Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ హౌటల్ నుంచి ఫుడ్ పార్మిల్ చేయించుకున్నా వెడల్పుగా గుండ్రంగా ఉండే ఫుడ్ బౌల్స్‌లో పెట్టి ఇస్తారు. ముఖ్యంగా పలావ్, బిరియానీ వంటివి తీసుకున్నపుడు అదంతా పట్టేలా పెద్ద ఫుడ్ బౌల్స్‌లో పెడతారు. మనం వాటిని తినేశాక ఆ ఫుడ్స్ బౌల్స్‌ను పారేస్తాం. ఇలాంటి పెద్ద పెద్ద బౌల్స్‌తో ఇంటికి ఉపయోగపడే వస్తువులు తయారు చేద్దాం. ప్లాస్టిక్స్ పాలియర్స్. ఇవి పెట్రోలియం వంటి కెమికల్స్‌తో తయారు చేయబడతాయి. మోనోమర్స్ అనే అణువుల చైన్లు తయారై అవి పాలియర్స్గా తయారవుతాయి. ఈ ప్లాస్టిక్స్ బలంగా, మన్నిక గలిగి, తక్కువ బరువు కలిగి, నీటిని పీల్చుకోకుండా ఉంటాయి. అంటే కాకుండా వీటిని తయారు చేయటానికి ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు కావు. ఇంకా సులభంగా కూడా తయారు చేయవచ్చు. ఈ కారణాల వల్ల ప్లాస్టిక్ పదార్థాలు మన జీవితాల్లోకి చొరబడ్డాయి. అయితే రావడం సులభంగానే వచ్చినా వీటిని వదిలించుకోవడం కష్టమని ఆ తర్వాత గానీ మనకు తెలిసి రాలేదు.
డ్రెస్సింగ్ టేబుల్
ఫుడ్ బౌల్ మూత తీసేసి బౌల్‌కు చివర్న ముడి వలె ఉండే గట్టి ప్లాస్టిక్‌ను కొద్దిగా కత్తిరించాలి. రెండు చివర్లా కొద్దిగా వదిలి మధ్య భాగమంతా కత్తిరిస్తే పట్టుకునే హ్యాండిల్ వలె పనికొస్తుంది. కత్తిరించిన భాగాన్ని పైకి లాగి మధ్యకు ముడి వేయాలి. దారంతో వేసిన ముడి మీద సిల్క్ రిబ్బన్‌తో 'బౌ' కట్టాలి. నలుపు రంగును తీసుకొని ఫుడ్బౌల్ మొత్తం వెయ్యాలి. రంగు రంగుల డ్రాయింగ్ షీట్లను తీసుకొని త్రికోణాకారపు ముక్కలకుగా కత్తిరించుకోవాలి. వీటి కోసం పెద్ద పెద్ద డ్రాయింగ్ షీట్లను కొనాల్సిన అవసరం లేదు. బెత్తెడు వెడల్పు ఉండే రంగుల అట్టలు షాపుల్లో దొరుకుతాయి. ఒకవేళ ఇవి దొరక్కపోతే బిస్కెట్ ప్యాకెట్ తినేశాక మిగిలే రేపర్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇలాగే సోప్ రేపర్స్, కుర్కురే, నూడుల్స్ వంటి వాటి రేపర్స్ వాడుకోవచ్చు. ఇప్పుడు నలుపు రంగు డబ్బా మీద కత్తిరించిన త్రికోణాకారపు రాగితసే ముక్కల్ని అతికించాలి. పూర్తిగా అతికించాక అందమైన డిజైన్లా కనిపిస్తుంది. పై భాగంలో ఇందాక దారంతో కట్టాము కదా! అందువలన ఫుడ్ బౌల్ నాలుగు విభాగాలుగా కనిపిస్తుంది. దువ్వెనలు, క్లిప్పుులు, స్లైడులు, హెయిర్ బ్యాండ్లు, సేప్టీ పిన్నులు వంటివి పెట్టుకోవచ్చు.
పూలకుండీలుగా
వీటిలో ధనియాలు, మెంతులు, పెసలు వంటి వాటిని నాటితే మొలకలు వస్తాయి. చాలామంది వంటింట్లోనే వీటిని పెంచుతున్నారు. అయితే డబ్బాలను అలాగే వాడుకుంటే బాగుంటుందా! అందుకే మిక్కీమౌస్, డొనాల్డ్‌డక్ వంటి కార్టూన్ పాత్రలను పెయింట్ చెయ్యడం కానీ రంగుల స్పాంజి పేపర్లతో గానీ అతికించవచ్చు. బొమ్మల బొమ్మల కుండీలు తయారౌతాయి. లేదంటే వంటింట్లో పప్పులు పోసుకునే డబ్బాలుగా కూడా వాడవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో లభించే పెరల్పెట్, జోయో, నేచర్ వంటి ఎన్నో కంపెనీల పప్పుడబ్బాలు కొనకుండా వీటిని వాడుకోవచ్చు.
