Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అట్టడుగు జాతి నుంచి వచ్చిన ఆణిముత్యం. కష్టాల కడలిని ధైర్యంగా ఎదురీదిన సాహసి. తనతో పాటు తన జాతివారు కూడా ఎదగాలని బలంగా కాంక్షించే మనసున్న మనిషి. ఆవిడే సాకా శైలజ. సౌందర్య ఉత్పత్తుల పరిశ్రమను ప్రారంభించి మరికొంత మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న ఆమె జీవిత పరిచయం నేటి మానవిలో...
శైలజ పుట్టింది హైదరాబాద్‌లో. తండ్రి పత్యారా రాజశేఖర రెడ్డి, రైల్వే ఉద్యోగి. తల్లి యశోద, గృహిణి. శైలజకి ఒక అన్న, ఒక చెల్లి వున్నారు. తల్లిదండ్రులు చిన్నప్పటినుంచీ తమ ముగ్గురు పిల్లలను చాలా క్రమశిక్షణతో పెంచారు. శైలజ చేసే ప్రతి పనిలో తల్లి సహకారం ఉండేది. 19వ ఏట ఆమె వివాహం జరిగింది. అత్తవారింట్లోనూ ఆమెకు కావల్సినంత సహకారం అందింది. భర్త సాకా నాగేశ్వరరావు ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్. వీరికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి సింధూర తల్లికి వ్యాపారంలో చేయూతనిస్తున్నారు. మనవడు రుద్రాంశ్. కొడుకు ప్రణరు కుమార్ ఢిల్లీలో సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు.
ట్యూషన్లు చెబుతూ...
పట్నంలో పుట్టి పెరిగిన పిల్ల పెండ్లి చేసుకుని అంతగా అభివృద్ది చెందని అదిలాబాద్ జిల్లా చెన్నూరు వచ్చింది. పెండ్లి తర్వాత గ్రాడ్యుయేషన్ చేసిన శైలజ తానూ ఏదైనా చెయ్యాలను కున్నారు. అంత చిన్న ఊళ్ళో ఉద్యోగాలు వుండవని భర్త చెబితే నిరాశ పడలేదు. తన శక్తిని తాను నమ్ముకున్నారు. చుట్టు పక్కల పిల్లలకి ఇంగ్లీషు ట్యూషన్స్ ప్రారంభించి నెలకి రూ. 1500 పైన సంపాదించటం మొదలు పెట్టారు. ఈలోపు భర్తకు బదిలీ కావడంతో ఆ కుటుంబం సిరిసిల్లకు చేరింది. అక్కడ ఒక పూట ఓ స్కూల్లో పని చేస్తూ మిగతా సమయంలో ట్యూషన్లు చెప్పే వారు. ఈమె ప్రతిభ గుర్తించి ఒక స్కూలు వారు హెడ్ మిస్ట్రస్గా ఉద్యోగమిచ్చారు. అక్కడ మంచి పేరు తెచ్చుకు న్నారు. అప్పుడే వీరికి బాబు పుట్టాడు. అంతకు ముందు ఒక పాప. కాన్పు కోసం పుట్టింటికి వెళ్ళిన శైలజకు వివిధ రకాల ఆలోచనలు. చిన్న పిల్లవాడితో స్కూలుకి వెళ్ళి పని చెయ్యలేదు. అలా అని ఇంటికే పరిమితం కావడం ఇష్టం లేదు.
సొంతంగా చేయాలని...
తల్లిని సలహా అడిగితే ఉద్యోగం కన్నా సొంతంగా ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అన్నారు. బాబు పుట్టి 20 రోజులకు శైలజ బ్యూటీ పార్లర్ నడిపే సూర్యకళను కలిశారు. ఆవిడ దగ్గర బ్యూటీ పార్లర్‌కు సంబంధించిన మెళుకువలు నేర్చుకోవాలను కున్నారు. అప్పటి పరిస్ధితులనుబట్టి ముందు భర్త వద్దన్నా శైలజ పట్టుదల చూసి తర్వాత అంగీకరించారు. రూ. 4000 ఫీజు కట్టారు. సమాజంలో ఆర్ధికంగా, వృత్తివరంగా ఉన్నత స్ధాయిలో వుండాలని తల్లీ, తండ్రీ ముందునుంచీ చెప్పిన మాటలు శైలజ మనసులో స్ధిరంగా నిలిచిపోయాయి. 15 రోజుల్లో బ్యూటీ కేర్‌లో మెళకువలు నేర్చుకున్నారు. భర్త ఇంకా ఆర్ధికంగా సహాయం చేయలేకపోతే తన బంగారాన్ని కుదువబెట్టి కావలసిన సరంజామా తెచ్చుకున్నారు.
అధైర్య పడకుండా...
