Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ కాలంలో వచ్చే అనారోగ్యాలన్నింటికీ చెక్ చెప్పాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడమొక్కటే మార్గం. కాలాలకు తగిన ఆహారాన్ని తీసుకుంటే వ్యాధుల నుంచి కుటుంబాన్ని రక్షించుకోవచ్చు.
పల్లీలు: వీటిలో పుష్కలంగా ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, మైక్రో-మేక్రో న్యూట్రియంట్లు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఇవి శరీరానికి కవచంలా మారి చలికాలపు అనారోగ్యాల నుంచి కాపాడతాయి.
పాలు, అంజీరా: జీవక్రియలను సమన్వయం చేసే శక్తి అంజీరాలో మెండు. ఇది శరీరానికి తక్షణ శక్తినివ్వడమే కాక అధిక బరువు సమస్యను రానివ్వదు. రోజూ కప్పు పాలల్లో మూడు అంజీరాలను వేసి మరిగించి తీసుకుంటే మంచిది. ఇలా చేస్తే వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.
బెల్లం: ఐరన్, ఖనిజ లవణాలు పుష్కలం. దీనివల్ల మహిళలకు, పిల్లలకు ఆరోగ్య ప్రయోజనాలెన్నో. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. రక్తప్రసరణను సక్రమంగా జరిగేలా చేస్తుంది. రోజూ మితంగా బెల్లాన్ని తీసుకుంటే శీతకాలాన్ని కూడా ఆరోగ్యంగా గడపొచ్చు.
ఉసిరి: ఇందులోని సి విటమిన్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అనారోగ్యాల నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఈ పండ్లలోని ఫ్లావనాల్స్, రసాయనాలు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మెదడును ఆరోగ్యంగా ఉంచడంతో ఒత్తిడి, ఆందోళన దరి చేరవు. దీంతో మానసికారోగ్యమూ మెరుగు పడుతుంది. ఉసిరిలోని పీచు శరీరంలో త్వరగా కలిసి పోతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయులు త్వరగా పెరగవు. పీచు కారణంగా జీర్ణశక్తి మెరుగు పడి మలబద్ధకం దూరమవుతుంది.