Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డా.సాహితీ కొండపల్లి... వైద్య పరికరాలు, ఫార్మాస్యూటిక్స్‌కు సంబంధించిన రెగ్యులేటరీ రైటింగ్ కంపెనీ అయిన క్రైటీరియన్ ఎడ్జ్‌కి డైరెక్టర్‌గా ఉన్నారు. ఇక్కడ ఆమె 40 మందికి పైగా వైద్య రచయితల బృందాన్ని పర్యవేక్షిస్తూ తమ లక్ష్యాలను సాధించడంలో అవసరమైన వ్యూహాలను రూపొందిస్తూ వాటిని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఒక విజన్ నిర్మించడం, వాటిని అమలు చేయడం, ప్రతిభ ఎక్కడున్నా గుర్తించడం, అభివృద్ధి చేయడంలో ఆమెకు విస్తృతమైన నైపుణ్యం ఉంది. వ్యూహాత్మక నాయకురాలిగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తనతో పాటు పని చేసే ఉద్యోగులందరూ అభివృద్ధి చెందగల వాతావరణాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఆమె ఇటీవలె ఉమెన్స్ లీడర్ ఫోరం పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పరిచయం నేటి మానవిలో...
సాహితీ విజయవాడలో పుట్టి పెరిగారు. అక్కడే నిర్మల హైస్కూల్లో చదువుకున్నారు. తల్లి వినత, తండ్రి కొండపల్లి పావన్. నాయనమ్మ దుర్గాదేవి, తాతయ్య కె.ఎల్.నరసింహారావు. ఈయన ఇల్లందు నుండి మూడు సార్లు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే అమ్మమ్మ విజయ, తాతయ్య లంకా జోగరావుగారు. వీరిది వామపక్ష భావాలు కలిగిన కుటుంబం. దాంతో చిన్నప్పటి నుండి ఆమె కూడా అవే భావాలతో పెరిగారు. సాహితి మెడికల్ ఫీల్డ్‌లోకి రావడానికి డా.పుచ్చలపల్లి రాంచంద్రారెడ్డి కొడుకు డా.మిత్ర స్ఫూర్తి. ఆయన గైడెన్స్‌లోనే ఆమె ఈ రంగంలోకి అడుగుపెట్టారు. చెన్నైలోని S.R.M డెంటల్ కాలేజ్ నుండి డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. తర్వాత యుకే లోని క్రాన్ఫీల్డ్ యూనివర్శిటీ నుండి క్లినికల్ రీసెర్చ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ అథారిటీ (PMCPA) నుండి అసోసియేషన్ ఆఫ్ ది బ్రిటిష్ ఫార్మాస్యూటికల్ ఇండిస్టీ (ABPI) కోడ్‌లో ధృవీకరణ పొందారు.
కొత్త సవాళ్లు స్వీకరిస్తూ...
క్రైటీరియన్ ఎడ్జ్ డైరెక్టర్‌గా ప్రవేశించడానికి ముందు ఆమె గ్లోబల్ హాస్పిటల్స్‌లో జూనియర్ డ్యూటీ డాక్టర్‌గా పనిచేశారు. అప్పటి నుండే కొత్త సవాళ్లను స్వీకరించేవారు. ఆ తత్వమే హెల్త్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ అడ్వైజర్‌గా తన కెరీర్‌ను మార్చింది. అక్కడ ఆమె నాణ్యమైన వైద్య సలహాలను అందించడానికి 450 మంది సహచరులకు శిక్షణ ఇచ్చారు. దీర్ఘ శ్రేణి వ్యాపార అభివృద్ధికి ఫైనాన్స్, ఆర్డడి, సేల్స్, మార్కెటింగ్‌తో అనుసంధానం చేసింది. కెరీర్ మధ్యలో రెండు సంవత్సరాలు మెడికల్ రైటర్‌గా, ఏడు సంవత్సరాలు మెడికల్ సేఫ్టీ మేనేజర్‌గా పనిచేశారు. నైపుణ్యం ఉన్న రంగాలలో బృందానికి నాయకత్వం వహించడం, భద్రతా నివేదికలు, పత్రాలను సమీక్షించడం వంటివి ఆమె కెరీర్లో ఎన్నో ఉన్నాయి.
