Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలామంది ఉద్యోగంలో చేరినప్పుడు నిర్ణీత సమయంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని అనుకుంటారు. కానీ ఏండ్లు గడుస్తున్నా.. ఫలితం శూన్యమే. అందుకే లక్ష్యం ఉంటే సరిపోదంటున్నారు నిపుణులు. కృషి, దానికి సరైన మార్గం ఎంచుకుంటేనే గమ్యాన్ని చేరగలరని చెబుతున్నారు.
కలలు కని లక్ష్యాలను చేరుకునే వారు ప్రపంచంలో ఎనిమిది శాతం మాత్రమే అని ఓ అధ్యయనంలో తేలింది. ఆ ఎనిమిది శాతంలో ఉండాలంటే కొత్త మార్గాన్ని అన్వేషించాలి. అది సరైనదై ఉండాలి. లేదంటే ఆ వైఫల్యం ఆత్మన్యూనతగా మారుతుంది. అలాకాక లక్ష్యాన్ని అందుకుంటే ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. దీన్ని పొందాలంటే ముందుగా ఆ లక్ష్యం ఎందుకంత ముఖ్యమో ఆలోచించాలి. దాంతో జీవితంలో మరెన్ని విజయాలు సాధించగలమో అవగాహన ఉండాలి.
కుటుంబ, సామాజికపరంగా ఎటువంటి గుర్తింపు వస్తుంది, దీనివల్ల ప్రయోజనాలు, మనోశక్తితో జీవితాన్ని కావలసినట్టు ఎలా తీర్చిదిద్దుకోవచ్చు అనేవీ తెలుసుకోవాలి. ఇవన్నీ పట్టుదలను పెంచి ముందడుగు వేసేలా చేస్తాయి.
ప్రాముఖ్యత.. జీవిత లక్ష్యానికి ఎక్కువగా ప్రాముఖ్యత, ప్రాధాన్యతనివ్వాలి. రోజూ దానికి దగ్గరగా జరుగుతున్నామా లేదా గుర్తించాలి. సమయం వృథా కాకుండా, వినియోగించుకొనేలా నిబద్ధతగా ప్రణాళిక వేయాలి. లేదంటే గడిచిన క్షణం తిరిగి రాదు. దాని వల్ల బాధపడి ప్రయోజనం ఉండదు. అవసరమైతే మార్గాన్ని మార్చి కృషి చేస్తే దక్కే చిన్న ఫలితం కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మరొక అడుగు వేయడానికి ప్రోత్సాహంగా మారుతుంది.
కొత్త మార్గాలు కూడా తెలుస్తాయి. లక్ష్యసాధనలో అడ్డంకులు వస్తేనే దాని విలువ మరింత పెరుగుతుంది. కష్టాలెదురయ్యాయని అక్కడితో వదిలేయకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి.
ఇందు కోసం మనలోని శక్తిని మనమే గుర్తించి వినియోగించుకోగలిగితే చాలు. ఎటువంటి లక్ష్యమైనా సాధించొచ్చు.