Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బరువు తగ్గాల్సిన అవసరమో, లేదా దాని ఆలోచనో వచ్చినప్పుడు దాని గురించి డైరీలో పొందుపరచాలి. పెండ్లికి ముందు సన్నబడాలని కాబోయే వధువులు కోరుకుంటారు. తాము వెళ్లనున్న వేడుకలో అనుకున్న దుస్తులు ఫిట్ అవడమే గోల్ ఇంకొందరిది. మరికొందరికి ఆరోగ్యరీత్యా బరువు తగ్గాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇలా ఎవరి లక్ష్యాలు వారివి. ఎవరైనా బరువు తగ్గాలనుకునే వారు ముందుగా ఎందుకు, ఎంత తగ్గాలనుకుంటున్నారు, దానికి ఎన్ని నెలలను గడువుగా పెట్టుకుంటున్నారు వంటి వివరాలన్నీ ఆ డైరీలో రాయాలి. అదే ప్రస్తుత లక్ష్యంగా భావించాలి. రోజూ నిద్రలేచిన వెంటనే ఆ పేజీలను తిరగేసి, లక్ష్యాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. అప్పుడే ఆసక్తి పెరుగుతుంది.
నెలలోనే 20 కేజీలు తగ్గిపోవాలంటే ఏం చేయాలి.. అనే ఆలోచనలు పక్కన పెట్టి, వాస్తవానికి దగ్గరగా ఆలోచించాలి. జిమ్‌లో చేరితే త్వరగా సన్నబడొచ్చు అనేది కూడా అపోహే. శాస్త్రీయంగా ఎంత బరువు తగ్గాలంటే ఎన్ని రోజులు పడుతుందనేది తెలుసుకోవాలి. రోజూ వ్యాయామాలకు సమయాన్ని కేటాయించుకోవాలి. శిక్షకుల సూచనలను పాటించడానికి సిద్ధంగా ఉండాలి. జిమ్‌కు వెళుతున్నాం కదా అని.. అమితంగా ఆహారం తీసుకోవడం లేదా పూర్తిగా తిండి మానేయడం.. ఈ రెంటివల్లా ప్రయోజనం లేదు. వ్యాయామాలకు తగిన ఫలితం దక్కాలంటే పోషకాలన్నీ అందేలా, మితంగా ఆహారాన్ని తీసుకోవడంపై నిపుణుల సలహాలు పాటించాలి. లేదంటే సన్నబడటం అనే మాట పక్కన పెడితే అనారోగ్య సమస్యలెదుర్కోవలసి ఉంటుంది.
బరువు తగ్గాలనే ప్రణాళిక నెరవేరాలనుకునే వారు వెంటనే అనుకున్నది జరగడంలేదని నిరాశ పడకూడదు. తమని తాము ప్రోత్సహించుకుంటూ, కెలోరీలు తగ్గించుకోవడమెలాగో అవగాహన పెంచుకోవాలి. నచ్చిన ఆహారానికి సైతం దూరంగా ఉండటానికి సిద్ధపడాలి. ఆ రోజు చేసిన వ్యాయామాలు, తీసుకున్న ఆహారం వంటి వివరాలను డైరీలో పొందుపరచాలి. ఈ వెయిట్‌లాస్ జర్నల్ మీలో స్ఫూర్తిని నింపుతుంది. లక్ష్యాన్ని చేరడానికి తోడవుతుంది. బరువు తగ్గడంతోపాటు దానికోసం పాటించిన నియమాలు మరిన్ని ఆరోగ్యపరమైన ప్రయోజనాలను అందేలా చేస్తుంది. అనుకున్నట్టుగా లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత, అదే బరువును కొనసాగించడానికి ప్రయత్నించాలి.