Authorization
Sun April 06, 2025 11:46:44 pm
ఇది పోటీ ప్రపంచం. ఎవరికి వారు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని పరుగులు పెడుతుంటారు. అయితే ఇందులో అమ్మాయిలకు ఎదురయ్యే అడ్డంకులు చాలానే. వాటిని అధిగమించాలంటే వీటిని పాటించాలి.
లక్ష్యాలను పెట్టుకోవడం తప్పు కాదు... అయితే అవి వాస్తవికంగా ఉండేలా చూసుకోవాలి. ముందు మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను, మనకి ఉండే ప్రతికూలతల్ని అంచనా వేసుకుని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
సరైన ప్రయత్నం చేయకుండానే గమ్యం చేరాలని తహతహలాడే వారు కొందరైతే. సరైన ప్రణాళిక లేకుండానే విజయానికి చేరువకాలేకపోతున్నామని బాధపడేవారు మరికొందరు. లక్ష్యం నిర్దేశించుకున్న తర్వాత ప్రారంభించిన మీ పయనం సాగుతున్న తీరుని పట్టికలో ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ ఉండండి. ఇది ఆచరణలో జరుగుతున్న లోపాలతో పాటు భవిష్యత్తుకి మార్గదర్శకంగా పనిచేస్తుంది. అందుకే అనుభవజ్ఞుల సలహాలూ తీసుకోండి. ఇవన్నీ మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తాయి.
ఎవరి సామర్థ్యం మేరకు వారు పని చేస్తారు. ఇతరులతో పోల్చుకోవడం వల్ల ప్రతికూల ఆలోచనలు పెరుగతాయే తప్ప గమ్యం చేరుకోలేరనే విషయాన్ని మొదట గుర్తించండి. దానికి బదులు ఇతరులను ప్రేరణగా తీసుకుని ఎదిగే ప్రయత్నం చేయడం వల్ల ఫలితం ఉంటుంది.గెలుపోటములు సహజమనే విషయాన్ని ముందు అంగీకరించగలగాలి. అలాగని విజయం ఎప్పుడూ ఒకరి సొంతమే కాదు. ఎదుటివారితో పోల్చుకోవడం మంచిదే కానీ అసూయతోనో, కోపంతోనో కాకూడదు. ఆ పోలిక మనలో ఉన్న లోపాల్ని సరిదిద్దుకుని సరైన ప్రణాళిక వేసుకునేందుకు సాయం చేసేలా ఉండాలి. ఎవరిలో ఉండే ప్రత్యేకతలను వారు గుర్తించి సానపెట్టుకోగలిగితే లక్ష్యాన్ని చేరుకోవడం సులువే.