Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్త ఆశలు.. సరికొత్త ఆశయాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమయ్యారు. మరో మూడు రోజుల్లో రానున్న కొత్త సంవత్సర వేడుకలకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే కొత్త సంవత్సరానికి కేక్ కట్ చేసి స్వాగతం పలుకుతుంటారు చాలా మంది. ఈ సమయంలో మార్కెట్లో కేక్ ఖరీదు ఎక్కువ ఉండటంతో పాటు.. నాణ్యత తక్కువగా ఉంటుంది. అందుకే కాస్త ఓపిక ఉంటే చాలు ఇంట్లోనే మనం కేక్‌ను చేసుకోవచ్చు. అంతేకాదు బయట చేసినవి ఎంత తిన్నా స్వయంపాకం టేస్ట్ వేరే కాబట్టి ఈ సంవత్సరం కేక్‌ను మీరే చేసుకోండిలా...
న్యూ ఇయర్ కేక్
కావలసిని పదార్థాలు: మైదా - కప్పు, చక్కెర - అరకప్పు, చాక్లెట్ పొడి, వెన్న, నూనె, పెరుగు, నీళ్లు - సరిపడా, పాలు - పావు కప్పు, ఉప్పు - పావు చెంచా, వంటసోడా - అర చెంచా, బ్రౌన్ షుగర్ - అరకప్పు వెనిగర్, వెనిల్లా ఎసెన్స్ - చెంచా చొప్పున.
తయారు చేసే విధానం: ముందుగా కేక్పాన్కు కొద్దిగా వెన్న రాసుకొని పెట్టుకోవాలి. ఓ గిన్నెలో మైదా, ఉప్పు, చక్కెర తీసుకొని కలపాలి. దాన్ని పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో వెన్న, నూనె, చాక్లెట్ పొడి, నీళ్లు తీసుకొని వాటిని స్టవ్ మీద సిమ్‌లో పెట్టాలి. అది చిక్కగా అయిన తర్వాత దింపేసి మైదా మిశ్రమంలో కలపాలి. ఇంకో గిన్నెలో పెరుగు, పావు కప్పు నీళ్లు, వెనిగర్, వెనిల్లా ఎసెన్స్, వంటసోడా కలుపుకోవాలి. వీటన్నింటిని మైదా మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కేక్ పాన్‌లోకి తీసుకోవాలి. ఇక ముందుగా వేడి చేసుకున్న ఓవెన్లో ఈ కేకు పాత్రను ఉంచి 35-40నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. ఓవెన్ లేకపోతే ఆరు లీటర్ల కుక్కర్లో కప్పు ఉప్పు వేసి సన్నని మంటపై పెట్టుకోవాలి. కుక్కర్ వేడి అయ్యాక కేక్ పాత్రను అందులో ఉంచి మూత పెట్టాలి(విజిల్ పెట్టకూడదు). ఇలా 40 నిమిషాల్లో కేక్ తయారు అవుతుంది.
రాగి కేక్
కావలసిన పదార్ధాలు: రాగి పిండి - ముప్పావు కప్పు, గోధుమ పిండి - ముప్పావు కప్పు, కొబ్బరి పాలు - ముప్పావు కప్పు, కొబ్బరి పాలు - ముప్పావు కప్పు, ఉప్పు - చిటికెడు, బేకింగ్ పౌడర్ - టీ స్పూను, బేకింగ్ సోడా - అర టీ స్పూను, బెల్లం పొడి - కప్పు, పంచదార - రెండు టేబుల్ స్పూన్లు, కోకో పొడి - మూడు టేబుల్ స్పూన్లు, బటర్ - 150 మి.లీ. (కరిగించినది), వెనిలా ఎసెన్స్ - టేబుల్ స్పూను, కొబ్బరి పాలు - కప్పు, పెరుగు - పావు కప్పు.
తయారుచేసే విధానం:హొముందుగా కేక్ ప్యాన్‌కి కొద్దిగా నెయ్యి పూయాలి. అవెన్‌ను 170 డిగ్రీల దగ్గర కనీసం పావు గంట సేపు ప్రీహీట్ చేయాలి. ఒక బౌల్లో రాగి పిండి, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, కోకో పొడి వీటన్నిటినీ జత చేసి జల్లించి పక్కన ఉంచాలి. మరో రెండు సార్లు జల్లెడ పట్టాలి. మెత్తగా చేసిన బెల్లం పొడి జత చేయాలి. ముప్పావు కప్పు కొబ్బరి పాలు జత చేయాలి. కరిగించిన బటర్, పెరుగు జత చేయాలి. ఉండలు లేకుండా అన్నీ బాగా కలిసేలా గరిటెతో కలియబెట్టాలి. ఇప్పుడు నెయ్యి రాసిన ట్రేలో ఈ మిశ్రమాన్ని పోసి, అవెన్ సుమారు అరగంట సేపు ఉంచాలి. బయటకు తీయడానికి ముందు సుమారు పావు గంట సేపు చల్లారనివ్వాలి. ఒక పాత్రలో పాలు, పంచదార, కోకో పొడి వేసి స్టౌ మీద ఉంచి, పంచదార కరిగేంతవరకు బాగా కలుపుకోవాలి. మంట బాగా తగ్గించి ఈ మిశ్రమాన్ని మరిగించాలి. ఇందులో వెనిలా ఎసెన్స్ వేసి, మిశ్రమం చిక్కబడేవరకు కలియబెట్టి, దింపి చల్లారబెట్టాలి. మిశ్రమం చిక్కగా, క్రీమీగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని కేక్ మీద సమానంగా పోసి చాకుతో సరిచేయాలి. అంతే... టేస్టీ టేస్టీ రాగి కేక్ రెడీ.
