Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డా. తాళ్లపల్లి యాకమ్మ... అణగారిన వర్గ ధిక్కార స్వరం ఆమె అక్షరం. దోపిడిని నిలదీసి నిగ్గదీస్తుంది ఆమె కలం. దళిత కుటుంబంలో పుట్టి బాల్యం నుండి అంటరానితనాన్ని చాలా దగ్గరగా చూస్తూ పెరిగారు. పాఠశాలలో, కళాశాలలో, సమాజంలో అనేక అసమానతలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. కుటుంబంలోనూ లింగ వివక్షతను, అణచివేతలను ఎదుర్కొంటూ అన్నింటిని అధిగమిస్తూ తనదైన దారిలో సాహితీ పయనం మొదలుపెట్టిన ఆమె పరిచయం నేటి మానవిలో...
మహబూబాబాద్‌లోని ఊరి చివర కుమ్ముడురాని దళితవాడలో పుట్టారు యాకమ్మ. తల్లిదండ్రులు తాళ్లపల్లి అబ్బమ్మ, అబ్బయ్య. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. అప్పట్లో తండ్రి దొర దగ్గర జీతం ఉండేవాడు. అది ఒక రకంగా వెట్టి చాకిరి లాంటిది. సంవత్సరం మొత్తం పని చేయించుకొని మూడు, నాలుగు బస్తాలు వడ్లు ఇచ్చేవారు. ఆ వెంటనే అప్పిచ్చాం అనే వంకతో ఆ వడ్లను మొత్తం తమ వడ్ల రాశిలో కలుపుకునేవారు. తల్లి పాత కల్లోల దగ్గర కూలి చేసి పిల్లల్ని పోషించేది. పూట గడవని రోజుల్లో కూడా ఆ తల్లిదండ్రుల్ని పిల్లల్ని బడికి మాత్రం కచ్చితంగా పంపించేవారు. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారే అనే బాధ వారిలో అస్సలు కనిపించేది కాదు. పేదరికం ఒకవైపు, అవమానాలు, అణచివేతలు ఒకవైపు, పెత్తందారుల శ్రమదోపిడి మరోవైపున చుట్టుముట్టినా కష్టాలకు దడవకుండా, కన్నీళ్ళకు విరవకుండా ఎంతో ఓర్పుతో ఆ దంపతులు పిల్లల్ని చదివించారు. ఎందుకంటే చదువుంటే పిల్లలు ఆత్మగౌరవంగా బతుకుతారని వారి ఆశ.
భర్తను ఒప్పించి
యాకమ్మ ఒకటవ తరగతి నుండి ఇంటర్ వరకు మహబూబాద్లోనే విద్యను అభ్యసించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోకి వచ్చిన వెంటనే దగ్గర బంధువైన సోమవరపు వీరస్వామితో పెండ్లి జరిగింది. పెండ్లి తర్వాత భర్తను ఒప్పించి ఆయన సహకారంతో ఉన్నత విద్యకు శ్రీకారం చుట్టారు. డిగ్రీ ఖమ్మంలోని ఉమెన్స్ కాలేజీలో పూర్తి చేశారు. తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు, సంస్కృతం పూర్తి చేశారు. ఆ తర్వాత హనుమకొండలో బీఈడి చేసి, తమిళనాడులోని మదురై కామరాజు విశ్వవిద్యాలయం ఏంఫీల్ చేశారు. కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఆచార్య బన్న ఐలయ్య పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తర్వాత యూజీసీ నెట్, ఏపీ సెట్లో ఉత్తీర్ణత పొంది 2001 డీఎస్సీ ద్వారా తెలుగు పండిట్ ఉద్యోగం సాధించారు. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురు గాయత్రి ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతుంది. కొడుకు కళ్యాణ్ కుమార్ ఇంటర్ సెకండియర్.
సాహితీ ప్రస్థానం
యాకమ్మ ఎంఫీల్ చేసేటపుడు అలాగే పీహెచ్డీ కోసం 'బోయ జంగయ్య సాహిత్య అనుశీలన' అనే పరిశోధనలో భాగంగా బోయ జంగయ్య సాహిత్యంతో పాటు బన్న ఐలయ్య, కాల్వ మల్లయ్య, పెద్దింటి అశోక్ కుమార్, బి.ఎస్ రాములు వంటి ప్రముఖ రచయితల పుస్తకాలు ఎన్నో చదివారు. దీంతో ఆమెకు సాహిత్యంపై మక్కువ పెరిగింది. పీహెచ్డీ తర్వాత ఆచార్య బన్న ఐలయ్య ''నువ్వు వచనం బాగా రాస్తున్నావమ్మా, కథలు చక్కగా రాయగలవు'' అంటూ ఆమెలోని సాహితీ క్షేత్రానికి బీజం వేశారు. ఆయన ప్రోత్సాహంతో కథలు రాయడం మొదలు పెట్టారు. అంతేకాకుండా తాను పనిచేస్తున్న పాఠశాలలో అలిశెట్టి ప్రభాకర్ 'నగర గీతం' కవితను విద్యార్థులకు బోధిస్తూనే ఎంతో స్ఫూర్తి పొందారు. కవిత్వం అంటే కేవలం వర్ణనలు మాత్రమే కాదు బతుకు చిత్రం అనే అవగాహనకు వచ్చారు. అప్పటినుండి సామాజిక అంశాలు, దళిత జీవిత బాధలు, వెతలను కవిత్వంగా రాస్తున్నారు.
