Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆఫీసులో అదే పనిగా పనిచేయడం కష్టమే. విరామానికని పక్క వాళ్లతో మాటామంతీ కలుపుతుంటాం. వాటిని సరదా సంగతుల వరకే పరిమితం చేయమంటున్నారు నిపుణులు. ఎంత స్నేహితులైనా వ్యక్తిగత అంశాలను చర్చించొద్దు అంటున్నారు.
స్నేహితులన్నాక ఇంట్లో సరదా సంఘటనలు, పిల్లల కబుర్లు షేర్ చేసుకోవడం సహజమే. సందర్భానికి తగ్గట్టుగా ఏదైనా సంఘటన జరిగితే అంతవరకూ పంచుకొని వదిలేయండి. అంతేకానీ దానిపై చర్చలొద్దు. మీ ఇంటి విషయాలు అందరికీ ఆసక్తి కలిగించవు. మీరేమనుకుంటారో అని విన్నా.. తర్వాత మిమ్మల్ని చిన్నచూపు చూసే అవకాశమూ లేకపోలేదు.
అభిమాన నటులు, నాయకులు, పార్టీలు.. ప్రతి ఒక్కరికీ మామూలే. మీ అభిమానం పక్క వాళ్లకి ఇబ్బంది కాకూడదు కదా. ప్రతి అప్డేట్నీ పంచుకోవడం, వాళ్ల గొప్పతనాన్ని చర్చించడం మీకు ఆనందమే.. తోటివాళ్లకు కాదు.
చాలా సంస్థలు ఈ మధ్యే తిరిగి ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఇంట్లో పనిచేసిన వాతావరణం కదా! ఒక్కసారిగా మీరు ఆఫీసుకు రావడం ఇబ్బందిగా తోయొచ్చు. అది అందరి సమస్య కూడా. ఒకట్రెండు సందర్భాల్లో బయటపటడం మామూలే. అయితే దాన్ని కొనసాగించొద్దు. పైవాళ్ల వరకూ వెళితే మీపై ప్రతికూల అభిప్రాయం ఏర్పడగలదు. పైవాళ్ల సూచనలు, మీతో చర్చించిన విషయాలనూ అధికారికంగా ప్రకటించే వరకూ వేరేవాళ్లకు చెప్పొద్దు. ఇలా చేస్తే మీ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతుంది.
షాపింగ్ అంటే అందరికీ ఇష్టమే. కానీ ధరలు, బేరాలాడటం, డిస్కౌంట్ల చర్చలకూ ఆఫీసు వేదిక కాకూడదు.
ఆరోగ్యం బాలేదా.. కారణం చెప్పి వదిలేయండి. వైద్యసలహా కావాలంటే తప్ప లోతుగా చర్చించొద్దు. మీ భాగస్వామితో అనుబంధమూ మీకే ప్రత్యేకం. మీ అన్యోన్యత వివరాలు, బంధంలో సమస్యల్నీ ఏకరువు పెట్టొద్దు. స్నేహితులని అన్నింటినీ పంచుకుంటాం. నిజమే.. ఆఫీసు స్నేహాలకు, సాధారణ వాటికీ తేడా ఉంటుంది. సత్సంబంధాలను నెరిపితే చాలు. ప్రతిదీ పంచుకోవాల్సిన పనిలేదు. ఆ పరిమితులను పాటిస్తేనే.. మీకూ మంచిది, గౌరవప్రదం.