Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెవిలో పేరుకునే గులిమి తీయడానికి ఇంతకు ముందు మనందరం కూడా పిన్నీసులు, అగ్గిపుల్లలు వాడే వాళ్లం. దాని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురుకునేవాళ్ళు. అగ్గిపుల్లలు విరిగిపోయి, చెవిలోనే ఇరుక్కుపోవడం వంటివి జరిగినపుడు సెప్టిక్ అయ్యేది. కొంత మంది పిన్నీసుతో గులిమి తీసుకునేటపుడు లోపలికి తగిలి కర్ణభేరి దాకా పోయి చెవుడు వట్టిన వాళ్ళూ ఉన్నారు. వీటన్నిటినీ వదిలేసి ఇప్పుడు సాఫ్టుగా ఉండే ఇయర్ బడ్స్ వస్తున్నాయి. ఒక చిన్న ప్లాస్టిక్ పుల్లకు స్టెరిలైజెడ్ దూది చుట్టి ఉండే ఇయర్ బడ్స్ చాలా క్షేమకరంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ బడ్స్ వాడుతున్నారు. సేఫ్టీగా వాడుకునేందుకు ఈ ఇయర్ బడ్స్ చాలా బాగుంటున్నాయి. ఇంకా పల్లెటూర్లలనూ, కొంతమంది నిరక్షరాస్యులు పిన్నీసులు, అగ్గిపుల్లలు వాడుతున్నారు. చెవులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇయర్ బడ్స్ వాడండి. ఇయర్ బడ్స్ గురించి అవగాహన కల్పించేందుకు ముందుగా మనం బొమ్మలు చేద్దాం.
ఇల్లు కడదాం
ఇటుకలు, సిమెంటు లేకుండా ఇయర్ బడ్స్ ఉంటే చాలు. మొదట ఒక ధర్మోకొల్ షీటును తీసుకుందాం. నలుచదరంగా ఉండే ధర్మోకొల్ షీట్ ఇంటికి బేస్ అన్నమాట. ఇల్లు కోసం నాలుగు గోడలు కట్టాలి. గోడలు పొడవుగా ఉండాలి కాబట్టి పొడుగు ఇయర్ బడ్స్ వాడాలి. లేదంటే రెండు బడ్స్ కలిపి పొడుగ్గా చేయవచ్చు. ద్వారా ఉన్నవైపు మామూలు బడ్స్ వాడవచ్చు. నాలుగు వైపులా బడ్స్‌తో గోడలు కట్టాలి. ఇంటి మీద కప్పు వెయ్యాలి. ఒక అట్టముక్కను తీసుకొని మధ్యకు మడవాలి. దీనినే ఇంటి కప్పులా వేసుకోవాలి. ఈ అట్ట ముక్కను తీసుకొని మధ్యకు మడవాలి. దీనినే ఇంటి కప్పులా వేసుకోవాలి. ఈ అట్టముక్క మీద బడ్స్‌ను అతికించుకుంటూ రావాలి. మొత్తం అతికించాక కప్పును ఇంటి మీద పెట్టి అతికించాలి. ఇప్పుడు ఇంటికి ప్రహరీ గోడ కట్టాలి. దానికిగాను ధర్మోకాల్ షీటు మీద ఒక్కొక్క ఇయర్ బడ్ను నిలువుగా గుచ్చుకుంటూ రావాలి. ఇయర్‌బడ్‌కు ఒకవైపు దూది కత్తిరిస్తే ఇలా ప్రహరీగోడకు పనికొస్తుంది. ప్రహరీ గోడకు ఒక గేటును కూడా అమర్చవచ్చు. ఇంట్లో ఒక చెట్టును కూడా నాటుదాం. పొడుగ్గా ఉన్న ఒక కర్రముక్కకు చుట్టూతా బడ్స్‌ను పెట్టి టేప్‌తో చుట్టాలి. ఇలా గుండ్రంగా చుట్టుకుంటూ పోతే చెట్టులా తయారవుతుంది. చూడండి ఇల్లు ఎంత బాగా కట్టామో!
ఉయ్యాల వేసుకుందాం
కట్టెలతోనూ, ఇనుముతోనూ, వెదురుతోనూ ఉయ్యాలను తయారు చేస్తున్నారు. ఇంట్లో అమ్మ చీరతో కూడా పసిబిడ్డకు ఉయ్యాల అవుతుంది. సరే మనమైతే బడ్స్‌తో ఉయ్యాల చేద్దాం. మొదట ఉయ్యాల తొట్టిని చేద్దాం. తెల్లని కాగితం మీద బడ్స్‌ను అతికించి తొట్టిని తయారు చెయ్యాలి. దీనికి ఊలు దారం కట్టి వేలాడదీయాలి. నాలుగువైపులా కర్రలు పాతినట్టుగా ఉండి దానిమీద కప్పు ఉన్నట్టుగా ఉండాలి. నాలుగు వైపులా పెట్టే కర్రల కోసం న్యూస్ పేపర్‌ను చుట్టిన పుల్లలు తయారు చేయాలి. ఈ పుల్లకు బడ్స్‌ను చుట్టాలి. ఇలా నాలుగు పుల్లలు తయారు చేయాలి. పైన వేసే కప్పు కోసం ఇల్లు కట్టినపుడు వంపిన అట్టలా తయారు చేయాలి. కాకపోతే అట్టముక్క కాకుండా గట్టి కాగితం ఉంటే చాలు. ఈ కప్పును నాలుగు కర్రలపై అమర్చాలి. మొదట్లో తయారైన ఉయ్యాల తొట్టిని కప్పుకు వేలాడదీయాలి. చక్కని ఉయ్యాల తయారైంది.