మమతల మల్లెలు
మహబూబాద్ జిల్లా సాహితీ శిఖరంలో మొగ్గ తొడిగిన ఏకైక ఉపాధ్యాయ, దళిత రచయిత్రిగా గుర్తింపు పొందారు యాకమ్మ. ఆమె రాసిన మొదటి కథా సంపుటి 'మమతల మల్లెలు'. ఈ సంపుటిలో మొత్తం 11 కథలు ఉన్నాయి. తాను చూసిన, అనుభవించిన, ఎదుర్కొన్న సంఘటనలని కథలుగా మలిచారు. తాను చిన్నతనంలో పెంకి పిల్లగా ఎలా ఉండేదో మమతల మల్లెలు కథలో చూపించారు. తండ్రి ఆమెను ఎంత గారాబంగా పెంచాడో చిత్రించారు. సాధారణంగా అణగారిన ప్రజల జీవితాలను చిత్రించేటప్పుడు తండ్రి తాగుబోతుగా తల్లి మాత్రమే కష్టపడుతూ తమ పిల్లలను పెంచి పోషించినట్టుగా ఎన్నో కథలు చిత్రించారు. కానీ అందుకు భిన్నంగా ఉంటుంది యాకమ్మ రాసిన కథ. చిన్ననాటి పెంకితనాన్నే వయసు పెరుగుతున్న కొద్ది జీవిత సంకల్పాన్ని మొక్కవోని దీక్షగా మలుచు కోవడానికి ప్రయత్నించారు. తనని తాను మలుచుకోవడంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఎంతో సహనంతో ఎన్నో అవమానాలను చవి చూశారు.
దళిత అభ్యున్నతికై
దళిత సామాజిక వర్గానికి చెందిన యాకమ్మ బోయ జంగయ్య రచనలు చదవడం, ఆయన స్వయంగా అనుభవించిన పరిస్థితులను అవగతం చేసుకొని ఆమె పరిశోధనలో సాధ్యమైనంత వరకు సమగ్ర విశ్లేషణ చేశారు. బోయ జంగయ్య రచనల నుండి స్ఫూర్తి పొందిన ఈమె కూడా ఏ ప్రక్రియలో రచన చేపట్టినా దళిత చైతన్యం విశ్లేషిస్తూ వారి అభ్యున్నతి లక్ష్యంగా పెట్టుకున్నారు. మూఢనమ్మకాలను వదిలేసిన నాడే దళితులు అభ్యున్నతి సాధించగలరని తన రచనల్లో స్పష్టంగా చెబుతారు యాకమ్మ.
అణగారిన జీవితాలే...
'కెరటం' ఆమె మొదటి నవల. ఈ నవల అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ వారు నిర్వహించిన పోటీలో 'ఉద్యమ కెరటం' పేరుతో ద్వితీయ బహుమతి పొందింది. అంతే కాదు ఇది తెలంగాణలో దళిత స్త్రీ రాసిన తొలి దళిత నవలగా పేరుపొందింది. ఈ నవలలో ప్రధాన వస్తువు దళితుల జీవితం. ఇందులో ప్రధాన పాత్ర మల్లమ్మ. మాదిగ గూడెంలో కటికదారిద్రాన్ని అనుభవిస్తున్న స్త్రీ. దళితుల అమాయకత్వం, మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత, ఓర్వలేని తనం మొదలైన అనేక ఇతివృత్తాలను ఈ నవలలో చిత్రించారు. ఈ నవలను పరిశీలిస్తే అణగారిన జీవితాలు, ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల స్థితిగతులు అర్థమవుతాయి. ఇక 'దుఃఖనది' కరోనా కథలు. ఈ కథా సంపుటిలో 12 కథలు ఉన్నాయి. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేసి ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడిన వారందరి గురించి ఇందులో చిత్రించారు. అంతేకాకుండా కరోనా సమయంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను కూడా చిత్రించాను. 'మట్టి బంధం' అనే కవితా సంపుటిలో 94 కవితలు ఉన్నాయి. ఇందులో మహిళా సాధికారత, సామాజిక ఆర్థిక నేపథ్యం చిత్రీకరించారు.