సిరిసిల్లా తిరిగి వచ్చాక తను నేర్చుకున్న విద్యతో ఒక బ్యూటీ పార్లర్ పెడదామనుకున్నారు. ఇక్కడ అలాంటివి నడవవని అక్కడివారు నిరుత్సాహపరిచారు. అయినా భర్తకు నచ్చచెప్పి ఒప్పించారు. పార్లర్ కోసం ఇల్లు అద్దెకు దొరకటం కష్టమయింది. కారణం తమ కులం గురించి అడిగినప్పుడు ఆవిడ ఏ దాపరికమూ లేకుండా యస్.సి. అని చెప్పటమే. చివరికి ఒక ఇంట్లో పార్లర్ తెరిచారు. ముందు రూ. 300 అద్దె అన్నవారు. పార్లర్ సంగతి తెలిసి వెయ్యి రూపాయలు చేశారు. శైలజ అధైర్య పడలేదు. అద్దెకు సరిపడేలా కనీసం వెయ్యి రూపాయలు వచ్చినా చాలని పార్లర్ ప్రారంభించారు. అయితే మొదటి నెల సంపాదన రూ. 5000 వచ్చింది.
చేనేత కార్మికుల కోసం...
అక్కడ వస్త్ర పరిశ్రమలో పవర్ లూమ్స్ రావటంతో మిల్లులున్నవాళ్ళు ఆర్ధికంగా బాగున్నారు. కానీ అందులో పని చేసేవాళ్ళు, చేనేత కార్మికులు ఆకలి చావులకు గురయ్యేవారు. వారి కుటుంబాలకి ఏమైనా చెయ్యాలనుకున్నారు. వారి పిల్లలకు ఏదైనా ఉద్యోగాలుంటే ఇప్పించమని అడిగారు. తన చేతిలోని విద్య వారి పిల్లలకి ఉచితంగా నేర్పించారు శైలజ. భార్య పట్టుదల చూసి భర్త ఆమెకు అండగా నిలిచారు. ట్రైనింగ్ ఇచ్చిన పిల్లలకు హైదరాబాద్‌లో ఉద్యోగాలిప్పించారు.
బ్యూటీ స్కూలు మొదలు పెట్టి
తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్‌లో కమ్యూనిటీ డెవెలప్ మెంట్ త్రూ పాలిటెక్నిక్‌లో ఒక కోర్సు ఇవ్వటానికి సెంట్రల్ గవర్న మెంట్ అవకాశమిచ్చింది. దాని ద్వారా 30,000 మంది విద్యార్ధులకు బ్యూటిషియన్ కోర్సులో ట్రైనింగ్ ఇచ్చారు. 3000 మందికి పైన ఉద్యోగా లిప్పించారు. అది తన జీవితంలో సాధించిన ఒక విజయమంటారు శైలజ. తర్వాత తనే ఒక బ్యూటీ స్కూలు స్ధాపించాలని అనుకున్నారు. ఆ సమయంలోనే పరిచయమైన ఒక వ్యక్తి ఈమెకు కార్పొరేట్ స్ధాయిలో ఒక బ్యూటీ స్కూలు, ప్లేస్‌మెంట్స్ కూడా వచ్చే టట్లు పెడితే బాగుంటుందన్నారు. కొంత ఆలోచన తర్వాత కరీంనగర్‌లోని ప్రశాంతి నగర్లో 2015లో బ్యూటీ స్కూలు మొదలు పెట్టారు. అది మొదలుపెట్టాక సిరిసిల్లలో వున్న డాక్టరు స్నేహితులు ఈవిడ కృషి చూసి మహిళా వ్యాపారవేత్తలకు రుణాలు ఇచ్చే సదుపాయం ఉందని చెప్పారు. దీని గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్ లో శ్రీరామ్‌ను కలిశారు. వారు ''మీరిప్పుడు చేస్తున్న ప్రాజెక్టుకు అనుబంధంగా ఏమి చెయ్యగలరో ఆలోచిం చండి, ప్రాజెక్టు రిపోర్టు తయారు చెయ్యటానికి నేను సహాయం చేస్తా'' అన్నారు. శైలజ అప్పుడు ఆలోచించటం మొదలు పెట్టారు.
కోటి రూపాయల లోన్‌తో...
