Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్యూబా... అత్యంత చిన్న దేశం. అయినా ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్‌ను తమ సరిహద్దుల్లోకి రానీయకుండా కట్టడి చేయగలిగింది. గొప్ప వారమంటూ విర్రవీగే పెద్ద పెద్ద దేశాలకు సైతం వైద్య సేవలు అందించి అండగా నిలిచింది. అమెరికన్ సామ్రాజ్యవాదం అనుక్షణం ఆంక్షలు పెడుతున్నా ఐక్యతతో తిప్పి కొడుతూ దృఢంగా నిలబడ్డ గొప్ప చరిత్ర కలిగిన దేశం. విప్లవ వీరుడు చే గువేరా స్ఫూర్తితో క్యూబా దేశాభివృద్ధిలో భాగం పంచుకుంటున్నారు ఆయన కూతురు డాక్టర్ అలైదా గువేరా. తండ్రి గుండెలపై ఆడింది అతి తక్కువ కాలమైనా... ఆయన పంచిన ప్రేమను, విప్లవ బాటను తన నిలువెల్లా నింపుకుంది. ''సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిద్దాం... ప్రపంచ శాంతిని కాపాడుకుందాం..'' అంటూ ప్రపంచ మంతా చాటిచెబుతుంది. క్యూబా సంఘీభావ యాత్రలో భాగంగా దేశమంతటా పర్యటిస్తూ ఈ రోజు హైదరాబాద్ నగరానికి విచ్చేసిన ఆమెకు తెలంగాణ గడ్డ ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా మన ప్రత్యేక అతిథి గురించి కొన్ని విశేషాలు...
అలైదా గువేరా మార్చ్ 24 నవంబర్, 1960లో పుట్టారు. తండ్రి క్యూబా విప్లవ వీరుడు ఎర్నెస్టో చే గువేరా, తల్లి అలైదా మార్చ్. వీరికి పుట్టిన నలుగురు పిల్లల్లో అలైదానే పెద్దది. ఈమె చిన్నతనం నుండి చదువులో ముందుండేది. ప్రస్తుతం ఆమె హవానాలోని విలియం సోలర్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో వైద్యురాలిగా పని చేస్తున్నారు. ''ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు ఎవరికి అన్యాయం జరిగినా స్పందించేందుకు సిద్ధంగా ఉండు'' అన్న తండ్రి మాటలను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆ మాటలను నిజం చేస్తూ అంగోలా, ఈక్వెడార్, నికరాగ్వాలో ప్రజలకు వైద్య సేవలు అందించారు.
స్వతంత్ర భావాలతో ఎదిగారు
కాంగోలో విప్లవం తీసుకొచ్చేందుకు చే గువేరా క్యూబాను విడిచిపెట్టి వెళ్ళినపుడు అలైదా వయసు కేవలం నాలుగున్నర సంవత్సరాలు. బొలీవియాలో తండ్రి కాల్చివేయబడినపుడు ఆమెకు ఏడు సంవత్సరాలు. అయినప్పటికి తండ్రికి సంబంధించిన జ్ఞాపకాలు ఆమెలో అలా నిలిచిపోయాయి. తండ్రి మరణించిన తర్వాత తల్లితో పాటు క్యూబా మాజీ అధ్యక్షుడు ఫైడల్ కాస్ట్రో దిశానిర్దేశంలో ఆమె పెరిగారు. విద్యార్థి, యువజన ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. స్వతంత్ర భావాలతో ఎదిగారు. గతంలో ప్రపంచ యువజన మహాసభలు జరిగినపుడు వాటిలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. 'చే'లోని సుగుణాలు, సమాజం పట్ల బాధ్యత, విప్లవ పోరాట తత్వాన్ని అణువణువునా నింపుకున్నారు. రాజకీయ పరంగా అనేక పదవులు ఆమె వద్దకు వచ్చిన తిరస్కరించి సేవకే అంకితమైన గొప్ప వ్యక్తిత్వం ఆమెది. తండ్రిలాగే అధ్యయనంలో ఆమెది అందెవేసిన చెయ్యి. ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తారు. ప్రభుత్వం, విప్లవ పార్టీలు తమ కుటుంబానికి సహాయసహకారాలు అందించేందుకు ముందుకు వచ్చినా వాటిని సున్నితంగా తిరస్కరించి సాదాసీదా జీవితాన్నే గడిపారు. దీంతో తండ్రికి అసలు సిసలైన వారసురాలిగా నిరూపించుకున్నారు.
