Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిజినెస్ ఉమెన్
అదొక పిల్లల వార్డ్. ఎందరో చిన్నారులు తల్లుల వడిలో కూర్చోలేక.. అమ్మ కిందికి ఎందుకు దించటం లేదో అర్థంకాక బిత్తరచూపులు చూస్తున్నారు. తమ పక్కనే ఉన్న చిన్నారుల ఏడ్పులకు తామూ వంతకలుపుతూ కొందరు, సెల్ ఫోన్లో కార్టూన్లు చూస్తూ ఇంకొందరు మొత్తంగా ఆ వార్డంతా అమ్మలు, పిల్లలే. అంతలో ఓ పిల్లాడి తల్లికి పిలుపొచ్చింది. లోపలికి వెళ్ళగానే దద్దర్లు తేలి ఉన్న పిల్లాడి చర్మాన్ని చూపించిందా తల్లి డాక్టర్‌కి. ''పసిపిల్లల చర్మం బాగా సున్నితం, మీరు వాడుతున్న చర్మ సంబంధ క్రీమ్స్ వాడికి సరిపడటం లేదు'' పిల్లాడిని ముద్దుచేస్తూ చెప్పిందా డాక్టర్. అమెరికాలో ఉన్నప్పుడు బాబుకి ఎప్పుడూ ఇలా కాలేదని ఇండియాకి వచ్చాకే ఇలా జరుగుతుందని వివరించిందా తల్లి. 'ఇక్కడి ఉత్పత్తులు బాబుకి సరిపడటం లేదు, మీరు ఇక ఇక్కడే ఉంటారా' అడిగింది డాక్టర్. 'అవునండీ! అమెరికా నుండి మేమిక్కడికి షిఫ్ట్ అయ్యాము. వస్తున్నప్పుడు మాతో తెచ్చుకున్నవి అయిపోయాయి. ప్రతిసారీ అమెరికా నుండి సబ్బులు, షాంపులు తెప్పించుకోలేం కదా మరి ఇప్పుడెలా' అదే కంగారుగా అడిగింది. పెదవి విరిచిందా డాక్టర్. ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదు. తన బాబు చర్మమేమో చాలా సెన్సిటివ్. తల్లడిల్లింది ఆ తల్లి మనసు. తాను ఫార్మసీలో గోల్డ్ మెడలిస్ట్. తానే ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనుకుంది. తన అవసరం అన్వేషణకు పురిగొల్పింది. ఆ అన్వేషణ మరో అవకాశాన్ని అందించింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోనవసరం రాలేదు. తనలాగా ఎందరో తల్లులకు ఒక నిశ్చింత, సాంత్వన కల్గించింది. అలా ఉద్భవించిందే ఆయుషు ఆమోదించిన ప్రోడక్ట్ షుషూ బేబీస్ నేచురల్ వెల్ నెల్ బ్రాండ్ - హై క్వాలిటీ స్కిన్ కేర్ ప్రోడక్ట్. ఆ తల్లి పేరే సులక్షణ మందాడి.
పిల్లలకు అసలైన ఆస్తులు భవంతులు బంగారాలో కాదు ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే వాతావరణ కాలుష్యాలు, పంటల కాలుష్యాలు, నీటి కాలుష్యాలు అన్నిటి మధ్యా ఈ లోకంలోకి అడుగుపెడుతున్న చిన్నారులకు మళ్ళీ మనం రసాయనాల ఉత్పత్తులే అందిస్తే ఎలా? ప్రకృతి సిద్ధమైన, ప్రకృతి వరప్రసాదితాలైన దినుసులతోనే పిల్లల ఆరోగ్యానికి అవసరమైన వస్తువుల్ని తయారు చేయలేమా? అని ఆలోచించింది సులక్షణ.
