Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉమ్మడి కుటుంబంలో బిజీగా గడిపే సభ్యుల మధ్య ఒంటరితనం ఆమె నేస్తమయింది. అదే ఆమె మనసును సాహిత్యం వైపుకు మళ్ళించింది. విస్తృతంగా చదివిన పుస్తకాలకు ప్రభావితం అయ్యింది. రాయాలనే కాంక్షను మరింత పెంచింది. అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని కలం బలంతో సమాజాన్ని మార్చవచ్చనే నమ్మకంతో రాయడం మొదలుపెట్టింది. ఆమే సత్యనీలిమ. ఆమె సాహిత్య పరిచయం నేటి మానవిలో...
మీ బాల్యం, పెరిగిన వాతావరణం, చదువు ఎలా కొనసాగింది?
మాది సంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబం. అయినా కూడా వ్యవసాయ కుటుంబం. నా బాల్యమంతా మా గ్రామంలోనే గడిచింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాను. మాగ్రామానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వనపర్తిలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. నేను పెరిగింది పల్లె వాతావరణం. ఉదయాన్నే పలకరించే సూర్యుడు, పక్షులు, ఇంట్లో ఉండే లేగదూడల పరుగులు ఇవే కాలక్షేపాలు. మేము ముగ్గురం అమ్మాయిలమే కాబట్టి ఆంక్షలు కూడా ఎక్కువే. పొలానికి వెళ్ళి అక్కడ కూడా వారు చేసే పనులు చూస్తూ నాకు చేతనైన సహాయం చేస్తూ ఎంతో ఆనందంగా గడిపాను.
సాహిత్యంతో మీ పరిచయం?
మాది ఉమ్మడి కుటుంబం. అయితే అందరూ ఎవరి పనుల్లో వారు ఎప్పుడూ బిజీగా గడిపేవారు. దాంతో నేను ఒంటరిగానే గడిపేదాన్ని. ఆ ఒంటరితనమే నా నేస్తమయింది. అదే నేను సాహిత్య రంగంలో పరిచయం కావడానికి కారణమయింది.
రాయడంలో మీకు స్ఫూర్తి ఏమిటి?
అప్పట్లో మా ఇంటికి అనేక దినపత్రికలు వచ్చేవి. వాటిలో ఆదివారం పుస్తకంలో కవితలు, కథలు చాలా బాగుండేవి. వారి పేర్లతో, ఫొటోలతో అందంగా ఉండేవి. అందులో నాపేరు, ఫొటో కూడా చూసుకోవాలనే కోరిక చిన్నతనం నుండే ఉండేది. అంతేకాకుండా శ్రీశ్రీ, సినారె గార్ల కవితలు కూడా పత్రికలలో చదివాను. నండూరి వారి ఎంకి గురించి కూడా చదివాను. ఇలా ఇవన్నీ నా సాహిత్య ప్రస్థానానికి బాటలు వేసాయి. నేను ఏడవతరగతి చదివేటప్పుడు మొట్టమొదటి సారి అమ్మ గురించి రాసిన కవిత పేపర్లో వచ్చింది. అది చాలా ఆనందమనిపించింది.
ఇప్పటి వరకు మీరు చేసిన రచనలు, ముద్రించిన పుస్తకాలు?
ఇప్పటివరకు దాదాపు 500 కవితలు, 100 పాటల వరకు రాసాను. రవి కిరణాలు అనే సంపుటిల్లో అమ్మ గురించి, పసిపిల్లలపై జరుగుతున్న దాడుల గురించి ఇందులో కవితలు ఉన్నాయి. నీ తలపుల్లోనే అనేది అన్నీ ప్రేమ కవితలు. ప్రేమ అంటే ఏమిటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాని అనుభూతి ఏంటి అనే విషయాలపై రాసిన దీర్ఘ కవిత ఇది. అమృత మూర్తికి అక్షర నీరాజనం అనే సంకలనానికి సంపాదకత్వం వహించాను. ఇందులో 108 మంది కవుల కవిత్వాన్ని సేకరించి మాతృదినోత్సవం సందర్భంగా 2020లో తీసుకొచ్చారు.
ఓ రచయిత్రిగా, మహిళగా ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా..?
ఎదుర్కోవడం జరిగింది. ఎక్కడైనా ప్రోగ్రాంలకు వెళ్ళినప్పుడు అవకాశమే ఇచ్చేవారు కాదు. బంధువులతో కూడా అవమానాలు చాలానే జరిగాయి. అయినా కూడా నా నిర్ణయం మార్చుకోకుండా మావారు ఇచ్చిన ప్రోత్సాహంతో సాహిత్య రంగంలో కొనసాగుతూనే ఉన్నాను.
సమాజంపై సాహిత్యం ఎలాంటి ప్రభావం చూపుతుందనుకుంటున్నారు..?
ప్రస్తుతం ఉన్న సమాజంలో మార్పు రావడం చాలా అవసరం. కానీ దీన్ని మార్చడం అంత సులభం కాదు. అది ఒక్కరితో అయ్యేపని కాదు. అందరం కలిసికట్టుగా నిలబడి అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని కలాన్ని బలంగా చేసుకుని ప్రతిఒక్కరు ప్రయత్నిస్తే తప్పకుండా సాధ్యమవుతుంది. దీనికి నా వంతు కృషి నేను చేస్తున్నాను.
కుటుంబ సహకారం ఎలా వుంది?
ఒంటరిగా ఉండి, ప్రశాంత వాతావరణంలో కూర్చొని రాస్తుంటాను. మావారు, పిల్లలు ఎప్పుడూ కూడా నాకు సహకరిస్తూనే ఉంటారు. వారు ఇలా సహకరించకపోతే రచయిత్రిగా నేను లేననే చెప్పాలి.
ఉద్యోగం, కుటుంబం, సాహిత్యం ఈ మూడింటిని సమన్వయం చేసుకునే క్రమంలో ఏమైన సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఒక వేళ ఎదురైతే వాటిని ఎలా జయిస్తున్నారు?
అప్పుడప్పుడు సమస్యలు వస్తుంటాయి. ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురవుతుంటాను. అలా ఇబ్బందిపడుతున్నపుడు మా అమ్మాయి అమ్మలా నాకు పనులలో సహాయం చేస్తుంది. ఇంట్లో తనే వంటపని చేస్తూ సహకరిస్తుంది.
ఓ రచయితగా మీ కర్తవ్యం?
సమాజానికి ఆదర్శంగా ఉండాలి, నా పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్ది, సాహిత్యం వైపు అడుగులు వేసేలా చేయాలని కోరుకుంటున్నాను.
ఇప్పటి వరకు అందుకున్న పురస్కారాలు?
డాక్టర్ సి.నారాయణ రెడ్డి సాహితీ, అలిశెట్టి సాహితీ పురస్కారం, సాహితీ సేవారత్న, యం.వి.నరసింహారెడ్డి పురస్కారం, మహిళా శిరోమణి, చిత్రావతి సాహిత్య కళాపురస్కారం, జాతీయ, రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారం-2019, స్పూర్తి రత్న పురస్కారం, అక్షరాలతోవలో జాతీయస్థాయి ఉత్తమ కవితా పురస్కారం అందుకున్నాను. వీటితో పాటు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ ది రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ ది రికార్డు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు, జైఇండియన్ బుక్ ఆఫ్ ది రికార్డు ఇలా ఎన్నో అందుకున్నాను.