పువ్వులు చేద్దాం
ఒక అట్టను తీసుకొని దానిమీద కలర్ వెయ్యాలి. కలర్ వెయ్యకపోయినా కూడా బాగుంటుంది. ఎరుపు, బులుగు, పసుపు రంగుల్లో ఉన్న మట్టిని తీసుకుని ముద్దలా చేసి కొద్దిగా వత్తితే అప్పచ్చిలా వస్తుంది. దీనిని మధ్యలో ఉంచి చట్టూరా బడ్స్ అతికించాలి. ఇయర్‌బడ్స్‌ను మధ్యకు కత్తిరించాలి. ఈ ముక్కల్ని ప్లాస్టిక్ మట్టి చుట్టూ అతికిస్తే చక్కని పద్మం తయారవుతుంది. ఇలా ఐదారు పూలు చేసుకోవాలి. వాటికి చెట్ల తీగలు అమరిస్తే మొత్తం పూల తీగ తయారవుతుంది.
అమ్మాయి బొమ్మ
ఒక డ్రాయింగ్ షీటును తీసుకుని అందమైన అమ్మాయి బొమ్మను గీసుకోవాలి. ఒకవేళ వేయడం రాకుంటే కార్బన్ పేపర్ సహాయంతో వేసుకోవాలి. బొమ్మనంతా బ్లాక్ కలర్ ఇంక్‌తో గానీ, స్కెచ్‌తో గానీ దిద్దాలి. ఈ బొమ్మలో అమ్మాయి లాంగ్ ఫ్రాక్ తొడుక్కున్నట్టుగా వెయ్యాలి. ఇప్పుడు నడుము భాగం దగ్గర నుంచీ బడ్స్ కింది దాకా అతికించాలి. మొదటగా బడ్స్‌ను రెండు ముక్కలుగా కత్తిరించాలి. బడ్స్‌కు ఉండే ప్లాస్టిక్ పుల్ల రంగుల్లో ఉంటుంది. దాదాపుగా ఎరుపు, బులుగు, వరుసలుగా కుచ్చులు పెట్టినట్టుగా అతికించుకోవాలి. అతికించటంలో నైపుణ్యం దాగి ఉన్నది. కుచ్చుల గౌను తయారు అవుతుంది. జాకెట్ భాగంలో రంగు వేసుకుంటే బాగుంటుంది. అందంగా కుచ్చుల గౌను వేసుకున్న అమ్మాయి తయారయింది.
వాల్ హ్యాంగింగ్
ఒక చెక్క స్కేలును గానీ అట్టముక్క గానీ తీసుకోవాలి. ఇది కనిపించకుండా ఊలు చుట్టేయాలి. ఇలా తయారు చేసి పక్కనుంచాలి. ఇప్పుడు ఇయర్ బడ్స్‌ను ఒక దానిపై ఒకటి నలుచదరంగా పెట్టి అతికించాలి. మళ్ళీ మధ్యలో రెండు బడ్స్ పెట్టాలి. ఇలాంటి నలుచదరాలు పది వరకు చేసి పెట్టుకోవాలి. కావాలంటే ఎక్కువైనా చేసుకోవచ్చు. పింక్ రంగు కాగితంతో పువ్వులు చేసి నలుచదరాల మీద అతికించాలి. పువ్వు మధ్యలో ముత్యం అతికించాలి. ఊలు చుట్టిన కర్రకు నాలుగు చదరాలు అతికించాలి. మళ్ళీ నాలుగు చదరాలు తీసుకుని కిందే అతికించాలి. మళ్ళీ రెండు చదరాలు తీసుకొని మధ్యలో రెండింటి కింద అతికిస్తే వాల్ హ్యాంగింగ్ తయారవుతుంది.
పూల కొమ్మలు చేయవచ్చు
పది రూపాయల బిళ్ళంత అట్టముక్కను గుండ్రంగా కత్తిరించి పెట్టుకోవాలి. బడ్స్‌ను తలల వరకు కత్తిరించుకోవాలి. మల్లెమొగ్గల్లా కనిపిస్తాయి. బడ్స్ తలల్ని అట్ట మీద వరసల్లో అతికించుకుంటూ పోవాలి. పువ్వులా వస్తుంది. గతంలో పూల జడలు కుట్టేటపుడు ఇలాగే మల్లె మొగ్గల బిళ్ళలు కుట్టిపెట్టుకునేవాళ్ళు. ఇలా ఐదారు పువ్వులను రెడీ చేసి పెట్టుకోవాలి. ఇనుప తీగలకు ఈ పూలను గుచ్చితే పువ్వుల తీగ అమరుతుంది. రైదారు తీగలను మెలివేసి ఒక బొమ్మ తయారు అవుతుంది.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్