Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలలో దసరా, సంక్రాంతి పండుగలకు బొమ్మల కొలువులు పెట్టి పేరంటాలు చేసేవారు. ఈ నాటికీ కొంతమంది వాటిని పాటిస్తున్నప్పటికీ ఈ స్పీడు యుగంలో ఎన్నో కనుమరుగై పోయాయి. చిన్నతనంలో చెక్క బొమ్మలకు పెళ్ళిళ్ళు చేయటం వంటి ఆటలు ఆడుకొని ఆడపిల్లలు ఒక తరం వారు ఉండరు. గ్రామ గ్రామానా జరిగే తిరునాళ్ళలో ఎన్నో కొయ్య బొమ్మలు దొరికేవి. తలమీద తడితే తల ఊపే ఆడవాళ్ళ బొమ్మలు దాదాపు అందరిళ్ళలో ఉండేవి. లక్కపిడతలు చెక్కతో చేసినవే ఉండేవి. ఆడపిల్లలు ఎక్కువగా బొమ్మల పెళ్ళిళ్ళు వంట సామాగ్రితోనే ఆటలు ఆడుకునేవారు. రోలు, రోకలి, తిరగలి గిన్నెలు, గరిటలు, బకెట్లు, చెంబులు వంటివన్నీ చెక్కతో చేసినవే మా ఇంట్లో ఉన్నాయి. ఈనాటి పిల్లలకివి అందడం లేదు. విష రసాయనాలతో తయారయ్యే ఈ నాటి చైనా బొమ్మలు పిల్లలకు హాని చేస్తున్నాయి. పాత తరపు కొయ్య బొమ్మలే పిల్లలకు హాని చేయని చక్కని బొమ్మలు.
కొండపల్లి కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి. నిర్మల్‌లో సైతం పెయింటింగులతో పాటు కొయ్యబొమ్మల్ని చేస్తారు. ఈ కొయ్య బొమ్మలకు నాలుగు వందల ఏళ్ళ చరిత్ర ఉన్నది. రాజస్థాన్ నుంచి పదహారో శతాబ్దంలో వలస వచ్చిన ఆర్య క్షత్రియులనే కళాకారులు ఈ బొమ్మలను తయారు చేస్తూ జీవనం గడుపుకున్నారు. అన్నీ చేతివత్తులకు వచ్చిన ఇబ్బందులే ఈ బొమ్మల కళాకారులకూ వచ్చి పనులు దొరకడం లేదు. కత్రిమమైన ప్లాస్టిక్ బొమ్మలు మార్కెట్లోకి రావడంతో కొయ్యబొమ్మలకు ఆదరణ లేదు. అందువల్ల మనమే ఇళ్ళను అలంకరించుకోవడానికి కొయ్య బొమ్మల్ని వాడదాం. దీనికి కొద్దిగా కార్పెంటర్స్ సహాయం అవసరం. ఇంట్లో ఉన్న పనికి రాని చెక్కల నుంచి ఒక పులి బొమ్మను ముందుగా చెక్కమీద పులి ఆకారంలో పెన్సిల్ తో గీయాలి. ఈ గీసిన ఆకారంలో కత్తిరించడానికి కార్పెంటర్ సహాయం కావాలి. తర్వాత చెక్కమీద రంగులు వేసుకోవాలి. పిల్లలకు హాని చేయని రంగుల్ని వాడుకోవాలి. పిల్లలు నోట్లో పెట్టుకున్నా ఇబ్బంది ఉండదు. పులి కన్నును చక్కగా కనిపించేలా వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఏనుగు సింహం, ఒంటె వంటి జంతువులను తయారు చేసుకోవచ్చు.
బొమ్మలకు ఉయ్యాలలు, డైనింగ్ టేబుళ్ళు, మంచాలు, డ్రెస్సింగ్ టేబుళ్ళు తయారు చేయబడుతున్నాయి. మనమీరోజు మంచం తయారు చేద్దామా! మంచమంటే డబుల్ కాట్ బెడ్ లాంటిది చేద్దాం. నవారు మంచం లాంటివి కూడా చేయవచ్చు కానీ మొదట కట్టెతో చేద్దాం. దీనికి గాను దీర్ఘ చతురస్రాకారంలో ఒక పలుచని చెక్కముక్కను తీసుకోవాలి. కాళ్ళు పెట్టటానికి నాలుగు చెక్క ముక్కల్ని తీసుకోవాలి. కరెంటు పని చేసేవాళ్ళ దగ్గర స్క్రూలు వేసేటప్పుడు గోడ లోపలకు కొట్టడానికి వేలెడంత చెక్కముక్కలు ఒకే ఆకారంలో ఉంటాయి. నేను వాటిని సేకరించి మంచానికి కాళ్ళుగా వాడుకున్నాను. ఇంట్లో ఏదో రిపేర్లు ఇరుగుతున్నపుడు చెక్క ముక్కలు వస్తాయి.MDF కంపెనీ వారు మోడల్‌గా చూపించడానికి దీర్ఘచతురస్రాకార ముక్కల్ని ఇచ్చారు. నేను ఆ చెక్కను మంచానికి వేసే చెక్కగా వాడుకున్నాను. తల వైపు పెట్టే హెడ్ బోర్డు కోసం అట్ట ముక్కను పెట్టాను. ఒక అట్టముక్కను డిజైన్‌గా కత్తిరించి మంచం తల వైపు అమర్చాను. దీనికి వార్నిష్ రంగును పూస్తే అందంగా తయారయింది. చెట్టు ఎండు పుల్లలతో నులక మంచం కూడా చేసుకోవచ్చు.