ఓ ఆరోగ్య ప్రస్థానం
ఎన్ని ఉత్పత్తులనో బేరీజు వేసుకుని బజార్లో దొరికేవాటిని పరిశీలించి, పరిశోధించి అప్పుడే అమ్మ బొజ్జలోంచి భూమ్మీద కొచ్చిన బంగారు పిల్లలకి ఈ రసాయనిక లేపనాలు రాయడం ఇష్టం లేక తన బిడ్డ కోసం ఓ ఆరోగ్య ప్రస్థానం సాగించింది. అవసరాల్లోంచే కదా అవకాశాల కల్పన దొరుకుతుంది. తన చిన్నబిడ్డ కోసం తాను అన్వేషించిన, రూపొందించిన ఆరోగ్య చర్మ సంబంధ ఉత్పత్తులు ఆ తర్వాత ఎందరో పిల్లలకు ఒప్పేశాయి. వారి తల్లులకు తెగ నచ్చేశాయి. ఇక అప్పుడు 'షుషూ బేబీస్' పేరుతో ప్రకృతి సిద్ధమైన చర్మ, కేశ సంరక్షణ ఉత్పత్తులను లాంచ్ చేసింది సులక్షణ.
అంచనాలు తలకిందులు చేస్తూ...
'ఏంటమ్మా.. మళ్ళీ ఈ సేంద్రీయ ఉత్పత్తులు. ఉన్నవే అమ్మలేక చస్తున్నాం. ఎవరు కొంటారమ్మా. వద్దు తీసుకెళ్ళండి' ప్రోడక్ట్ తయారు చేశాక షాపులవాళ్ళు చెప్పిన మాటలు. 'ఏమిటీ! నువ్వొక పిల్లల చర్మపు సబ్బు తయారుచేశావా? నీ బిడ్డకు వాడి చూశావా' అని హేళనగా కొందరు మిత్రలు. 'బాబోరు లోకల్‌గా చేస్తే ఎవరు కొంటారు మేము గ్లోబల్ బ్రాండ్సే చూస్తాం' డాబుసరి చూపించింది ఒక బంధువు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లాంచ్ చేసిన కొద్ది కాలానికే మంచి ఫలితాలు సాధించింది షుషూ బేబీస్
మెళకువలు తెలీదు
షుషూ బేబీస్ ఉత్పత్తులకోసం ముందుగా సంప్రదించింది తన మిత్రురాలైన ఓ ఆయుర్వేద వైద్యురాల్ని కావటం వల్ల సులక్షణకి ఆదిలోనే మంచి గైడెన్స్ దొరికినట్లనిపించింది. క్లినికల్ ట్రయల్స్ కూడా మంచి సంతృప్తినే కలిగించాయి. ఆయుష్ లైసెన్స్ కూడా సులభంగానే వచ్చింది. కానీ ఆమెకు మార్కెటింగ్ మెళకువలు తెలియలేదు. ఏదైనా ఒక ఉత్పత్తిని మేథస్సుతో తయారు చేయొచ్చుకానీ ఆ ఉత్పత్తి ఎంత గొప్పదైనా ప్రజల దగ్గరికి చేర్చటంలో డీలా పడిపోతున్నాయి ఎన్నో సంస్థలు. మౌత్ పబ్లిసిటీ ద్వారానే అప్పటివరకు షుషూబేబీస్ ప్రోడక్ట్స్ తీసుకుని వెళుతున్నారు అమ్మలు. ఎంత కష్టపడ్డా పెద్దగా లాభాలు రావటం లేదు. శ్రమ మిగిలిపోతోంది. మళ్ళీ వెనక్కు వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరి రాత్రుళ్ళు విధినిర్వహణలో ఉండిపోయి కుటుంబాన్ని పట్టించుకోలేక ఇబ్బందులు పడడానికి ఆమె మనసు అంగీకరించటం లేదు. ఇది తాను ఇష్టపడి చదివిన రంగం. కష్టపడి ఒక ఉత్పత్తిని తయారుచేసిన రంగం. ఎలాగైనా ఈ రంగంలోనే తాను ఎదగాలి, నిలదొక్కుకోవాలి. ఇది తనదైన ఫీల్డ్ అనుకుంది. కొంతకాలానికి ఆర్థిక సమస్యలు ఎదురొచ్చాయి. వినియోగదారులు కూడా ధర ఎక్కువంటూ మొఖం చాటేస్తున్నారు. పెద్ద ఎత్తున చేస్తే తప్ప వినియోగదారులకి గిట్టుబాటు ధర రాకపోవచ్చు. తక్కువ మోతాదులో తయారు చేస్తుంటే అమ్మకం ధర ఎక్కువగా ఉండటం వల్ల ప్రోడక్ట్‌కి వచ్చిన పేరు తిరిగి మసకబారొచ్చు. దిక్కుతోచని స్థితిలో డీలా పడిపోయింది.