వివరణాత్మక అనుభవం
అనేక గ్లోబల్ మ్యాట్రిక్స్ సంస్థలలో క్రాస్-ఫంక్షనల్‌గా పనిచేయడం ఆమె వృత్తి జీవితంలో భాగం. మొత్తంమీద ఆమెకు ఫార్మాస్యూటికల్, మెడికల్ డివైజ్, హెల్త్ కేర్ రెగ్యులేటరీ వర్క్‌లో 12 సంవత్సరాల అనుభవం ఉంది. MDD క్లాస్ IIb & III, క్లాస్ IA-III/AIMD డాక్యుమెంట్ల మెడికల్ రైటింగ్‌లో ఎనిమిది సంవత్సరాలకు పైగా అలాగే నాలుగు సంవత్సరాల పైగా వివరణాత్మక అనుభవం ఉంది.MDR, MEDDEV 2.7/1, rev 4 రెగ్యులేటరీ రైటింగ్, ప్రోగ్రామ్ మేనేజర్‌గా 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఆమె 35 కు పైగా MEDDEV 2.7/1 rev 4 క్లినికల్ మూల్యాంకన నివేదికల (వైద్య పరికరాలు) ప్రాజెక్ట్ నిర్వహణను విజయవంతంగా సాధించారు.
వైవిధ్యంగా ఆలోచిస్తూ...
సాహితీకి చిన్నతనం నుండే పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం ఆమె నిరుపేద పిల్లలకు విద్య అందించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొత్త ప్రదేశాలకు వెళ్ళడమంటే ఆమెకెంతో ఇష్టం. ఈ ప్రయాణాలు తనకు వినోదంతో పాటు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఉపయోగపడతాయని ఆమె భావిస్తున్నారు. నిత్యం వైవిధ్యంగా ఆలోచించే ఆమెకు చేస్తున్న పని పట్ల అపారతమైన ప్రేమ, బాధ్యత ఉంది. పని చేసే క్రమంలో వచ్చే సవాళ్ళను, సమస్య పరిష్కారంలో ముందు భాగంలో ఉంటారు. తనతో పాటు పని చేసే ఉద్యోగులను తన కుటుంబంలా ప్రేమిస్తారు.
నాయకులకు ఈ లక్షణాలు చాలా ముఖ్యమైనవి అని ఆమె అంటారు. ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే దాని గురించి శ్రద్ధ వహించడం, ప్రాజెక్ట్ విజయవంతం చేయడంలో బృందాన్ని ప్రేరేపించడం ఆమెలోని ప్రత్యేక సామర్థ్యం. డా.సాహితీది ఉత్పాదకత, ఆశయ సాధానలో పట్టుదలతో కృషి చేసే అరుదైన వ్యక్తిత్వం. సంస్థలోని మిగిలిన జట్టుకు గొప్ప ఉదాహరణగా నిలుస్తారు. ప్రతి ఒక్కరూ ఆమెతో కలిసి పనిచేయడానికి ఎంతో ఇష్టపడతారు.
నిత్యం తపిస్తారు
మార్పుకు నాయకత్వం వహించడానికి, ఫలితాలను అందించడానికి, మంచి ఉత్సాహంతో చాలా నిమగమైన బృందాలను రూపొందించడానికి సాహితీ నిత్యం తపిస్తుంటారు. ఆమెలోని కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు ఆమెను శక్తివంతమైన, స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా నిలబెట్టాయి. అంతేకాదు ఆమె నిర్వహించే సంయమనం, ముక్కుసూటితనం, ప్రతి ఒక్కరి నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించే స్వభావం ఆమెను ఉన్నతమైన వ్యక్తిగా నిలబెట్టాయి. ఇప్పుడు జాతీయ స్థాయి అవార్డు అందుకునేలా చేశాయి. లూథియానా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉమెన్ లీడర్స్ ఫోరం ఆమెకు ఉత్తమ నాయకత్వ విభాగంలో ఈ పురస్కారాన్ని అందించింది.
