Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మద్యం సేవించడం ఈ రోజుల్లో సర్వసాధారణమైన అయిపోయింది. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా, ఎవరైనా చనిపోయినా, ఏది జరిగినా మద్యం తీసుకోవల్సిందే. ఇలా అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి మద్యం తీసుకునే వారు కొందరుంటే రోజూ అదే పనిగా తాగేవారు చాలా మంది ఉన్నారు. మొదట సరదా కోసం మొదలై, తర్వాత అదే అలవాటుగా మారిపోతుంది. వారికి తెలియకుండానే దానికి బానిసలై పోతున్నారు. దాని నుండి బయటపడటం అత్యంత కష్టమై పోతుంది. మరికొందరైతే మద్యం మత్తులో తమ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారి వల్ల వారిపై ఆధారపడిన వారి జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి. అలాంటిదే ఇప్పుడు మనం ఐద్వా అదాలత్ ద్వారా తెలుసుకోబోతున్న నిఖిత సమస్య.
ఇప్పుడు నిఖితకు 26 ఏండ్లు. ఇంత చిన్న వయసులోనే జీవితం మొత్తం చూసేసినట్టుగా మాట్లాడుతుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ గర్భవతి. పెండ్లికి ముందు నిఖిల్‌కు మద్యం సేవించే అలవాటు ఉంది. కానీ అది నిఖిత దగ్గర దాచి పెట్టారు. 'ఏదో అప్పుడప్పుడు సరదా కోసం స్నేహితులు బలవంత చేస్తే కొంచెం తీసుకుంటాడు' అని చెప్పారు. పెండ్లికి రెండు రోజుల ముందు నిఖిత కుటుంబ సభ్యులకు నిఖిల్ మద్యం తీసుకుంటాడని, ఉద్యోగం కూడా ఏమీ లేదని తెలిసింది. అదే విషయం కూతురికి చెప్పి పెండ్లి రద్దు చేయిద్దామన్నారు నిఖిత తల్లిదండ్రులు. కానీ దానికి ఆమె ఒప్పుకోలేదు.
''నేను నిఖిల్‌ని మార్చుకుంటాను. పెండ్లి రెండు రోజుల ముందు ఆపేస్తే కుటుంబం పరువు పోతుంది'' అని పెండ్లి చేసుకుంది. పెండ్లి అయిన నెల రోజులు ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా నిఖిత తన భర్తను మార్చుకుంది అనుకున్నారు. కానీ ఆ జంట సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. అతను మెల్లమెల్లగా తాగడం మొదలుపెట్టాడు. ''తాగడం మానేస్తాను అని నాకు మాట ఇచ్చావు కదా! మళ్ళీ ఇప్పుడు ఎందుకు తాగుతున్నావు'' అని అడిగింది.
''నా స్నేహితులు బలవంతం చేస్తే తాగాను, వాళ్ళు వద్దని ఎంత చెప్పినా వినలేదు. వాళ్ళతో నా స్నేహం కట్ చేస్తాను. వాళ్ళ వల్ల మనకు గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. నిజంగా నన్ను నమ్ము, నా కోసం మీ వాళ్ళందరినీ వదులుకొని వచ్చావు. నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. పెండ్లి రోజే నిన్ను బాగా చూసుకుంటానని మీ అమ్మానాన్నలకు మాట ఇచ్చాను'' అన్నాడు. అంత నమ్మకంగా చెప్పిన భర్త మాటలను నమ్మింది.
ఇలా తాగిన ప్రతి సారి ఏదో ఒకటి చెప్పడం, అది విని నిఖిత నమ్మడం. ఇది వారి రోజు వారి దినచర్యగా మారిపోయింది. పాప పుట్టింది. బాధ్యత పెరగడంతో ఇప్పుడైనా భర్త మారతాడనుకుంది. కానీ అప్పటి నుండి 'ఎందుకు తాగుతున్నావు' అని అడిగితే కొట్టడం మొదలు పెట్టాడు. ఇంట్లో భార్యా, భర్త, పాప మాత్రమే ఉండే వారు. ఇలా ప్రతి చిన్న విషయానికి కొట్టడం, దాంతో నిఖిత అలిగి పుట్టింటికి వెళ్ళడం. కొన్ని రోజులు చూసిన ఇరు కుటుంబాల పెద్దలు కూర్చొని మాట్లాడుకున్నారు. కొన్ని రోజులు వాళ్ళు నిఖిత అత్తగారింట్లో ఉంటే మంచిదని నిర్ణయించారు. అక్కడే ఏదైనా పని చేసుకొని బతకమన్నారు. అలాగే బిడ్డతో పాటు ఆ జంట ఊరికి వెళ్ళింది.