మా ఇంట్లో మొన్ననే వేపచెట్టును కొట్టేసినపుడు దాని కాండం పలకలను కోయించి దాచి పెట్టుకున్నాను. పలుచని చెక్కలుగా కోయించి వాటితో బొమ్మలు చేస్తున్నాను. అలాగే పాత ఇళ్ళకు మొగురాలు అని ఉంటాయి. ఇంకా కొన్ని ఇళ్ళకు డిజైనులో ఉన్న చెక్కలు ఉంటాయి. పాత ఇళ్ళను కూల్చేసినపుడు ఇలాంటి వాటిని దాచుకుని ఏదైనా బొమ్మలో ఉపయోగించుకుంటే జ్ఞాపకంగా ఉంటాయి. చెక్క మొద్దు పలకలను కేవలం వార్నీష్ వేసి టీపారు మీద అలంకరించుకోవచ్చు. దేవాలయాలలో నంది, సింహం, ఎలుక వంటి వాహనాలను చెక్కతోనే చేస్తారు. ఈ మధ్య కాలంలో శిల్పారామంలో గమనిస్తే ఎన్నో చెక్క ఆట వస్తువులు, కొయ్య బొమ్మలు కనిపిస్తున్నాయి. ఆవకాయల వంటి పచ్చళ్ళలో పూర్వకాలం చెక్క స్పూన్లనే వాడేవారు. ఇప్పుడు కొన్ని డిజైనర్ పీస్‌లు కూడా దొరుకుతున్నాయి.
బొమ్మల కళాకారులు తెల్ల పొణికి అనే చెట్టు కాండాన్ని బొమ్మల తయారీలో వాడతారు. వారు దశావతారులు, రామాయణ ఘట్టాలు, మహా భారత దశ్యాలు, భగవద్గీతను బోధించే దశ్యం లాంటి ఎన్నో అందమైన బొమ్మలను సంఘటనల ఆధారంగా రూపొందిస్తారు . ఇలాంటి బొమ్మలనే మహిళలు తమ బొమ్మల కొలువుల్లో పెట్టుకుంటారు. ఒక్కో లైనులో ఒక్కో ఘట్టానికి సంబంధించిన బొమ్మయి పెడతారు. చిన్నతనంలో మా అమ్మ దసరా పండుగకు పెట్టేది. ఇప్పుడు నేను పెడుతున్నాను కానీ హాస్పిటల్ వేస్ట్‌తో తయారైన బొమ్మలు పెడతాను. బస్సులు రారీలు లాంటి మోడ్రన్ రవాణా వాహనాలు చేసుకోవచ్చు. జెసిబిని చేద్దాం. తలుపులు కిటికీలు చేసేటప్పుడు మిగిలిన చిన్న చిన్న చెక్కముక్కలతో ఈ జెసిబిని రూపొందించాను చూడండి ఎలా ఉన్నదో.
చక్రాలతో నడిచే కుందేలను చేద్దామా! దీని కోసం కాస్త కార్పెంటర్ సహాయం తీసుకోవాల్సి వస్తుంది. చెద పురుగులు తినేయడంతో గత నెలలో మా ఇంటి ప్రధాన ద్వారం మరల చేయించుకోవాల్సి వచ్చింది. అప్పుడు మిగిలిన ముక్కల్ని ఇలా కుందేలుగా ముర్చాలనుకున్నాను. అందుకే కార్పెంటర్‌కు నా ఐడియా వివరిస్తే కొద్దిగా ఆకారంలో కత్తిరించి ఇచ్చాడు. నేను వార్నిష్ వేశాను. శాండ్ పేపర్‌తో రుద్దటం, వార్నిష్ వేయటం చిన్న ముక్కల్ని రంపంతో కోయటం లాంటి పనులన్నీ కార్పెంటర్ని పక్కనుంచుకుని చేశాను. చిన్నప్పుడు మా రైస్ మిల్ కట్టేటపుడు మిగిలిన ముక్కలతో మా అన్నయ్య పెద్ద ఓడను తయారు చేశాడు. అది మా రైస్ మిల్లు అద్దాల షెల్పులో ఉండేది. ఆ ఓడ మీద వరసగా విమానాలను పెట్టాడు. నాకప్పటికి విమానాలను మోసేంత పెద్దది ఓడ అని తెలియదు. కొయ్య బొమ్మలు చేసుకుందాం ఆ కళాకారులను ఆదరిద్దాం.
- డా|| కందేపి రాణీప్రసాద్