Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పండుగల్లో మన తెలుగువారికి అతిముఖ్యమైన పండుగ ఉగాది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. మామిడితోరణాలూ, పచ్చిమామిడి కాయలూ, పిండివంటలతో అన్ని లోగిళ్లూ ఘుమఘుమలాడిపోతాయి. ముఖ్యంగా ఉగాది పచ్చడి కచ్చితంగా చేసుకుంటారు. ఎందుకంటే జీవితంలో కష్టాసుఖాలు కూడా ఉగాది పచ్చడి అంత సురిచికరంగా సౌకర్యవంతంగా మారి మన జీవన మనుగడకు దోహదం చేస్తాయని ఒక నమ్మిక. అయితే ఈ కాలంలో దొరికే వస్తువులతో ఉగాది పచ్చడి చేసుకుని సేవిస్తే కొన్ని రకాల వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని సైన్స్ చెబుతుంది. అయితే దీంతో పాటు బొబ్బట్లు, పూర్ణాలు, మామిడికాయ చిత్రాన్నం, కొబ్బరి లడ్డూలు వంటి ప్రత్యేమైన వంటకాలు ఉగాది రోజే చేస్తారు. ఈ శోభకృత్ ఉగాదికి కొన్ని వంటలు మీకోసం...
ఉగాది పచ్చడి
కావల్సిన పదార్థాలు : వేపపువ్వు రేకులు - స్పూను, చెరుకు ముక్క - చిన్నది, కొబ్బరి ముక్క - చిన్నది, అరటిపళ్ళు - ఆరు, చింతపండు - నిమ్మకాయంత, మామిడికాయ - చిన్నది, బెల్లం - వంద గ్రాములు, పచ్చిమిర్చి - ఒకటి, ఉప్పు - చిటికెడు, ఏలకులు - రెండు, నీళ్లు - రెండు గ్లాసులు.
తయారు చేసే విధానం : ముందుగా చెరకు, కొబ్బరి, బెల్లం, పచ్చిమిర్చి, మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని విడివిడిగా పెట్టాలి. వేప పువ్వును శుభ్రపరిచి రేకల్ని మాత్రం పక్కన ఉంచుకోవాలి. ఏలకులు మెత్తగా చేసి పెట్టుకోవాలి. రెండు గ్లాసుల నీళ్ళల్లో చింతపండు బాగా పిసికి ఆ నీళ్ళను ఒక గిన్నెలోకి వడగట్టాలి. అందులో బెల్లం వేసి బాగా కలియబెట్టాలి. ఆ తర్వాత అరటిపళ్ళను బాగా ముద్ద చేసి ఆ నీళ్ళలో కలపాలి. ఎక్కడా అరటిపండు ముక్కలు ఉండకూడదు. అందులో చిటికెడు ఉప్పు, ఏలకల పొడి, చెరకు, కొబ్బరి, పచ్చి మిర్చి, మామిడి కాయ ముక్కల్ని వేసి బాగా కలపాలి. అంతే ఉగాది పచ్చడి రెడీ.
కొబ్బరి లడ్డూలు
కావాల్సిన పదార్థాలు : మిల్క్ మెయిడ్ లేదా కండెన్స్డ్ పాలు - కప్పు, కొబ్బరి తురుము - రెండు కప్పులు, సన్నగా తరిగిన డ్రైఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, కిస్ మిస్) - మూడు చెంచాలు, ఇలాచి పొడి - చెంచా.
తయారు చేసే విధానం : ముందుగా నాన్ స్టిక్ పాన్‌లో కొబ్బరి కోరుని రెండు నిమిషాలు పాటు వేయించుకోవాలి. ఇందులోనే కండెన్స్డ్ పాలు, డ్రైఫ్రూట్స్, ఇలాచి పొడి వేసి బాగా కలిపి దగ్గరకు రానివ్వాలి. ఒక పళ్లెంలోకి తీసుకుని చల్లారిన తర్వాత లడ్డుల్లాగా చుట్టుకోవాలి.
పూర్ణం బూరెలు
కావలసిన పదార్థాలు : శనగపప్పు - పావు కిలో, బెల్లం - 200 గ్రా, యాలకుల పొడి - చిటికెడు, నెయ్యి - నాలుగు స్పూన్లు.
పూతపిండికి : మినపప్పు - గ్లాసు, బియ్యంపిండి - రెండు గ్లాసులు, ఉప్పు- చిటికెడు, నూనె - వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం : మినపప్పు రెండు గంటలు పాటు నానబెట్టుకుని మెత్తగా రుబ్బుకుని తడిపిన బియ్యం పిండిలో వేసి తగినంత ఉప్పు కలిపి ఒక గంట నాననివ్వాలి. శనగపప్పు కుక్కర్లో పప్పులా ఉడికించుకోవాలి. నీరు లేకుండా వడకట్టాలి.అందులో బెల్లం తరిగి కలపాలి. అదే పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి పై మిశ్రమం వేసి వేయించి ఉడికించాలి. నీరు ఇగిరిన తర్వాత మిశ్రమం ఓ గిన్నెలో వేసి చల్లార్చాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను రెడీగా ఉన్న పిండిలో ముంచి కాగిన నూనెలో వేసి దోరగా బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి.
మామిడికాయ చిత్రాన్నం
కావల్సిన పదార్థాలు : అన్నం - కప్పు, తురుమిన మామిడకాయ -ఒకటి, పచ్చిమిర్చి - 10, పసుపు - చిటికెడు, పల్లీలు - అర కప్పు, కొత్తిమిర - కట్ట, తురిమిన కొబ్బరి - కప్పు, ఎండబెట్టిన మెంతి ఆకు - టీస్పూను, ఉప్పు తగినంత
తయారు చేసే విధానం : ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో పచ్చి మిర్చి, ఇంగువ, పసుపు వేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మరో బాణాలిలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినపప్పు, పల్లీలు వేసి 2 నుండి 3 నిమిషాలు వేయించాలి. ఇందులో మిక్సీ జార్లో వేసుకున్న పేస్ట్ వేసి, ఆపై కొద్దిగా కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించండి. ఇప్పుడు తరిగిన కొత్తిమీర, మేథి పౌడర్ వేసి, అందులో ఉడికించిన అన్నం, తురిమిన పచ్చి మామిడి తురుమును వేసి బాగా కలపండి. మామిడికాయ పుల్లగా ఉంటే అందులో టీస్పూన్ చక్కెరను కూడా కల పొచ్చు. ఇందులో తురిమిన కొబ్బరి, ఉప్పు వేసి అన్ని పదార్థాలను బాగా వేయించాలి.
బొబ్బట్లు
కావలసిన పదార్ధాలు : మైదా - అరకిలో, శనగపప్పు - పావుకిలో, బెల్లం - పావు కిలో, యాలకుల పొడి - చిటికెడు, నెయ్యి - సరిపడా.
తయారు చేసే విధానం : మైదాపిండి జల్లించి పెట్టుకోవాలి. ఆ పిండిలో సరిపడా నీరుపోసి ముద్దగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో శనగపప్పును వేసి మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత మిగిలిన నీటిని పూర్తిగా వంపేయాలి. ఈ పప్పులో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని చిన్నచిన్న ఉండలుగా తీసుకోని రెడిచేసి పెట్టుకున్న శనగపప్పు ముద్దని మధ్యలోపెట్టి మళ్లీ ఉండలుగా చేసి కాస్త మందంగా చపాతిలా చేసి, పెనం మీద నెయ్యి వేసి కాల్చాలి.