మేనేజ్ మెంట్ టెక్నిక్స్ నేర్చుకుంది
ఆ సమయంలో మళ్ళీ ఆదుకుంది మిత్రులే. వాళ్ళు Wehub గురించి చెప్పారు. ధైర్యంగా మహిళా ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం పెట్టిన ఆ పారిశ్రామిక మండలికి వెళ్ళింది. తన ప్రాజెక్ట్ అవసరం సమాజానికి ఎంతుందో చక్కగా వివరించింది. డబ్బు లేకపోవటం వల్ల తన ఉత్పత్తిని అవసరం ఉన్న అమ్మలందరికీ చేరవేయలేకపోతున్నానన్న తన అసహాయతను కూడా వెళ్ళగక్కింది. మార్కెట్ చేసుకోవడానికి కొంత అండగా నిలబడే వ్యవస్థ కావాలని కోరింది. అప్పుడే తాను ప్రెజెంట్ చేసిన విధానం నచ్చిన Wehub తాను కోరిన విధంగా తనకు కావలసిన అవకాశాన్ని, సదుపాయాల్ని అందిస్తామని ముందుకొచ్చింది. ముందుగా ఒక మెంటర్ని ఏర్పాటు చేశారు. తన ద్వారా ఎలా ఒక ప్రాజెక్ట్‌ని వివరించగలమో, ఎలా ప్రణాళిక వేసుకోవాలో మార్కెటింగ్ కోసం మనం నిర్దేశించుకునే లక్ష్యాన్ని చేరుకోవటానికి కావలసినవి ఏమిటి అన్నది తెలియపరిచారు. వారు ఏర్పాటు చేసిన కొన్ని తరగతులకు హాజరై వారి నిర్వహణలో మేనేజ్ మెంట్ టెక్నిక్స్ నేర్చుకుంది. ఆ తర్వాత వాళ్ళే 15 లక్షల రుణం కూడా మంజూరు చేశారు. ఎక్కడో ఒక షాప్ పెట్టి దానికి రెంట్ కట్టి ఓ మనిషిని పెట్టి అమ్ముకుంటూ కూర్చుంటే ఉత్పత్తులను ఎవరు తయారుచేస్తారు. తాను సూపర్ వైజ్ చేయకుండా ఉత్పత్తుల క్వాలిటీ దెబ్బతినకుండా దగ్గరుండి చూసుకోవాలనుకుంది. అందుకే ఆన్ లైన్ బిజినెస్‌ను ఎంచుకుంది.
ఏ బ్రాండ్ అయినా ఒక పసిపాపే
నిజమే పసిపాపలను ఎలాగైతే కంటికి రెప్పలా చూసుకోవాలో, స్టార్టప్ కంపెనీలను కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ పోటీ ప్రపంచంలో అడుగడుగునా ఛాలెంజ్ లే. ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతూనే ఉండాలి. ఇవ్వాల్టి తల్లులు విజ్ఞానవంతులు. పిల్లలకు నచ్చే ప్రతి ఉత్పత్తి ముందుగా తల్లులే మెచ్చాలి. వారు మెచ్చితేనే కదా పిల్లలకి వాడతారు. రసాయనిక ఉత్పత్తులను చూసి చూసి విసుగుతో ఉన్నారు. కాబట్టే పిల్లల బాడీ వాష్, ఫేస్ వాష్, ఆయిల్ మసాజ్, హెయిర్ ఆయిల్, కండీషనర్స్, షాంపూలు ఇలా నవజాత శిశువుల నుంచి మూడేండ్ల వరకు, మూడేండ్ల నుంచి 12 ఏండ్ల వరకు తమ ఉత్పత్తులన్ని అమ్ముతున్నారు. ఇవన్నీ ఉసిరి, ఆల్మండ్ ఆయిల్, కొబ్బరినూనె వంటి సేంద్రియ వస్తువులతోనే తయారుచేస్తున్నారు. ఇంతేకాకుండా వేగన్ బ్రాండ్‌గా కూడా తయారు చేస్తున్నారు.