అపురూపంగా చూసుకునే వాళ్ళం
తండ్రి గురించి మాట్లాడుతూ ''మా బాల్యాన్ని ఆస్వాదించే అవకాశం నాన్నకు లేదు. మాతో ఉన్నప్పుడు జంతువుల కథలను ఎక్కువగా చెబుతుండేవారు. ప్రపంచంలో అణిచివేతకు గురౌతున్న మానవ సమూహాలను ప్రేమించాలని చెప్పేవారు. ఆయన మాకు దూరంగా ఉన్నా మా గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉండేవారు. మా కోసం ఉత్తరాలు రాసే వారు. అందులో ఎన్నో మంచి కథలు ఉండేవి. కొన్ని సార్లు బొమ్మలు కూడా గీసి పంపించేవారు. వాటిని మేమెంతో అపురూపంగా చదువుకునే వాళ్ళం. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలకు తీసుకుపోయేవారు'' అంటూ గుర్తు చేసుకున్నారు.
తండ్రి ప్రభావం
అలైదా చిన్నతనం నుండి పుస్తకాలు విపరీతంగా చదివేవారు. వారి ఇంటి నిండా పుస్తకాలు ఉండేవి. ఒక రోజు తల్లి చేతితో రాతలో ఉన్న ఒక పుస్తకాన్ని ఆమె చేతికి ఇచ్చింది. దాన్ని పూర్తిగా చదివి ఎంతో స్ఫూర్తిపొందానని చెప్పింది. అంతా చదివిన తర్వాత అది నీ తండ్రి జీవితమే అని చెబితే ఆమె ఉప్పొంగిపోయింది. తన తండ్రి అంతటి గొప్ప విప్లవ వీడుడైనందుకు గర్వపడింది. తర్వాత కాలంలో ఆ పుస్తకం 'చే గువేరా మోటర్ సైకిల్ డైరీ' పేరుతో ముద్రితమై ప్రపంచ వ్యాప్తంగా ప్రచారమయింది. ఎందరిలోనే స్ఫూర్తి నింపింది.
మెరుగైన స్థితిలో ఉంటాము
'మా నాన్న రచనలు జోస్ మార్టీ లాగా ఉంటాయి. ఆయన నేర్చుకున్న విలువలు శాశ్వతమైనవి'' అంటారు అలైడా. తనకు స్ఫూర్తి తన తండ్రే అంటారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నపుడు తన ప్రసంగాలలో తండ్రి రచనలను ప్రస్తావిస్తూ ''రాజకీయ అవగాహన, భావోద్వేగ పరిపక్వత'' కోసం నాకు మా నాన్న డైరీలు ప్రత్యక్షంగా సహాయపడతాయని చెబుతారు. ''మనం ఆయన సూచనను ఆచరణలో పెట్టినపుడు మనం మెరుగైన స్థితిలో ఉంటాము'' అంటారు ఆమె. తిరుగుబాటుకు చిహ్నంగా తన తండ్రి గురించి అందరూ మాట్లాడుకుంటుంటే ఆమె మరింత స్ఫూర్తి పొందుతున్నారు. ఒక పిల్లవాడు చే చిత్ర పటాన్ని పట్టుకొని ఊరేగింపులో వెళుతూ ''నేను చే లాగా విజయం సాధించే వరకు పోరాడాలని కోరుకుంటున్నాను'' అని ఆ పిల్లవాడు చెప్పినప్పుడు ఆమె అంత గొప్ప వీరుడి కూతురిగా ఉప్పొంగిపోయారు.
ప్రేమించడం నేర్చుకోవాలి
''మా నాన్నకు ఎలా ప్రేమించాలో తెలుసు. అది అతనిలోని అత్యంత అందమైన లక్షణం. సరైన విప్లవకారుడిగా ఉండాలంటే ముందు ప్రేమ గురించి తెలిసి ఉండాలి. ఇతరుల కోసం తనను తాను అర్పించుకోగల సామర్ధ్యం అత్యంత గొప్పది. అది చే గువేరాలో ఉంది. మనం అతనిని ఉదాహరణగా అనుసరించగలిగితే ప్రపంచం మరింత అందమైన ప్రదేశంగా ఉంటుంది'' అంటారు ఆమె.
ఉదాసీనతకు వ్యతిరేకంగా...
