Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెండకాయ, బీరకాయ, సొరకాయ... ఎప్పుడు చూసినా ఇవేనా అంటూ మొహం మాడ్చేస్తుంటారు పిల్లలు. ఎప్పటికప్పుడు కొత్త వెరైటీలు కావాలని మారాం చేస్తుంటారు. అందుకే సులభంగా చేయగలిగే కొన్ని కొత్త రకం కూరలు...
వెజిటబుల్ మసాలా
కావల్సిన పదార్థాలు: కీరదోస - రెండు, క్యారెట్ - ఒకటి, సెనగపిండి - వంద గ్రాములు, ఎండు కొబ్బరి తురుము - రెండు టేబుల్ స్పూన్లు, గసగసాలు - రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిగడ్డ - రెండు, టమాటాలు - మూడు, పచ్చిమిర్చి - రెండు, కారం - టీస్పూను, నూనె - రెండు టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద - టేబుల్ స్పూను, గరంమసాలా - టీ స్పూను, కొత్తిమీర - కట్ట, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం: కీరా తొక్క తీసి రెండు చెక్కలుగా చేయాలి. లోపలి గింజలు తీసి కాస్త వెడల్పాటి ముక్కలుగా కోయాలి. విడిగా ఓ గిన్నెలో క్యారెట్ తురుము, సెనగపిండి, ఉప్పు, కారం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కీరాదోసముక్కల్లో పెట్టి ఆవిరిమీద ఉడికించాలి. గసగసాలు, ఎండు కొబ్బరి కలిపి మెత్తగా రుబ్బాలి. విడిగా ఓ బాణలిలో నూనె పోసి గరం మసాలా, ఉల్లిగడ్డ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తర్వాత ఎండుకొబ్బరి, గసాల ముద్ద కూడా వేసి వేయించాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. నూనె బయటకు వస్తుండగా ఉడికించి కీరా ముక్కల్ని కూరలో వేసి దగ్గరగా ఉడికించి కొత్తిమీర చల్లి దించాలి.
జపనీస్ వెజిటబుల్ కర్రీ
కావల్సిన పదార్థాలు: ఆలూ - మూడు (మీడియం సైజువి), సొరకాయ - చిన్నముక్క, తాజా బఠాణీలు - కప్పు, ఉల్లిగడ్డ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - రెండు (కచ్చాపచ్చాగా నూరాలి), అల్లం తురుము - టేబుల్ స్పూను, కూర కారం - రెండు టేబుల్ స్పూన్లు (దీన్ని ఒకటిన్నర టేబుల్స్పూన్ల నీళ్లతో పేస్టులా చేయాలి), క్యారెట్లు - మూడు (అర అంగుళం మందంలో గుండ్రంగా కోయాలి), కాలీఫ్లవర్ రెమ్మలు - ఒకటిన్నర కప్పులు, కెచప్ - టేబుల్ స్పూను, సోయాసాస్ - టేబుల్ స్పూను, మైదాపిండి - రెండు టీస్పూన్లు (టేబుల్ స్పూను నీళ్లలో జారుగా కలపాలి), నూనె - రెండు టేబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం: ఆలూ పొట్టు తీసి ముక్కలుగా కోసి చల్లని నీళ్లలో పోసి ఉంచాలి. అందులోనే ఉప్పు కూడా వేసి కలపాలి. మందపాటి బాణలిలో నూనె పోసి కాగాక ఉల్లిగడ్డ ముక్కలు వేసి వేయించాలి. అల్లంముద్ద, వెల్లుల్లిముద్ద కూడా వేసి వేగాక కూరకారం పేస్టుని వేసి కలపాలి. తర్వాత క్యారెట్, కాలీఫ్లవర్ ముక్కలు వేసి మూడు నాలుగు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు నీళ్లలో వేసి ఉంచిన ఆలూ ముక్కలు, బఠాణీలు, సొరకాయ ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు సోయాసాస్, మైదాపిండి పేస్టు, కెచప్ అన్నీ వేసి కలపాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి ముక్కలు ఉడికి, కూర దగ్గరగా అయ్యే వరకూ ఉంచి దించాలి.
పాలక్ కార్న్ గ్రేవీ
కావల్సిన పదార్థాలు: పాలకూర - రెండు కట్టలు, మొక్కజొన్న పొత్తులు - రెండు, ఉల్లిగడ్డ - ఒకటి, నూనె - రెండు టేబుల్ స్పూన్లు, పాలు - కప్పు, ఆవాలు - టీస్పూను, జీలకర్ర - టీస్పూను, ఎండుమిర్చి - ఒకటి, కరివేపాకు - కట్ట.
తయారు చేసే విధానం: మొక్కజొన్న గింజల్ని కచ్చాపచ్చాగా రుబ్బాలి. బాణలిలో నూనె పోసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసి వేగాక మొక్కజొన్న గింజల ముద్ద వేసి కలిపి కాసేపు ఉడికించాలి. తర్వాత పాలు పోసి కలపాలి. సన్నగా తరిగిన పాలకూర, ఉప్పు వేసి అది ఉడికే వరకూ ఉంచాలి. ఇది రోటిల్లోకి బాగుంటుంది.
క్యాప్సికమ్ కొబ్బరి
కావల్సిన పదార్ధాలు: ఎరుపు, పసుపు, ఆకుపచ్చ క్యాప్సికమ్‌లు - మూడు (ఒక్కొక్కటి చొప్పున), ఆవాలు - టీస్పూను, జీలకర్ర - టీస్పూను, కొబ్బరితురుము - కప్పు, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం: క్యాప్సికమ్‌ను కడిగి తుడిచి నూనె రాసి మంట మీద నేరుగా కాల్చాలి. ఇప్పుడు వీటిని గాలిచొరని డబ్బాలో పెట్టి కాసేపు ఉంచాలి. తర్వాత కాలిన పై పొరను తీసేసి క్యాప్సికమ్‌లను సన్నని ముక్కలుగా కోయాలి. నాన్‌స్టిక్ పాన్‌లో నూనె పోసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసి ఉప్పు వేసి కలపాలి. చివరగా కొబ్బరితురుము వేసి దించాలి. ఇది అన్నంలోకి రోటీల్లోకి కూడా బాగుంటుంది.