సౌందర్య రంగంలో వున్న ఆమె సౌందర్య సాధనాలు ఎందుకు తయారు చెయ్యకూడదు అనుకున్నారు. అంతకు ముందే బ్యూటీ పార్లర్ నడిపేటప్పుడు ఫేస్ ప్యాక్‌ల వంటివి సొంతంగా తయారు చేసి వాడేవారు. అవి చాలా బాగున్నాయని అందరూ మెచ్చుకునేవారు. ఆ ధైర్యంతో శ్రీరామ్ సహకారంతో సౌందర్య సాధ నాలు తయారు చేసే పరిశ్రమకి అవసరమైన ప్రాజెక్టు రిపోర్ట్‌ని బ్యాంక్‌కి సమర్పించారు. అప్పటికి శైలజకు ప్రాజెక్టు, దాని రిపోర్టు, దానికి సంబంధించిన విషయాలు ఏమీ తెలియవు. అన్నీ శ్రీరామ్ చూసు కున్నారు. అయితే అతనికి విదేశాలలో మంచి అవకాశం వచ్చి వెళ్ళి పోయారు. దాంతో బ్యాంక్ లోన్ వస్తుందనే ఆశను ఆమె వదిలేసుకు న్నారు. కొన్ని రోజులకు బ్యాంకు వారు ఆమె వద్దకు వచ్చి ''మేడమ్ మీరు మళ్ళీ బ్యాంక్‌కి రాలేదేంటి' అడిగారు. అంత పెద్దలోన్ మాకె క్కడ వస్తుందనే సంశయంతో రాలేదన్నారు. 'అలాంటి అను మానాలెందుకండీ, మీకు కోటి రూపాయల లోన్ మంజూరు అయింది' అని చెప్పారు. ఆవిడ సంతోషం వర్ణనాతీతం. అంత లోను తన ప్రయత్నాలేమీ లేకుండా, ష్యూరిటీగా ఏ ఆస్తీ పెట్టకుండా రావటం అనేది మాటలు కాదు కదా. కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ద్వారా ఒక యస్.సి. అభ్యర్ధికి వారి ప్రాజెక్టు రిపోర్టు ఆధారంగా కోటి రూపాయలు మంజూరు చెయ్యటానికి అవకాశం వుందనీ, అదే తనకు వచ్చిందని ఆమెకు తర్వాత తెలిసింది. ప్రాజెక్టు రిపోర్టు తయారీలో సహాయం చేసిన శ్రీరామ్ విదేశాల నుంచే శైలజకి కంప్యూటర్ పరిజ్ఞానమంతా నేర్పారు.
ఉత్పత్తులకు శ్రీకారం...
2015లో కరీంనగర్‌లోని ప్రగతినగర్‌లో బ్యూటీ స్కూల్ స్ధాపించారు. 2019లో బ్యూటీ ప్రాడక్ట్స్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. విదేశాల వారు 5 కోట్ల వస్తువులకి ఆర్డర్ ఇచ్చారు. కానీ వచ్చి చూసి ఫ్యాక్టరీ పూర్తి హంగులతో వుంటేగానీ ఆర్డర్ ఇవ్వలేమన్నారు. ఆ సమయంలోనే తెలిసిన వారు ఇల్లు ఒకటి ఖాళీగా ఉందని దాన్ని తన ఫ్యాక్టరీకి ఉపయోగిం చుకోవల్సిందిగా చెప్పారు. దాంతో 9 సంవత్సరాలకి లీజు రాసుకుని ఫ్యాక్టరీ మొదలు పెట్టారు. అప్పటి నుండి అంచె లంచెలుగా అనేక ఉన్నతులు సాధించారు. తెలంగాణా స్టేట్ మోడల్ స్కూల్స్‌కి స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ ఎస్సెసర్గా ఈవిడని ఆహ్వానిస్తారు. ఈవిడ దగ్గర విద్యనభ్యసించిన వారిలో 20మంది పైన ఈ స్కూల్స్‌లో పని చేస్తున్నారు. అలాగే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు నిర్వహించే బ్యూటీ కోర్సు ప్రోగ్రాంలకు ఎగ్జామినర్‌గా వెళ్తారు. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు పది మందిలో ఈమె కూడా ఒకరు.
ఎంపికైన ఏకైక మహిళ
వి హబ్ వారు ఎపిడమిక్ సమయంలో హర్ ఎండ్ నౌ ప్రోగ్రాంకి శైలజను సెలెక్ట్ చేశారు. దీని ద్వారా బిజినెస్‌లో నేర్చుకోవాల్సిన అనేక మెళకువల గురించి ఆన్ లైన్ ట్రైనింగ్ ఇచ్చారు. శైలజ బ్రాండింగ్‌లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు గమనించి వారి ఆర్ధిక సహాయంతో బ్రాండిగ్ క్రియేట్ చేశారు. ఆ సమయంలో ట్రైనింగ్ ఇచ్చిన జర్మనీ యూనివర్సిటీ వారు వివిధ రాష్ట్రాలనుంచి ఒక్కొక్క పారిశ్రామికవేత్తనెన్నుకుని వారి గురించి వురు మీన్ బిజినెస్ (WE mean business.. 20 women entrepreneurs 20 stories) అనే పుస్తకం వేశారు. అందులో తెలంగాణా నుంచి ఎంపికైన ఏకైక మహిళ శైలజ. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ (కేంద్ర ప్రభుత్వం) వారు వారి ప్రోగ్రాములకు, క్లాసులు నడపటానికి, వర్క్ షాపులకు శైలజని ఆహ్వానిస్తుంటారు. ఇప్పటి వరకు శైలజకి 16 అవార్డులు వచ్చాయి.
