Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ట్ అండ్ క్రాఫ్ట్
నా చిన్నతనంలో మా అమ్మ, పెద్దమమ్మలు, అత్తయ్యలు పూసలతో అందమైన అల్లకాలు అల్లుతుండేవారు. రంగురంగుల పూసలు ద్వారా తోరణాలుగా, పర్సులుగా, హండ్ బ్యాగులుగా రూపాంతరం చెంది దర్శనమిస్తుండేవి. మా అమ్మ జాకెట్లకు జాలరిలాగా పూసల వరుసల్ని వేలాడేలా కుట్టుకునేది. ఇంకా రకరకాల ఆకారాల పూసలతో దండలు కూడా అల్లేవారు. పాల పూసలు, గొట్టం పూసలు, బొట్టు పూసలు, గుండ్రని పూసలు అంటూ రకరకాల ఆకారాల్లో దొరికేవి. నేను కూడా మా అమ్మతో పాటు చాలా పూసల అల్లకాలు నేర్చుకుని అల్లాను. చిన్న చిన్న బొమ్మలు, వాకిలికి కట్టుకునే తోరణాల వంటివి, హాఫ్ కర్టెన్లు, బ్యాగులు ఇలా ఎన్నో అల్లాను. అప్పట్లో ఇంటిటికీ తిరిగి పూసలు, దువ్వెనలు, సవరాలు అంటూ అమ్ముతుండేవారు. వీరంతా సంచార జాతులకు సంబంధించిన వారే. పాల పూసలు ఎక్కువగా వీళ్ళ దగ్గరే దొరికేవి. పశువులకు కూడా లావుపాటి పూసల దండలను గంటలతో కలిపి కట్టేవారు. పూసలు మానవ జీవితాల్లో పెనవేసుకున్నటువంటివి.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్
పూసల నక్లెస్
ఈ మధ్య పూసల జువెల్లరీ పెట్టుకోవడం చాలా ఫ్యాషన్ అయింది. ముత్యాలు, పగడాలు, దండలుగా గుచ్చి అమ్మే పనిలో మహిళలు ఇంటి పరిశ్రమలుగా చేసుకుంటున్నారు. క్రిస్టల్స్ వంటి మెరిసే పూసలు, నాలుగు పలకల పూసలు, ఎనిమిది పలకల పూసలు అంటూ రకరకాలు దొరుకుతున్నాయి. ఈరోజు మెడకు చోకర్‌లా పెట్టుకునే చిన్న పూసల నెక్లెస్ తయారీ గురించి తెలుసుకుందాం. దీని కోసం రెండు మూడు రంగుల మెరిసే పూసలు తీసుకుంటే వాటిని డిజైన్లుగా అల్లవచ్చు. ఇతర దేశాలు వెళ్ళిన వారు అక్కడ దొరికే రంగు పూసల్ని తెచ్చుకుని బీడ్స్, గంటలు, చిన్న గొట్టాలు, పువ్వులు వంటివి బంగారపువి వేసుకుని దండలుగా అల్లించుకుంటున్నారు. ఇందులో వేల రకాల డిజైన్లు ఉన్నాయి. నేను కూడా అప్పట్లో అల్లుకున్నాను. అదే మీకు చూపించబోతున్నాను. ఈ పూసల అల్లకాలు అందరికీ వచ్చినవే, నచ్చినవే, సులభమైనవే. కాబట్టిల పెద్దగా శ్రమపడాల్సింది ఏమీ లేదు. ముందుగా గులాబీ రంగు పూసల్ని తీసుకొని రెండు పూసల కొక డైమండ్ జాలరి డిజైన్ వచ్చేలా చూసుకోవాలి. దీనికోసం సన్నని గట్టి దారం కానీ వైరు కానీ వాడవచ్చు. జాలరి వేలాడుతూ చక్కగా కనిపిస్తుంది. జాలరి కిందవైపుగా పెద్దపూసలు దానికోచిన్నపూస వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఒక్కసారి పాత రోజుల్లోకి వెళ్ళి పోదాం రండి.
పూసలతో పువ్వులు
పూసలతో పువ్వులు కూడా అల్లుకోవచ్చు. ఒక్కసారి ఈ కళను మొదలుపెట్టామంటే ఏమైనా సృష్టించవచ్చు. ఈ మధ్య పూసల అల్లకంతో జెఆర్‌డి టాటా లాంటి ప్రముఖుల చిత్రాలు అల్లుతున్నారని చదివాను. ఓపిక, ఉపాయం ఉండాలే గానీ ఎన్నెన్ని వెరైటీలుగానో అల్లవచ్చు. మా అమ్మ వెంకటేశ్వరస్వామి, అలివేలు మంగల చిత్రాలను అల్లింది. శ్రీకృష్ణుని లీలలు అల్లిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా ప్రయోగాత్మకంగా పిల్లల స్కూలు బ్యాగును, వాచీని, రాఖీలను తయారు చేశాను. నాకు రాఖీని అల్లినవారు ఎవరూ కనిపించలేదు. ఇప్పుడు మనం గులాబీలను అల్లుదామా, లిల్లీలను అల్లుదామా ఆలోచించుకోవాలి. అల్లాల్సిన పూల రంగుకు అనుగుణంగా ''పూసల్ని తెచ్చుకోవాలి. కొద్దిగా సులభంగా ఉండే ఐదు రెక్కల సాదా పువ్వుల్ని చూపిస్తున్నాను. ఎరుపు రంగు పూసలతో ఐదు రెక్కల్ని అల్లుకున్నాను. మధ్యలో కేసరాల కోసం పొడవైన తీగలాగా పెట్టాను. ఇలా పూలు తయారు చేసి ఒక కాడకు గుచ్చి ఫ్లవర్‌వేజ్‌లో పెట్టాలి. ఫ్లవర్వేజ్లాగా ఒక సీసాను తీసుకొని దానికి వల వలె పూసల అల్లకం అల్లుకుంటే మ్యాచింగ్‌గా ఉంటుంది.