అక్కడకు వెళ్ళినా నిఖిల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. ఈలోగా రెండో పాప పుట్టింది. నిఖిల్‌ని ఉద్యోగం నుండి తీసేశారు. తాగొచ్చి ఉద్యోగం చేస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు. అయినా ఎంత చెప్పినా వినేవాడు కాదు. దాంతో ఇద్దరు పిల్లల్ని తీసుకుని నిఖిత హైదరాబాద్‌లోని తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది.
ఆమె వచ్చిన ఆరు నెలలకు నిఖిల్ వచ్చి ''నువ్వు నన్ను వదిలేసి వచ్చావు. నీవు లేకుండా నేను వుండలేను. ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. అస్సలు తాగడం లేదు. నువ్వు నాతో ఉంటే చాలు ఇంక నాకు ఏమీ వద్దు. నీవు లేకపోతే నేను తాగి తాగి పిచ్చివాడిని అవుతాను. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వు'' అంటూ వేడుకున్నాడు.
నిఖిత కూడా సరే అని ఒప్పుకుని వెళ్ళింది. కొన్ని రోజులు బాగానే ఉన్నారు. మళ్ళీ ఏమైందో తెలియదు తాగడం మొదలుపెట్టాడు. ఈసారి ఇద్దరి తల్లిదండ్రులు వాళ్ళని పట్టించుకోలేదు. ''మేము చెప్తే వినకుండా అతని మాటలు నమ్ముతున్నావు'' అని అందరూ నిఖితనే తిట్టడం మొదలు పెట్టారు. దాంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. తెలిసిన బంధువుల సహ కారంతో తన సమస్య పరిష్కరించు కునేందుకు ఐద్వా అదాలత్‌కు వచ్చింది.
లీగల్‌సెల్ సభ్యులు నిఖిల్‌ని పిలిపించారు. అతను లోపలికి వస్తుంటే విపరీతమైన మందు వాసన. దాంతో సభ్యులు అతన్ని రేపు ఉదయం తాగకుండా రమ్మని చెప్పి పంపించేశారు. లీగల్‌సెల్ వాళ్ళు చెప్పిన ప్రకారం నిఖిల్ తర్వాత రోజు తాగకుండా వచ్చాడు. ''ఎందుకు నువ్వు ఇలా తాగుతున్నావు? దీని వల్ల నీతో పాటు నీ భార్య పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇది నీ జీవితానికి మంచిది కాదు. వెంటనే నువ్వు తాగుడు మానుకోకపోతే నీకే కష్టం. ఇక నీ భార్య నీతో రాలేనంటుంది. నీ తల్లిదండ్రులు నిన్ను వదిలేశారు. నీ భార్య కూడా వదిలేస్తే ఇక ఎవ్వరూ నిన్ను పట్టించుకోరు. నువ్వు రోడ్డుపైన బతకాల్సి వస్తుంది'' అంతే..
''నాకు ఆరోగ్యం బాగోలేదు మేడం, కడుపులో నొప్పిగా ఉంటుంది. అందుకే మందు తాగుతున్నాను. ఇది తాగితే తగ్గిపోతుంది. తాగకపోతే మళ్ళీ కడుపులో నొప్పి వస్తుంది. అందుకే పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు తాగుతాను'' అని చెప్పాడు.
దానికి లీగల్‌సెల్ సభ్యులు... ''ముందు నువ్వు ఆస్పత్రికి వెళ్ళు. కడుపులో నొప్పి వస్తే తాగాల్సింది ఈ మందు కాదు. దానికి మందులు డాక్టర్లు ఇస్తారు. అంతే గానీ నీవు మద్యం తీసుకుంటే నీ సమస్య ఇంకా ఎక్కువవుతుంది కాని తగ్గదు'' అని చెప్పారు.
దాంతో నిఖిత భర్తను తీసుకుని ఆస్పత్రికి వెళ్ళింది. అక్కడ అన్ని రకాల పరీక్షలు చేసి మద్యం తాగడం మానుకోకపోతే చాలా కష్టమని చెప్పారు. నిఖిత వెంటనే భర్తను రీహాబిటేషన్ సెంటర్లో చేర్పించింది. ఆ సెంటర్లోనే అతను ఆరు నెలలు ఉన్నాడు. అక్కడి నుండి వచ్చిన తర్వాత నిఖిల్ మందు తాగడం పూర్తిగా మానేశాడు. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసుకుంటున్నారు. ముగ్గురు పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ చూసుకుంటుంది.
మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది ఒక్కసారి మన జీవితంలోకి వచ్చిందంటే ఇక అంతే. ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన కూడా మన మెదడుకు ఎక్కదు. సమాజం, కుటుంబం తాగుబోతులను ఎంతగా ద్వేషిస్తుందో నిత్యం చూస్తూనే ఉంటాము. చూస్తూ చూస్తూ అలాంటి ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళకపోవడం అందరి జీవితాలకు మంచిది.
- వరలక్ష్మి, 9948794051