Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెండ్లి, పిల్లలు, ఇంట్లో పెద్దల బాధ్యతలు... కారణాలేవైనా ఉద్యోగానికి తాత్కాలిక విరామం తర్వాత కొత్తగా కొలువులో చేరాలనుకుంటున్నారా? ఇలాంటప్పుడు ఏ మాత్రం తడబడొద్దంటున్నారు కెరియర్ నిపుణులు. ఉద్యోగాన్ని సంపాదించడంలో ఈ సూత్రాలు మీకు సాయపడతాయని సూచిస్తున్నారు.
కెరియర్లో బ్రేక్ తీసుకుని తిరిగి ఉద్యోగంలో చేరే మొదటి వ్యక్తో, చివరి వ్యక్తో మీరు కాదు. విరామం తీసుకోవడం తప్పూ కాదు. దానికి చిన్నబుచ్చుకోవడం, తప్పు చేసినట్టుగా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం వంటివి చేయొద్దు. ముఖాముఖిలో అందుకు కారణాలు వెల్లడించాల్సి వచ్చినప్పుడు నిజాయతీగా చెప్పండి. పిల్లలనో, పెద్దలనో చూసుకోవడానికి ఆ పని చేయాల్సి వస్తే అది ప్రశంసనీయమే కదా.
గతంలో ఎప్పుడో తయారు చేసిన రెజ్యూమెను ఇప్పుడు ఉద్యోగానికి వాడకండి. ఇప్పటి పరిశ్రమ అవసరాలను గుర్తించి అందుకు తగ్గ మీ నైపుణ్యాలను ప్రస్తావిస్తూ కాస్త సృజనాత్మకంగా దాన్ని తయారు చేయండి. కెరియర్ విరామాన్ని స్పష్టంగా చెప్పాల్సి వచ్చినా కూడా... దాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం రాకుండా నాన్క్రోనలాజికల్ విధానంలో దీన్ని రూపొందించండి.
ఇంటర్వ్యూకి వెళ్లే ముందు సాధన చేయడం మరిచిపోవద్దు. గతంలో మీరెదుర్కొన్న ముఖాముఖిలకు భిన్నంగా ఇది ఉండొచ్చు. ఇప్పటి మార్కెట్ అవసరాలూ, వచ్చిన మార్పులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు ఎంత మార్చుకున్నారో చెప్పాల్సి రావొచ్చు. ఇందుకోసం ముందుగానే డిజిటల్ టెక్నాలజీ, నూతన సాఫ్ట్వేర్లలో సర్టిఫికేషన్ కోర్సులు చేయండి. ఇవన్నీ మీరు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసేలా చేస్తాయి.
ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు మార్కెట్ పోకడల్నీ, ఇండిస్టీ అవసరాల్నీ గుర్తించాలంటే ముందు మీరు సంబంధిత నెట్‌వర్క్‌లో భాగం కావాలి. ఇందుకోసం ఇప్పుడు లింక్డిన్ వంటి ప్రొఫెషనల్ మాధ్యమాలెన్నో ఉన్నాయి. ఇవన్నీ మిమ్మల్ని అప్టూ డేట్‌గా ఉంచుతాయి.