డ్రై ఫ్రూట్ కేక్
కావల్సిన పదార్థాలు: వెన్న - పావుకేజీ, చక్కెర - 125 గ్రాములు, కోడిగుడ్లు - నాలుగు, మైదా - 200 గ్రాములు, బేకింగ్ పౌడర్ - అరచెంచా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకుల పొడి - అరచెంచా చొప్పున, అన్ని రకాల డ్రైఫ్రూట్స్ - అరకేజీ, ఫ్రూన్స్ - వంద గ్రాములు (ఇవి బజార్లో దొరుకుతాయి. ఖర్జూరాల్లా ఉంటాయి), వాల్నట్స్ - వంద గ్రాములు (ముక్కల్లా తరగాలి), ఆరెంజ్ జ్యూస్ - రెండు టేబుల్ స్పూన్లు, కమలాఫలం తొక్కలపొడి - కొద్దిగా, వెనిల్లా ఎసెన్స్ - చెంచా.
తయారు చేసే విధానం: ఒక రోజు ముందు పెద్ద గిన్నెలో డ్రైఫ్రూట్స్ పలుకులూ, ప్రూన్స్ ముక్కలూ వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఓవెన్‌ని అరగంట ముందే 160 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసుకోవాలి. మైదా, బేకింగ్ పౌడరు కలిపి జల్లించి పెట్టుకోవాలి. వెన్ననీ, చక్కెరనీ ఓగిన్నెలో తీసుకుని నురగ వచ్చేలా గిలకొట్టి ఆరెంజ్ జ్యూస్, కమలాఫలం తొక్కలపొడి, వెనిల్లా ఎసెన్సు కలపాలి. తర్వాత ఒక్కో గుడ్డులోని సొన వేసుకుంటూ మరోసారి కలపాలి. ఇందులో పావు వంతు మైదా కలిపి తర్వాత మిగిలిన పిండినీ వేసి కలపాలి. మసాలా దినుసుల పొడి, డ్రైఫ్రూట్స్, వాల్నట్స్ వేసుకుని మరోసారి కలిపి బేకింగ్ గిన్నెలోకి తీసుకుని ఓవెన్లో ఉంచాలి. కనీసం అరగంట నుంచి నలభై నిమిషాల వరకూ బేక్ చేసి తర్వాత బయటకు తీసేయాలి.
ప్లమ్‌కేక్
కావల్సిన పదార్థాలు: గుడ్లు - నాలుగు, మైదా - 225 గ్రాములు, పంచదార - 225 గ్రాములు, పెరుగు - 225 గ్రాములు, కర్జూరం - అరకప్పు, కిస్మిస్లు - అరకప్పు, ఆరెంజ్ లెమన్ కాండీడ్ ఫ్రూట్ పౌడర్ - ఒక టేబుల్ స్పూను, జీడిపప్పు - అరకప్పు, బాదం - పది, టూటి ఫ్రూటీలు - రెండు టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క పొడి - అర టీ స్పూను, బ్లాక్ జాక్ (కేక్ రంగు మార్చడానికి వాడే పొడి) - రెండు టేబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం: రమ్ములో జీడిపప్పు, బాదం పప్పు కిస్మిస్లు, కర్జూరం వేసి నానబెట్టాలి.(పది రోజుల ముందే నానబెట్టాలి. గుడ్డు సొనని బాగా గిలకొట్టాలి. ఇందులో మైదా, పెరుగు, పంచదార, ఆరెంజ్ లెమన్ కాండీడ్ ఫ్రూట్ పౌడర్, దాల్చిన చెక్క పొడి, బ్లాక్ జాక్ వేసి బాగా కలపాలి. దీన్ని బ్రెడ్ మౌల్డ్‌లో పెట్టివోవెన్లో 180 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బేక చేయాలి. చివర్లో మనకి నచ్చిన డిజైన్‌లో అలంకరించుకోవాలి.