అరటి గెల చేద్దాం
దీనికి ఆకుపచ్చ రంగు మామూలు చిన్న పూసలు కావాలి. ఈ ఆకుపచ్చ రంగు పూసలతో కాడను అల్లుకోవాలి. పై రెండు బొమ్మల అల్లకం వేరు. దీని అల్లకం వేరు. ఇది నాలుగు పలకలుగా రావాలి. అందువలన ముందుగా నాలుగు పూసల్ని అల్లాక పక్కనుంచి మూడు పూసలు కలిపి మరల నాలుగు పూసల అల్లకం రావాలి. అలా నాలుగువైపులా అల్లితే మధ్యలో ఖాళీగా లావుగా వస్తుంది. చివరగా నాలుగో పక్కకు వచ్చే సరికి రెండు పూసలే పడతాయి. ఇలా గెలకు కావాల్సిన కాడను తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అరటి పళ్ళు పెట్టాలి. దీని కోసం రెయిన్ డ్రాప్ పూసలు తెచ్చుకోవాలి. ఇవి పసుపు రంగులో ఉండాలి. ఈ కాడకు ఒక్కొక్క పసుపు రంగు పూసను అతుకుతూ వైరు చుట్టుకోవాలి. అరటి గెల తయారయ్యే వరకు చివరిదాకా పూసలు అల్లాలి. మా చిన్నప్పుడు ఈ అరటిగెల ఎంత ఫేమస్ అంటే మా చుట్టాలందరి ఇళ్ళలో షోకేసులో ఉండేది. మా ఇంట్లో కూడా మా అమ్మ అల్లిన అరటి గెల ఇప్పటికీ ఉంది.
ద్వార తోరణం
పూసలు మానవ జీవితంలో చాలా మిళితమై ఉంటాయి. మన సామెతలు పొడుపు కథలు, జాతీయాలు అన్నింటిలో పూసలకో స్థానం ఉన్నది. ''ఆమె ఆ విషయాన్ని పూస గుచ్చినట్టు చెప్పింది'' అంటూ పెద్ద వాళ్ళు చెప్పే విషయాల్లోనూ, సాహిత్యంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. పూసకు పూసకు మధ్య ఖాళీ లేకుండా క్రమ పద్ధతిలో గుచ్చినట్టుగా ఉంటాయి కాబట్టి చెప్పే విషయంలో ఎక్కడా ఏదీ మరిచి పోకుండా వరసగా చెప్పేటటువంటి విషయాన్ని 'పూస గుచ్చినట్టుగా' అంటారు. పూసలతో వాకిలికి కట్టే ద్వార తోరణం చేసుకుందాం. తోరణమే కాకుండా హాఫ్ కర్టెన్ కూడా చేసుకోవచ్చు. నేను గ్లూకోజ్ వైర్లు, పొడుగు పూసలతో హాప్ కర్టెన్, ఫుల్ కర్టెన్ను చేశాను. ద్వార తోరణానికి ముందుగా నాలుగు వేళ్ళ పట్టీ వలె సాదాగా ఏ జాలరి లేకుండా అల్లుకోవాలి. జాలరీ ఉండదుగానీ దీనిలో డిజైను చేయవచ్చు. డిజైను ఎలా చెయ్యాలనుకుంటున్నామో ఆ విధంగా వచ్చేలా వివిధ రంగుల పూసల్ని వాడాలి. కొంతమంది ఇంత వరకే కూడా వాకిలికి కట్టేసుకుంటారు. ఇంతకు ముందు గొలుసుకు చెప్పిన వల లాంటి డైమండ్ డిజైను వేసుకోవచ్చు. నా చిన్ననప్పుడు నేను బేబీల డిజైనును అల్లాను. ఇప్పుడు ఎవరూ అలాంటి డిజైను అల్లడం లేదు. అమ్మాయిలు వేలాడుతున్నట్టుగా వేశాను. ఇప్పుడు చిలకలు, ఏనుగులు వేలాడుతున్నట్టుగా అల్లవచ్చు. లేదంటే ఏ నూతన సృష్టి అయినా చెయ్యవచ్చు.
కీచైన్ చేద్దాం
హాస్పిటల్ రూములకు స్పెషల్‌గా వీటిని చేశాను. అలాగే మా పిల్లల హాస్పిటల్ కోసమని చిన్న బొమ్మ ఉయ్యాలను తయారు చేశాను. ఇలా కొత్త ప్రయోగాలు చేస్తునే ఉన్నాం. కీచైను తయారు చేయడం చాలా సులువు. నలుచదురంగా గానీ, డైమండ్ ఆకారంలో గానీ చేసుకుంటే బాగుంటుంది. మొదటగా ఆరు పూసలతో రింగు అల్లుకోవాలి. పూసల్లో ఆరు పూసల అల్లకం కూడా ఉంటుంది. ఇప్పుడు దాన్ని చెప్పడం లేదు. ఆరు పూసల రింగుకు నలుచదరపు బిళ్ళను అల్లాను. దానికి కింద నాలుగు పూసలు గుచ్చి ప్లాస్టిక్ పువ్వును పెట్టాను. ఐదు నిమిషాలలో అయిపోతుంది. ఇలా నాలుగైదు రంగులలో చేసుకుని పెట్టుకుంటే అందంగా ఉంటుంది. రబ్బరు బొమ్మలకు పూసల డ్రెస్‌లు అల్లి అందంగా తయారు చేయవచ్చు. ఇవీ పూసల అల్లకాల విశేషాలు.