వంటింటి ఆర్గనైజర్
రెండు ఫుడ్ బౌల్స్‌ను తీసుకుని వాటి వెనక భాగంలో ఉన్న అడుగు భాగాన్ని గుండ్రంగా కత్తిరించి తీసివేయాలి. రెండింటి అడుగుభాగాన్ని కత్తిరించి ఒక దాని మీద ఒకటి పెట్టి అతికించాలి. అడుగునున్న ఫుడ్బౌల్కు మూతపెట్టేయాలి. అంటే మధ్య భాగం ఖాళీగా ఉండటం వల్ల పెట్టే వస్తువులు కింది దాకా పెట్టుకోవచ్చు. కూజా ఆకారంలో తయారైన ఫుడ్బౌల్స్కు పై భాగాన కింది భాగాన లేసులు అతికించవచ్చు. మధ్య భాగంలో ఒక బొమ్మను కత్తిరించి అతికించాలి. అందమైన ముఖ చిత్రంతో ఆర్గనైజర్ తయారయింది. ఇందులో వంటింటికి అవసరమైన స్పూనులు, ఫోర్కులు వంటివి పెట్టుకోవచ్చు. ఇంకా అట్లకాడలు, గరిటలు, చెంచాలు పెట్టవచ్చు. వంటింటి గట్టు మీద పెట్టుకుని, వాడుకున్నన్నాళ్ళు వాడుకుని పారవేయవచ్చు. మళ్ళీ మరో కొత్త వస్తువు తయారీకి శ్రీకారం చుట్టవచ్చు. ఎప్పటికప్పుడు కొత్త వస్తువులు తయారు చేసుకుంటుంటే ఆ ఆనందమే వేరు.
పూలసజ్జ
పూల సజ్జ అంటే పూలే పెట్టుకోవాలనేమీ లేదు. ఏదైనా టేబుల్ మీద పెట్టుకుని పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు, షార్పెనర్లు వంటివి పెట్టుకోచ్చు. పెద్ద ఫుడ్ బౌల్‌ను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మార్కెట్లో దొరికే గ్లిట్టర్ షీట్లను తెచ్చుకుని సన్నని చీలికలుగా కత్తిరించి పెట్టుకోవాలి. సన్నగా అంటే రెండేళ్ళ వెడల్పులో ఉంటే బాగుంటుంది. చీలిక పొడవు ఫుడ్ బౌల్ కన్నా ఒక వేలెడంత ఎక్కువ ఉండేలా కత్తిరించాలి. ఇప్పుడు గ్లూగన్తో గ్లిట్టర్ చీలికను ఫుడ్ బౌల్‌కు ఒక వైపున అతికించాలి. రెండవ చివర చీలికను ఫుడ్బౌల్కు ఒకవైపున అతికించాలి. రెండవ చివర చీలిక రెండో వైపును అతికించాలి. చీలిక కొద్దిగా ఎక్కువ పొడవు కత్తిరించాం కాబట్టి రెండు చివర్లు కిందకు, మధ్యలో ఎత్తుగా ఉంటూ వస్తుంది. గ్లిట్టర్ షీటు అవడం వల్ల మెరుపులు కనిపిస్తాయి. ఇదొక బుట్ట ఆకారంలో వస్తుంది. పూర్వం ఇళ్ళలో ఇలాంటి బుట్టల్ని ఉల్లిపాదులు పోసుకునేందుకు వాడేవారు. చీలికల మధ్యలో ఖాళీ ఉండటం వల్ల ఉల్లిగడ్డ బుట్ట అంటారు. దీనికి ఇప్పుడు ఒక కాడను పెట్టాలి. దీనికోసం మరో ఫుడ్బౌల్ను సన్నని చీలికలా కత్తిరించి ఉంచుకోవాలి. దీని మీద గ్లిట్టర్ షీటు అతికించాలి. దీనిని ఫుడ్బౌల్కు రెండు వైపులా అతికిస్తే పూల సజ్జలా మారుతుంది. కాడ మీద పూసలు, తళుకులు అతికిస్తే ఇంకా బాగుంటుంది.
జువెల్లరీ బాక్స్
ఒక ఫుడ్బౌల్ను తీసుకుని దాని మీదున్న మూతను తీసి పెట్టుకోవాలి. మొదటగా మూత మీద డెకరేషన్ చేద్దాం. ఒక పురికొసను తీసుకుని మూత మీద చుట్టుకుంటూ రావాలి. సన్నని పురికొసను వాడితే బాగుంటుంది. ఇప్పుడు పురికొసను మూడు ముక్కలు కట్ చేసుకుని వాటిని జడ లాగా అల్లాలి. మూత మీద ఈ జడను లేస్ లాగా అతికించాలి. పురికొసను చిన్న ముక్కలుగా కత్తిరించి పూల రెక్కల్లాగా దాని మీద అతికిస్తే బాగుంటుంది. ఇది చెక్కమీద చెక్కిన చెక్కడం లాగా కనిపిస్తుంది. ఇలా పువ్వులు, ఆకులు వేసి లతలు లాగా అమర్చాలి. అదే విధంగా మూత మీద అమర్చినట్టే కింది డబ్బాను కూడా అలంకరించాలి. డబ్బా మీద కూడా పురికొసతో డిజైన్లు వేయాలి. ఇలా డబ్బాను, మూతను అలంకరించి చూడండి. ఎంత అందంగా ఉంటుందో ఇందులో జువెల్లరీ పెట్టుకుంటే బాగుంటుంది.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్