మార్కెటింగ్
ఏ రంగం చేతకాదని తాను భీతిల్లిందో, వెనకడుగు వేసిందో ఆ రంగంలోనే ఇప్పుడు పరుగులు పెడుతోంది. లక్ష్యం కోసం కనే కలలు కమ్మగా ఉంటాయి కానీ మార్గంలోనే ముళ్ళు ఎక్కువగా ఉంటాయి. భయపడి ఆగిపోకూడదు. వాటిని ఏరుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. మారే తల్లుల అంతరంగాన్ని గమనించి వారికి కావలసిన విధంగా అన్ని అందించటంతో షుషూ బేబీస్ ఉత్పత్తి తల్లుల ఇష్టంగా మారింది. ఈ ఉత్పత్తులన్నీ Flipkart, Big basket, Meeshow, Myntra, Misthy, Amazonలలో దొరుకుతున్నాయి.ఇప్పుడు అవసరం ఉన్నవారే ఆర్డర్ చేస్తున్నారు. డబ్బులు పంపించి మరీ ఆర్డర్స్ ముందే బుక్ చేసుకుంటున్నారు. కొంతమంది ఐడెంటిటీ క్రైసెస్ వల్లే కదా ఈ స్టార్టప్ వచ్చింది అన్నారు. అది విని సులక్షణా ఒక చిరునవ్వు నవ్వింది. దీపం నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉంటుంది. ముందు చీకట్లోనే ఉంటుంది. ఆ చీకటిని చీల్చాకే ఆ వెలుగుతోనే తన పరిచయాన్ని మొదలెడుతుంది. సులక్షణా అలాంటిదే. తాను విజయం సాధించాకే లోకానికి తన పరిచయాన్ని చేసుకుంది. తాను చదివిన చదువును జ్ఞాపకం చేసుకుంది. ఎంతో ఇష్టపడి చదివితేనే కదా గోల్డ్ మెడల్ వచ్చింది. పొట్టకూటికోసం తనది కాని సాఫ్ట్‌వేర్‌ని పట్టుకొని వేళ్ళాడటం ఎందుకు అన్న మీమాంసలో కొంతకాలం ఊగిసలాడింది. చివరికి మనసు చెప్పిందే విని సులక్షణ ఇప్పుడు సలక్షణంగా తనదైన సొంత వ్యాపారంతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది. తన కాళ్ళమీద తను నిలబడి పిల్లల చర్మ ఆరోగ్య సంరక్షకురాలిగా ఎదిగింది. ఏదైతే ఉద్యోగం లేదని, తాను కుటుంబానికి ఆధారంగా నిలబడలేకపోతున్నానని భయపడిందో తానే ఇప్పుడు దాదాపు 50 మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వగలిగింది. ఇందులో ఎక్కువగా మహిళలే ఉండటం విశేషం.
వారి నవ్వుల్లోని సంతృప్తి
సులక్షణ చిన్నప్పటి నుండీ అంతే. ఆలోచించందే నిర్ణయం తీసుకోదు. కష్టపడందే అవకాశం తెచ్చుకోదు. గొప్ప వ్యక్తిత్త్వం వల్ల గౌరవం ఆలస్యం కావచ్చుకానీ అసలు రాకుండా మాత్రం ఉండదని గట్టిగా నమ్మింది. కాబట్టే 'ఈ భూమ్మీదకి అతిథులుగా వచ్చిన మనం అరువుగా ఉండి రేపటి మానవాళి ఆరోగ్య సమాజానికి ఎరువుగా ఉపయోగపడదాం' అంటుంది. పిల్లలకి మన ద్వారా కలిగే సౌకర్యం, సదుపాయాలతో వచ్చే వారి నవ్వుల్లోని సంతృప్తి తననెంతో ఆనందానికి గురిచేస్తున్నాయంటుంది. ఇటుక ఇటుక పేర్చినట్టుగా శ్రమపడి సంపాదిస్తుంది .సులక్షణా థ్యాంక్స్ చెప్తుంది Wehubకి మాత్రమే కాదు తమ పిల్లలకి కాలుష్య రహితమైన ఆరోగ్య ప్రదమైన ఆయుష్ ఉత్పత్తుల్ని ముందుచూపుతో అందిస్తున్న తల్లులందరికీ కూడా.
- అయినంపూడి శ్రీలక్ష్మి, 9989928562