లెక్కకు మించిన పురస్కారాలు
యాకమ్మ చేస్తున్న సాహితీ కృషికి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. అందులో మదర్ ఫౌండేషన్ వరంగల్ వారి సేవరత్న జాతీయ అవార్డు, అక్షరాలతోవ ఖమ్మం వారి జాతీయస్థాయి ద్వితీయ బహుమతి, అక్షర శిఖరం, జాతీయస్థాయి ఉత్తమ కవితా పురస్కారం, విశాల సాహిత్య అకాడమీ వారి బిఎస్ రాములు ప్రతిభా పురస్కారం, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 'మమతల మల్లెలు' కథా సంపుటికి డాక్టర్ పుట్ల హేమలత స్మారక పురస్కారం, మాతృభాషా దినోత్సవం సందర్భంగా సాహితీరత్న పురస్కారం, గిడుగు ఫౌండేషన్ హైదరాబాద్ వారి నుండి 'బోయ జంగయ్య సాహిత్య అనుశీలన' పరిశోధన గ్రంథానికి గాను సాహితీసేవ పురస్కారం, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ వారిచే ఉత్తమ రచయిత అవార్డు, మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ రచయిత అవార్డు, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉత్తమ కవిత పురస్కారం ఇలా లెక్కకు మించిన పురస్కారాలు అదుకున్నారు.
సామాజిక వర్గ గొంతుక
''మనం ఏదైనా రాయాలనుకున్నప్పుడు వాటి గురించి లోతుగా అధ్యయనం చేసి రాయాలి. అప్పుడే అవి సామాజిక పరిణామాలను, చరిత్రను మానవ సంబంధాల్లోని అవకతవకలను కథలుగా చిత్రించగలవు. అలా నా జీవితాన్ని కథలుగా చిత్రించి నా అనుభవాలను కథల్లో చిత్రిస్తూ క్రమక్రమంగా ఎదిగిన పరిణామాన్ని నా రచనల ద్వారా తెలియజేశాను. తెలుగు సాహిత్యంలో వెలుగులోకి రావలసిన, ఎదగాల్సిన, ఎదుగుతున్న తెలంగాణ రచయితలు ఎందరో ఉన్నారు. అలా ఎదుగుతూ వస్తున్న రచయితలలో నేను ఒకదానిగా ఉన్నాను. పిచ్చి చెట్ల మధ్య సుగంధాలు వేద జల్లే పూల చెట్లు మొలిచినట్టు అణగారిన జాతి నుండి అనేకమైన ఒడిదుడుకలను ఎదుర్కొంటూ ఉన్నత విద్యను అభ్యసించాను. నా సామాజిక వర్గ గొంతుకగా, ఓ దళిత ప్రతినిధిగా మా జిల్లా నుండి నా రచనల ద్వారా స్పందిస్తున్నాను. నేను రాసిన, రాస్తున్న కథలు వర్తమాన దళితుల జీవిత నేపథ్యాలను, సంఘర్షణలను, వాటి వెనకాల వెతలను సమాజం ముందు ఉంచుతున్నాను. ఆ నేపథ్యంలో రాసిన మరో కథల సంపుటి 'రక్షణ'. ఈ సంపుటిలో 14 కథలు ఉన్నాయి.
బోయ జంగయ్య సాహిత్య పరిశీలన
వాస్తవ పరిస్థితుల ఆధారంగా సమాజంలో జరుగుతున్న అసమానతలను, పడిపోతున్న మానవతా విలువలకు నా కథలు అద్ధం పడతాయి. అణకారిన వర్గాలు విద్యను అభ్యసించడం ఒక ఎత్తు అయితే సృజన రంగాల్లో అడుగుపెట్టడం మరొక ఎత్తు. అలా సాహితీ ప్రపంచంలోకి వచ్చిన గొప్ప రచయిత బోయ జంగయ్య. తన వర్గాల చరిత్రను తానే రాయాలని మౌలికమైన ఆలోచనలు ఆయనలో చెలరేగాయి. అలా రచన వైపు దృష్టిసారించి కవిత్వం, కథలు, నవల బాల సాహిత్యంతో పాటు అనేక ప్రక్రియలలో రచనలు చేశారు. అలాగే తనకంటే ముందు తరం వారిని ప్రభావితం చేసిన మహానుభావుల జీవిత చరిత్రలు రాసిన అరుదైన దళిత రచయిత బోయ జంగయ్య. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దృక్పథం కలిగి స్వచ్ఛందంగా తన ఆలోచనలను సమాజం ముందు పెట్టిన కవి. స్వతహాగా తన జీవిత సంఘర్షణ నుండి ఎన్నో పాఠాలు నేర్చుకున్న రచయిత. వాటిని ప్రేరణగా తీసుకొని తన రచన సాహిత్యానికి ఎన్నుకున్నారు. జీవిత వాస్తవికత పునాదిగా వచ్చిన వారి రచనలపై నేను రచించిన పరిశోధన గ్రంథమే 'బోయ జంగయ్య సాహిత్య అనుశీలన'.
- సలీమ