వ్యాపారవేత్తలుగా ఎదగాలి
ఇన్ని ఆందోళనలలో భర్తకి మూడు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది. శైలజ తల్లి మరణించారు. ఆ సమయంలో ఏడాదిపాటు శైలజ డిప్రెషన్లోకి వెళ్ళారు. ఆరోగ్యం విపరీతంగా పాడయింది. డాక్టర్లు ఈవిడ ఇంక రెండు నెలలకన్నా బతకదు, ఈ రెండు నెలలూ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి పంపించారు. కానీ శైలజ ధృఢ సంకల్పానికి మారు పేరు. 'వ్యాపారమంటే అది తమ పని కాదు, తాము చెయ్యలేమని భయపడే తన జాతివారిని మంచి వ్యాపారవేత్తలుగా చెయ్యాలి. అంటే నా కష్టాలు వాళ్ళకి తెలియ కూడదు. అవి తెలిస్తే ఇన్ని కష్టాలు మేము పడలేమని ఇటువైపే చూడటం మానేస్తారు. నా విజయాలే చూడాలి వాళ్ళు. దానితో వాళ్ళు కూడా స్ఫూర్తి పొంది ముందుకు రావాలి' అంటారు శైలజ.
రోజాస్ బ్యూటీ వరల్డ్
ఆరోగ్యం కుదుటపడిన తర్వాత వ్యాపారం చూసుకోవడం మొదలు పెట్టారు. ప్రస్తుతం వారు సెలూన్ సర్వీసెస్, బ్యూటీ ట్రైనింగ్ స్కూల్ నడపటమే కాకుండా పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, హౌస్ హోల్డ్, హౌస్ కీపింగ్, స్కిన్ అండ్ హైర్ కేర్‌కి సంబంధించి ఆర్గానిక్ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఇంతకీ శైలజ నడిపే సంస్ధ పేరు చెప్పలేదు కదూ రోజాస్ ఇండిస్టీస్ (స్కిన్ ఫ్రెండ్లీ). రోజాస్ బ్యూటీ వరల్డ్ అండ్ బ్యూటీ స్కూల్ (బ్యూటీ - వెల్ నెస్ - కెరియరి బిల్డింగ్). వీరి బ్రాండ్ పేరు సిన్నోవె (synnove) అంటే Gift of Sun. తాను అభివృధ్ధిలోకి రావటమేగాక తనవారిని అభివృధ్ధి పథంలో నడపాలని తపనపడే శైలజ ఆశయం నెరవేరాలి.
చెత్తబుట్టలో పడేశామన్నారు
పరిశ్రమ స్ధాపించి ఇన్నేండ్లయినా సమస్యలు ఇప్పటికీ తప్పటం లేదు. ఎంతో శ్రమ పడి జెమ్‌లో (గవర్నమెంట్ ఇ మార్కెటింగ్ సంస్ధ)లో తమ ఉత్పత్తులు విక్రయించటానికి నమోదు చేసుకున్నారు. ఆర్డర్లు వస్తున్నాయి. కానీ పంపిన సరకు డబ్బు వెంటనే రాకపోవటం వల్ల పెట్టుబడి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. జెమ్ నుంచి డిఫెన్స్ వారి ఆర్డర్ రూ. 75,000కి వచ్చింది. చైనా బార్డర్ దగ్గర 4 గం.లు లోపలకి ప్రయాణం చెయ్యాలి. దానికి వేరే వాహనం వుండాలి. ఆ ఖర్చులు రూ. 4,000 మీరే పెట్టుకోవాలి అన్నారు. సైనికులకోసం పంపే ఆర్డరు కదా అని ఉత్సాహంగా ఆ ఖర్చు కూడా పెట్టుకుని పంపారు. తర్వాత ఒక మహిళ ఫోన్ చేసి మీ సరుకులు బ్రాండెడ్ కాదు. మేము చెత్తబుట్టలో పడేశాము. మీ బిల్ పే చెయ్యలేమని చెప్పారు. బిడ్డింగ్‌లో వచ్చిన ఆర్డర్, సైనికుల కోసమని ఎంతో శ్రమపడి పంపినది అలా అయ్యేసరికి నీరుగారిపోయారు.
- పి.యస్.యమ్.లక్ష్మి,
9866001629