ఎలైదా అంగోలాలో క్యూబన్ మెడికల్ మిషన్‌లో భాగంగా గడిపిన సమయాన్ని అత్యంత గొప్ప రోజులుగా గుర్తుపెట్టుకున్నారు. ఆ అనుభవాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ''నేను చాలా మంది పిల్లల ప్రాణాలను కాపాడగలిగాను. కానీ కొన్నిసార్లు నేను వారి కోసం ఏమీ చేయలేకపోయాను. అలాంటప్పుడు దుఃఖం, పశ్చాత్తాపం మనతో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఆ సమయంలో అనుభవించిన బాధ, జాత్యహంకారం, మానవులపై జరిగే దోపిడీ, తరచుగా ఉదాసీనతకు వ్యతిరేకంగా పని చేసేలా నన్ను ప్రేరేపించాయి'' అంటారు ఆమె.
చావెజ్, వెనిజులా - న్యూ లాటిన్ అమెరికా
వెనిజులా మాజీ అధ్యక్షుడు చావెజ్‌ను ఆమె ఎన్నో సార్లు కలిసి ఇంటర్వ్యూ చేశారు. ఆ విశేషాలన్నింటిని కలిపి ఫిబ్రవరి 2004లో 'చావెజ్, వెనిజులా -న్యూ లాటిన్ అమెరికా' పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. ఈ పుస్తకం ఒక డాక్యుమెంటరీగా మార్చబడింది. అందులో బొలివియ విప్లవం గురించి చావెజ్‌తో చేసిన ఇంటర్వ్యూ సారాంశాలు, ప్రపంచానికి సేవలు చేస్తున్న క్యూబా వైద్యులతో ఇంటర్వ్యూలు ఉన్నాయి.
వైద్యురాలిగా ఎన్నో సేవలు
ఎలైదా క్యూబాలో వికలాంగ పిల్లల కోసం రెండు ఆశ్రమాలు, శరణార్థి పిల్లల కోసం మరో రెండు ఆశ్రమాలు నడుపుతున్నారు. పుట్టుకతో అలెర్జీలతో బాధపడేవారి కోసం పని చేసే ప్రత్యేక శిశువైద్యురాలిగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తూర్పు క్యూబాలోని రియో కౌటో చుట్టుప్రక్కల వరదలు ముంచెత్తో ప్రాంతంలో వైద్య సేవలు అందించారు. 2008లో తుఫానుల వల్ల నాశనమైన యూత్ ద్వీపంలో పని చేశారు. 2013 మే 4 నుండి 8 వరకు క్రొయేషియాలోని జాగ్రెబ్‌లో జరిగిన సబ్వర్సివ్ ఫెస్టివల్ సమావేశాలు, చర్చల్లో ప్రజా మేధావిగా, ఓ కార్యకర్తగా పాల్గొన్నారు. అక్కడ స్లావోజ్ జిజెక్, తారిక్ అలీ వంటి ప్రముఖల పక్కన ముఖ్య వక్తగా మాట్లాడారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. ప్రొ.ఎస్టీఫానియా, సెలియా.
నిర్ణయాధికారంలో క్యూబా మహిళలు
ఇటీవలె కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో జరిగిన ఐద్వా 13వ అఖిల భారత మహాసభలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ''ఇలా మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా వుంది. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మా క్యూబా దేశం ఎంతో పోరాటం చేసింది. ఇంకా చేస్తూనే వుంది. క్యూబాలో మహిళలను నిర్ణయాధికారంలో భాగస్వామ్యం చేయడంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రస్తుతం మా పార్లమెంటులో 52శాతం, రాష్ట్ర కౌన్సిల్స్‌లో 53శాతం మంది మహిళలు వున్నారు. అలాగే 4 రాష్ట్రాలకు గవర్నర్లుగా, 12 మంది వైస్ గవర్నర్లుగా, 88 మంది అధ్యక్షులుగా, 58 మంది మేయర్లుగా మహిళలు వున్నారు. మహిళలకు అన్నింట్లో సమాన బాధ్యలు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. తర్వాతి తరాల వారిని ఒక మంచి మార్గంలో నడిపేందుకు అవసరమైన విద్య అందిస్తున్నాము. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాం. మహిళలకు ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశాము. వీటిలో ఎంతో మంది వాలింటీర్స్గా పని చేయడానికి వస్తున్నారు. గత ఏడాది 841 ట్రైనింగ్ సెంటర్లు పెడితే వీటిలో 50వేల మంది మహిళలు పాల్గొన్నారు. మహిళల కోసం ఇంకా చేయాల్సి వుంది. వాటిని కూడా చేస్తాం. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అద్భుతమైన పోరాటాలు చేయాలి. రేపటి వెలుగు కోసం ఉద్యమించాలి.
- సలీమ