పిక్‌లు - 20.
తయారు చేసే విధానం: బీబీ కార్న్‌లను అడ్డంగా సగానికి కోయాలి. తర్వాత పనీర్, క్యాప్సికంలను కూడా అంగుళం మేర ముక్కలుగా కోయాలి. ఆ తర్వాత ముక్కలన్నింటినీ ఒక గిన్నెలో వేసి ఉప్పు, కారం, నిమ్మరసం, గరంమసాల, తేనె వేసి బాగా కలిపి అరగంట నానబెట్టాలి. తర్వాత టూత్‌పిక్‌లకు క్యాప్సికం, పనీర్ ముక్కలను గుచ్చి, చివరిలో బేబీ కార్న్‌లను నిలువుగా గుచ్చాలి. ఆ తర్వాత వీటిని ఒక పెన మీద ఉంచి కొద్దికొద్దిగా నూనె వేస్తూ దోరగా అన్ని వైపులా వేగించాలి. చివర్లో చాట్ మసాల చల్లి దించేయాలి.
స్పైసీ బేబీ కార్న్
కావల్సిన పదార్థాలు: బేబీ కార్న్‌లు - పది, పెరుగు - పావు కప్పు, కార్న్‌ఫ్లోర్ - నూనె - టేబుల్ స్పూను చొప్పున, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్ - పావు టీ స్పూను చొప్పున, కారం, చాట్ మసాల, గరంమసాల - అర టీ స్పూను చొప్పున, ఉప్పు - రుచికి సరిపడా, నిమ్మరసం - టీ స్పూను.
తయారు చేసే విధానం: బేబీ కార్న్‌లను కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చే వరకూ ఉడికించి తీయాలి. తర్వాత ఒక గిన్నెలో కార్న్‌ఫ్లోర్, పెరుగు, పసుపు, కారం, ఉప్పు, నిమ్మరసం, అల్లంవెల్లుల్ని పేస్ట్, గరం మసాల, బేబీ కార్న్‌లు వేసి బాగా కలిపి ఒక గంట సేపు నానబెట్టాలి. తర్వాత ఒక పెనం మీద నూనె వేసి బేబీ కార్న్‌లను అన్ని వైపులా దోరగా వేగించాలి.
గోల్డ్ ఫింగర్స్
కావల్సిన పదార్థాలు: బేబీ కార్న్‌లు - పది, శెనగపిండి, బియ్యప్పిండి - పావు కప్పు చొప్పున, కారం - అర టీ స్పూను, వంటసోడా - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేగించడానికి సరిపడా.
తయారు చేసే విధానం: ఒక్కో బేబీ కార్న్‌ను నిలువుగా సగానికి కోసి రెండు ముక్కలు చేయాలి. తర్వాత ఒక గిన్నెలో శెనగపిండి, బియ్యప్పిండి, కారం, ఉప్పు, వంటసోడా వేసి, సరిపడా నీళ్ళు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. తర్వాత కడాయిలో నూనె పోసి అది వేడెక్కాక బేబీ కార్న్ ముక్కల్ని బజ్జీల పిండిలో ముంచి, పిండి బాగా పట్టాక, నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేగించాలి.