Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నచ్చినవి చేసిపెట్టడం, అడగకుండానే అన్నీ సమకూర్చడం అంతెందుకు తప్పు చేసినప్పుడు వేసే దెబ్బ.. ప్రతిదీ మనం పిల్లలపై చూపే ప్రేమే. కానీ ఈతరం చిన్నారులకు ఈ తరహా ప్రేమ అర్థమవుతుందా? అందుకే చూపడం కాదు.. మాటల్లో చెప్పమంటున్నారు నిపుణులు..
బోసినవ్వుల నుంచి వాళ్లు చెప్పే కబుర్ల వరకు ప్రతీదీ అపురూపమే. అది మన మనసులో అనుకుంటే సరిపోదు. 'నా జీవితంలో సంతోషం నింపావు. నా బంగారు కొండవి' అంటూ చెప్పేయండి. వాళ్ల సంబరం మీకే అర్థమవుతుంది. అర్థం చేసుకునే వయసు లేకపోయినా 'అమ్మ ఆనందంగా' ఉన్నదైనా తెలుస్తుంది.
మనం కోపంగా ఉన్నప్పుడు చుట్టేసుకోవడం, పనిలో సాయం చేయడం.. ఇవీ వాళ్ల ప్రేమను మీకు చూపే మార్గాలే. చెప్పిన మాట విన్నా.. బుద్ధిగా నడుచుకున్నా మెచ్చుకోండి. భవిష్యత్తులో మెప్పుకోసమైనా కొనసాగిస్తారు. స్నేహితులొచ్చినప్పుడు వాళ్ల పిల్లలను పొగడటం.. మనవాళ్ల తప్పులు ఎంచడం చేస్తుంటాం కదా! అలా చేయకుండా వాళ్ల నైపుణ్యాలు, అర్థం చేసుకునే తీరు వంటివి చెప్పండి. ఇవీ వాళ్లను మంచి మార్గంలో నడిచేలా చేసేవే!
మౌనంగా చేసుకుంటూ వెళ్లడం కాదు. 'చూడు.. నీకిది ఇష్టమని గుర్తుంచుకొని మరీ తెచ్చా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే నీతోనే ఉండాలని, ఆడుతోంటే చూడటానికి వచ్చా' అంటూ ప్రేమని మాటల్లో చెప్పండి. భద్రతే కాదు.. అన్నీ మనసు విప్పి పంచుకోవడమూ అలవాటు చేసిన వారవుతారు.
చిన్నగా ఉన్నప్పుడు బుగ్గలు గిల్లి ముద్దు చేయడం, ఆడటం లాంటివి చేస్తాం. పెద్దయ్యాక ప్రేమగా దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడటమే మానేస్తాం. 'పెద్దదానివయ్యాం, ఇంకా చిన్నపిల్లవా' అని మనం అన్నా.. చిన్నగా ఉన్నప్పుడే ప్రేమ, పెద్దయ్యాక అమ్మానాన్నలకు నచ్చం అనే అభిప్రాయానికి వస్తారట. రూపురేఖలపైనా అసంతృప్తి ఏర్పడుతుందట అప్పుడప్పుడైనా మెచ్చుకుంటూ ఉండటం మరవొద్దు.