Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాగితం మానవ జీవితంలో ప్రధానమైన వస్తువు. పూర్వం రాసుకోవడానికి తాళపత్ర గ్రంధాలు వాడుకునేవారు. కాగితం కనిపెట్టబడ్డాకే గ్రంధ రచనల పని సులవయింది. ప్రసిద్ధ రచయితల అమూల్య గ్రంథాలు తరతరాల ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కాగితం మొక్కలోని సెల్యులోజ్ అనే పదార్థంతో తయారు చేస్తారు. పత్తి, జనపనార, వరి, లైనిన్ వంటి మొక్కలలోని సెల్యులోజ్ నుంచి కాగితాన్ని తయారు చేస్తారు. ఎక్కువగా వెదురు మొక్కల నార నుంచి కాగితాన్ని తయారు చేస్తారు. రాజుల కాలంలో పత్రాలు లేఖలు రాసుకోవడానికి గుడ్డ ముక్కలు వాడేవారు. కాగితాన్ని మొదటిసారిగా చైనాలోని చైలున్ అనే రాజోద్యోగి కనిపెట్టాడు. ఇతను పాత గుడ్డ పేలికలు, పాత చేపల వలలు, జనపనార చెత్తలతో కాగితం తయారు చేశాడు. హాన్ వంశపు రాజుల కాలంలో సాహిత్య విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలు అభివృద్ధి చెందడానికి కాగితం ఉపయోగపడింది. తెల్ల కాగితం, పుస్తకాల కాగితం, మైనపు కాగితం, లిట్మస్ కాగితం, నూలు కాగితం అని రకరకాల కాగితాలున్నాయి. 1450లో ముద్రణాయంత్రం కనుక్కున్నాక కాగితం విలువ పెరిగింది. మనం ఈ రోజు కాగితం గుజ్జుతో చేసే బొమ్మల గురించి తెలుసుకుందాం...
చదివేసిన పాత న్యూస్పేపర్లతో ఎన్నో రకాల బొమ్మలు తయారు చేయబడుతున్నాయి. పాత న్యూస్ పేపర్లను చిన్న చిన్న ముక్కలుగా చింపి రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టిన కాగితం ముక్కలు, రాత్రంతా నానబెట్టిన మెంతులు కలిపి రోట్లో రుబ్బేవాళ్ళం. మా చిన్నప్పుడు ఇలా తయారైన గుజ్జుతో చిన్న గిన్నెలు తయారు చేసే వాళ్ళు. ఆ గిన్నెలో ముగ్గుపిండి పోసుకుని ముగ్గు గిన్నెగా వాడుకునే వారు. ఇంకా తోలు ఊడిపోపయిన చేటలకు ఈ గుజ్జును పూసి ఎండలో ఎండబెట్టేవారు. అప్పుడు చేట నున్నగా తయారయి బియ్యం చెరుగుకోవడానికి బాగుంటుంది. ఇందులో కొద్దిగా పసుపు కూడా వాడేవారు. ఇంట్లో అమ్మా వాళ్ళు చేస్తుంటే చూసేదాన్ని. అదే కాగితపు గుజ్జుతో బొమ్మలు తయారు చేసి తిరణాలలో అమ్ముతుంటేవారు. ఇదొక కుటీర పరిశ్రమ.
ఏనుగు బొమ్మ చేద్దాం
కాగితపు గుజ్జు తీసుకుని ఏనుగు ఆకరాంలో మలుచుకుని పూర్తిగా ఎండలో ఎండబెట్టాలి. పూర్తిగా ఎండడానికి రెండు మూడు రోజులు పడుతుంది. ఎండలో ఎండాక దానికి రంగులు వేసుకోవాలి. ఏనుగు మీద అంబారీ ఉన్నట్టుగా తడిగా ఉన్నప్పుడే చీపురు పుల్లతో దిద్దాలి. అలాగే కండ్లు, తొండం మీత గీతల్ని గీయాలి. రంగులు వేసిన తర్వాత మరల ఎండలో ఎండబెట్టాలి. ఇప్పుడు చక్కని ఏనుగు బొమ్మ తయారు అవుతుంది. అద్దాల షెల్పులో పెడితే ఎంతో అందంగా కనిపిస్తుంది.
పూల కుండీలు
ప్లాస్టిక్ వినియోగం తగ్గడానికి ఇలాంటి ప్రకృతి సంబంధమైన కాగితపు గుజ్జుతో తయారైన బొమ్మలను ప్రోత్సహించవచ్చు. పగిలిపోయే పింగాణీ బొమ్మలకు బదులుగా షోకేసులను అలంకరించడానికి కాగితపు గుజ్జు బొమ్మలను వాడవచ్చు. మానవ రూపాలతో పాటుగా ఏనుగు, గుర్రం, పులి, జింక, జిరాఫీ, ఆవు, ఎద్దు, కుక్క వంటి జంతువులను తయారు చేసుకోవచ్చు. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఇలాంటి పరిశ్రమలు ఆధునీకరించబడి మహిళల ఆభరణాలు, చెవిపోగులు, కీచైన్లు, బుట్టలు, పెన్నులు, పెన్సిళ్ళు, అగరబత్తీలు వంటివెన్నో తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనం పూల కుండీలను తయారు చేద్దాం. కాగితపు గుజ్జులో ఫెవికాల్ కలిపి ముద్దగా చేసి ఉంచుకోవాలి. ఒక ప్లాస్టిక్ గిన్నెకు చుట్టూతా కాగితపు గుజ్జును మందంగా మెత్తాలి. కొద్దిగా ఆరిన తర్వాత చిలకలకు, చెట్లు వంటి మౌల్డుల సహాయంతో ఈ గుజ్జు మీద గట్టిగా వత్తినపుడు ఆయా ఆకారాలు కనిపించేలా వస్తాయి. అప్పుడు వాటిని బాగా ఎండబెట్టాక ఒక గిన్నెలా తయారవుతుంది. బయటివైపు నుంచి చెట్లు, లతలు, పూలు, చిలకలకు కనిపిస్తూ ఉంటాయి. వీటికి రంగులు వేసుకోవాలి. లేదంటే మొత్తం బంగారు రంగుతో స్ప్రే చేసుకున్నా కూడా బాగుంటుంది. దీనిలో పూల గుత్తుల్ని పెట్టుకుని పూల కుండీలా వాడుకోవచ్చు. లేదా దీనికి మూతను కూడా తయారు చేసుకుని జువెల్లరీ బాక్స్‌గా ఉపయోగించుకోవచ్చు.
