Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల వ్యాపారం చేసే మహిళల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఎవరి దగ్గరో ఉద్యోగం చేయడం కంటే మనమే సొంతంగా ఏదైనా బిజినెస్ చేయాలనుకోవడం మంచి విషయమే. అjయితే వ్యాపారం అంటేనే సవాలుతో కూడుకున్నది. ఎప్పుడు లాభాలొస్తాయో, ఏ క్షణం నష్టాలు పలకరిస్తాయో చెప్పలేము. దీనికి తోడు మార్కెట్లో పోటీని తట్టుకొని నిలదొక్కుకోవాలంటే నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే. అయితే ఇలాంటి సవాళ్లతో కూడిన ప్రయాణంలో ఎంత ప్రణాళికతో వ్యవహరించినా ఒత్తిడి, ఆందోళనలు దరిచేరడం సహజం. నిజానికి ఇలాంటి మానసిక సమస్యల్ని అధిగమించినప్పుడే అటు వ్యాపారంలో, ఇటు జీవితంలోనూ రాణించగలం అంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటించడం ముఖ్యమంటున్నారు. అవేంటో తెలుసుకుందాం...
ఈమధ్య స్టార్టప్‌లు, వ్యాపారాలు ప్రారంభించే యువతులు, మహిళలు పెరిగిపోతున్నారు. పోటాపోటీగా కొత్త కొత్త ఉత్పత్తుల్ని వినియోగదారులకు చేరువ చేస్తున్నారు. వీరిలో ఎంతోమంది వివిధ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ లాభాలు ఆర్జిస్తున్నారు. వ్యాపారవేత్తలుగా విజయం సాధిస్తున్నారు. అయితే ఈ వ్యాపార ప్రయాణంలో ఒత్తిళ్లు, ఆందోళనలు దరిచేరకుండా సాఫీగా ముందుకు సాగాలంటే కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు.
సరైన అవగాహన అవసరం
ప్రారంభించే వ్యాపారం విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా వ్యాపార ప్రయాణంలో ఒత్తిళ్లు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. అదే ఆ విషయంపై పూర్తి అవగాహన ఏర్పరచుకుంటే ఇటు ఆత్మవిశ్వాసాన్ని, అటు సృజనాత్మకతను మెరుగుపరచుకోవచ్చని, చాలామంది ప్రముఖ వ్యాపారవేత్తల విజయానికీ ఇదే కారణమని ఓ అధ్యయనం కూడా చెబుతోంది. కాబట్టి మీలోని భయాలు, అభద్రతా భావాలు పక్కన పెట్టి.. మీరు ప్రారంభించాలనుకున్న వ్యాపారం గురించి ముందుగా పూర్తి అవగాహన పెంచుకోండి. ఈ క్రమంలో అవసరమైతే ప్రత్యేక శిక్షణ తీసుకోవచ్చు.. లేదంటే నిపుణుల సలహాలూ పాటించచ్చు.
ఎప్పుడూ పనేనా..?
'పనిలో పడితే సమయమే తెలియదు' అంటుంటారు చాలామంది. వ్యాపారాలు, స్టార్టప్‌లు ప్రారంభించిన వారు కూడా ఎక్కువ సమయాన్ని ఆఫీస్‌లోనే గడిపేస్తుంటారు. అయితే దీనివల్ల కూడా మానసిక సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. కొంతమంది ప్రముఖులు కూడా చెబుతుంటారు.. 'ఆఫీస్ పనులకు, కుటుంబానికి సమప్రాధాన్యం ఇవ్వడం వల్లే ప్రశాంతంగా పని చేసుకోగలుగుతున్నాం. లాభాలు ఆర్జించగలుగుతున్నాం' అని! కాబట్టి పని రాక్షసుల్లా ఎప్పుడూ కార్యాలయానికే అంకితమవకుండా ఇంటికీ కొంత సమయం వెచ్చించండి. భాగస్వామితో, పిల్లలతో గడపండి. దీనివల్ల మీరు ఎంత బిజీగా ఉన్నా వారికీ మిమ్మల్ని మిస్సయ్యామన్న భావన ఉండదు. అలాగే మీకూ మానసిక ప్రశాంతత సొంతమవుతుంది. కావాలంటే ఓసారి ట్రై చేసి చూడండి.
ప్రణాళిక ప్రకారమే..
చాలామందికి ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేయడమే గగనం. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంటుంది. ఒకవేళ ఆ రోజు చేయాల్సిన పనుల గురించి ఉదయాన్నే ప్లాన్ చేసుకున్నా.. కొంతమంది వాటిని పూర్తి చేయలేకపోతారు. అసాధ్యమైన పనుల్ని నిర్దేశించుకొని ఒత్తిళ్లకు గురవుతుంటారు. అయితే తమ విధులను సమర్ధంగా నిర్వహించేవారు ఇలాంటి ఒత్తిళ్లను అధిగమించడానికి మరుసటి రోజు పనికి తగ్గ ప్రణాళికను ముందు రోజే సిద్ధం చేసుకుంటారని చెబుతున్నారు నిపుణులు. దాన్ని బట్టి ఆ రోజు ప్రాధాన్యమున్న పనుల్లో, ఆలోచనల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు. ఫలితంగా సకాలంలో పనులు పూర్తవుతాయి.. మానసికంగానూ ప్రశాంతంగా ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు వ్యాపార ప్రణాళికల్ని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవడం మంచిదన్నది నిపుణుల సలహా.
అధ్యయనం చేసే అలవాటు
ఆఫీసు, వ్యాపార పనుల్లో పడిపోయి చాలామంది చాలా విషయాల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. పఠనం కూడా అందులో ఒకటి. కానీ వ్యాపారాల్లో రాణించాలన్నా, ఒత్తిళ్లు దరిచేరకుండా ఉండాలన్నా దీన్ని అలవాటుగా మార్చుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే పుస్తకాలు, వార్తా పత్రికలు, మ్యాగజైన్లు.. వంటివి తరచూ ఫాలో అవడం వల్ల కొత్త ట్రెండ్స్‌పై అవగాహన పెంచుకోవచ్చు. దాన్ని బట్టి మన వ్యాపారాల్లో మార్పులు-చేర్పులు చేసుకుంటూ, సృజనాత్మక ఆలోచనల్ని జోడిస్తూ.. వినియోగదారుల్ని ఆకర్షించచ్చు. మనసుకు ఇంకా ప్రేరణ కావాలనిపిస్తే.. గొప్ప వ్యక్తుల స్ఫూర్తిదాయక కథల్ని, వారు అనుసరించే మార్గాల్ని మన వ్యాపారాలకు సోపానాలుగా మలచుకోవచ్చు. దీనివల్ల మార్కెట్లో మన పోటీదారుల కంటే ఓ మెట్టు పైనే ఉండచ్చు. వీటితో పాటు రోజూ ఉదయాన్నే 45 నిమిషాలు వ్యాయామం చేస్తే సత్ఫలితాలను అందిస్తాయి. అలాగే తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైనదైతే మనల్ని రోజూ ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.