కొందరికైనా జీవితాన్ని ఇవ్వాలి
ప్రస్తుతం నేను పనిచేస్తున్న కంపెనీ డైరెక్టర్లు నన్నపనేని సదాశివరావుగారు, లలిత జొన్నవిత్తులగారు. వీరితో కలిసి పని చేయడం మొదలుపెట్టిన తర్వాత నేను గమనించింది ''మనం ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగితే అంత మంచిది. ఎందుకంటే అంత మందికి మనం జీవితాన్ని ఇచ్చినట్టు'' అని వాళ్ళు ఎప్పుడూ అంటుంటారు. మనం ఎవరితో కలిసి ప్రయాణం చేస్తున్నామో వారి ప్రభావం మనపై ఉంటుంది. అలా వారి ఆలోచనలు నన్ను కూడా ప్రభావితం చేశాయి. ఉద్యోగాలు అవకాశం కల్పించి కొంతమందికైనా జీవితాన్ని ఇవ్వాలి. మా టీంను మేమే ట్రైన్ చేసి వారికి మా కంపెనీలో ఉద్యోగం వచ్చేలా చేయాల్సిన బాధ్యత ఓ టీమ్ లీడర్‌గా నాపై ఉంది. కాబట్టి కొత్తగా వచ్చే ప్రతి టీంకు సరైన శిక్షణ ఇచ్చి వారు కచ్చితంగా ఉద్యోగం పొందేలా చేయడం నా లక్ష్యంగా పెట్టుకున్నాను.
బాధ్యత మరింత పెరిగింది
జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం దక్కింది. అయితే ఇలాంటి అవార్డులు మన బాధ్యతను మరింత పెంచుతాయి. కంపెనీ కూడా నాపై నమ్మకం పెంచుకుంటుంది. అలాగే నాకూ ఇంకా కొత్తగా చేయాలి అనే తపన పెరిగింది. మా తాతయ్య లంకా జోగారావుగారు ప్రజాశక్తి పత్రికలో చనిపోయే వరకు పని చేశారు. ఆయన క్రమశిక్షణ చూస్తూ పెరిగాను. నేనూ అలా వుండాలి అని అప్పుడే నిర్ణయించుకున్నాను. అదే నన్ను నిలబెట్టింది. కెరీర్ పరంగా డా.మిత్రా గారు సహకరిస్తే కుటుంబ పరంగా అమ్మా, నాన్న ప్రోత్సాహం చాలా ఉంది. ముఖ్యంగా నాన్న ఎంతో అండగా నిలబడ్డారు. పెండ్లి తరువాత కొన్ని సమస్యల వలన విడాకులు తీసుకోవల్సి వచ్చింది. ఆ సమయంలో నేనేమైపోతానో అని చాలా భయపడ్డారు. అప్పుడు నాన్నతో పాటు ఆయన స్నేహితులు నాలో మనోధ్యైర్యాన్ని నింపారు. మానసికంగా నన్ను నన్నుగా నిలబెట్టడానికి అన్ని విధాలుగా సహకరించారు. చాలా మంది ఆడపిల్లలు కుటుంబంలో సమస్యలు వస్తే తల్లిదండ్రులకు చెప్పుకోలేక తమలో తామే బాధపడుతున్నారు. కానీ ఆడపిల్లకు తల్లిదండ్రుల నుండి సపోర్ట్ ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడగలరు. ఏదైనా సాధించగలరు అనడానికి నేనొక ఉదాహరణగా అని ఈ సందర్భంగా గర్వంగా చెబుతాను.
- సలీమ