వాల్హాంగింగ్ చేద్దాం
ఇందులో కూడా పూల గుత్తులు వచ్చేలా చేసుకోవచ్చు. ఒక అట్టను తీసుకుని దాని మీద కాగితపు గుజ్జును సమానంగా పరవాలి. పూర్వం కాగితం గుజ్జులో మెంతుల్ని వాడేవారు. కాని ఇప్పుడు ఫెవికాల్ వాడుతున్నారు. కాగితం ముక్కల పిండికి ఫెవికాల్, మెత్తని పొడిలాంటి ఆల్ పర్సస్ ఫ్లోర్‌ను కూడా కలపాలి. ఇలా తయారైన ముద్దను అట్టమీద పరిచాం కదా! బాగా నున్నగా రావడం కోసం చపాతీ చేసే కర్రతో గట్టిగా వత్తుకోవాలి. చుట్టూ ఉన్న పగుళ్ళను తీసేసి నున్నగా చేసుకోవాలి. దీని మీద పెన్ను మూతతో గుచ్చుతూ పోతే గుండ్రంగా గీతలు పడుతుంటాయి. ఇదొక డిజైను అన్నమాట. దీనిమీద ఒక కుండీలా చేసుకోవాలి. ప్లాస్టిక్ బాటిల్‌ను అర్ధవృత్తాకారంలో కత్తిరించి దాని మీద కాగితపు గుజ్జును మెత్తాలి. నున్నగా అయ్యే వరకు చేతితో తట్టాలి. ఇప్పుడు డిజైను మీద దీనిని అతికించాలి. చుట్టూ బార్డర్ వలె చేసి అతికించాలి. ఇప్పుడొక పూల గుత్తిని తీసుకుని కుండీలా అతికించిన దాన్లో పెట్టాలి. పూల గుత్తిని పేపర్‌తో కానీ బుట్టలతో కానీ చేసుకోవచ్చు. దీని వెనుక భాగాన గోడకు తగిలించుకునే రింగును అతికించుకోవాలి.
అమ్మాయి బొమ్మ
కర్ర పుల్లలతో కానీ ఇనుప తీగలతో కానీ బేస్‌ను తయారు చేసుకోవాలి. ఇప్పుడు కాగితపు గుజ్జును తీసుకొని శరీరాకృతి వచ్చేలా పెట్టాలి. తల కోసం గుండ్రటి ముద్దను చేసుకుని పై భాగంలో అతికించాలి. అమ్మాయికి లంగా, ఓణీ వేద్దామా, చీర, జాకెట్ కడదామా నిర్ణయించుకోవాలి. దానికి తగ్గట్టుగా డిజైన్లు వచ్చే విధంగా చీపురు పుల్లలతో, పెయింటింగ్ బ్రష్ వెనక వైపుతో, పెన్సిల్‌తో గీసుకోవచ్చు. తల భాగంలో కండ్లు, ముక్కు, చెవులను పెట్టాలి. జుట్టు కోసం వేరేగా ఊలు ముక్కల్ని అతికించుకోవచ్చు. లేదంటే పేపర్ ముద్ద మీదనే జుట్టు ఉన్నట్టుగా గీతలు గీసుకోవాలి. మొత్తం ఆకృతి తయారైన తర్వాత రంగులు వేయడం మొదలు పెట్టాలి. బాగా ఆరిన తర్వాతే రంగులు వేయాలి.
పుష్పాంజలి బొమ్మలు
మౌల్డు లు తెచ్చుకుని ఏ బొమ్మనైనా చేయవచ్చు. పుష్పాంజలి అర్పించే బొమ్మల్లాంటివి రెండు తయారు చేసుకుని పెట్టు కుంటే బాగుంటుంది. అయితే దీని కోసం మౌల్డులు కావాలి. మా ఇంట్లో ఈ మౌల్డులున్నాయి. అందుకే వీటిని చేశాను. చేత్తో పుష్పాలను పట్టుకొని స్వాగతం చెపుతున్నట్టుగా ఉండే బొమ్మలున్నాయి. ఇవి ప్లాస్టిక్‌వి. నా చిన్నతనంలో ముగ్గుల పోటీలో ఫ్రైజుగా ఇచ్చారు. వెనకంతా డొల్లగా ఉండటంతో నేను మౌల్డుగా వాడుకున్నాను. ఈ డొల్లలో కాగితం గుజ్జును పూర్తిగా నింపి గట్టిగా వత్తాలి. అమ్మాయి జడ, చేతులు, పువ్వులు వంటివి చక్కగా వచ్చేందుకు గట్టిగా నొక్కాలన్నమాట. ఒకవేళ అక్కడ సరిగా రాకుంటే తర్వాత పెట్టుకోవాలి. మౌల్డులో నుంచి తీశాక కన్ను ముక్కు తీరు దిద్దుకోవాలి. ఆపై రంగులు వేసుకోవాలి. వీటిని ద్వారానికి రెండు వైపులా అమర్చుకుంటే బావుంటుంది.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్