Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్
నవతెలంగాణ-బీబీనగర్
ప్రజా సమస్యలపై ప్రజా యుద్ధం చేయడమే పాదయాత్ర లక్ష్యమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి , పాదయాత్ర రథరాధి ఎమ్‌డి.జహంగీర్ అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా సమగ్రాభివృద్ధి కోసం , ప్రజా సమస్యల పరిష్కారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనచైతన్య పాదయాత్ర పదో రోజు గురువారం బీబీనగర్ మండలకేంద్రానికి చేరుకుంది. పాదయాత్రకు స్థానిక మహిళలు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో శేషగిరిరావు కళావేదిక వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభ వద్ద పాదయాత్ర బందానికి మండల నాయకులు పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం సభనుద్దేశించి జహంగీర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాగుతున్న పాదయాత్రకు గ్రామగ్రామాన సమస్యలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ప్రభుత్వాల చేతగానితనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. జిల్లా ప్రజలకు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలం చెందిందన్నారు. విద్య, వైద్యం, సాగు, తాగునీరు అందించి కాలుష్యాన్ని నివారించి యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం చిత్తశుద్దిగా వ్యవహరించడం లేదన్నారు. మండలకేంద్రంలోని రంగాపురం పరిధిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటుచేసిన ఎయిమ్స్ లో నేటి వరకు పూర్తిస్థాయిలో వైద్య సదుపాయాలు అందించకపోవడం ప్రభుత్వాల చేతగానితనమేనన్నారు. ఆరు నెలల్లో ఎయిమ్స్ లో ఇన్ పేషెంట్ విభాగాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేశారు. ఈ మేరకు ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించి ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ అనంతరావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కల్యాణికి మెమోరాండం అందజేసినట్టు తెలిపారు. ఆరు నెలల్లో 750 పడకలతో ఇన్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించకపోతే స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పార్టీ ఆధ్వర్యంలో ఎయిమ్స్ ఆవరణలో ఆందోళన కార్యక్రమాలు చేపడ్తామని హెచ్చరించారు. ఎయిమ్స్ ను పూర్తిస్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్ది అన్ని రకాల వైద్యసేవలు అందించాలని ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టు తెలిపారు. ఏప్రిల్ 22న జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగసభకు మండలంలోని ప్రజలు పార్టీలకతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. స్థానిక పరిశ్రమల్లో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుచేయడంలో ఒక్కటీ నిలబెట్టుకోలేదన్నారు. కొత్త రేషన్ కార్డులు, 57 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ల మంజూరు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వంటి హామీల అమలులో విఫలమైందన్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రతి గ్రామం నుండి ఈ సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు అందజేస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను జనాల్లోకి తీసుకువెళ్లి ప్రజలను చైతన్యం చేయడమే పాదయాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. బీబీనగర్ మండలం మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ ప్రక్షాళన చేయని యెడల జిల్లా కలెక్టరేట్ వద్ద 48 గంటల నిరహార దీక్ష త్వరలో చేపట్టనున్నట్టు తెలిపారు. పాదయాత్రలో తమ దష్టికి వచ్చిన సమస్యలు అధికారులు, ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్తామన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో ఉద్యమాలు ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర బందం సభ్యులు కొండమడుగు నర్సింహా, బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, ధీరావత్ రమేశ్‌నాయక్, మండల నాయకులు గాడి శ్రీనివాస్, బండారు శ్రీరాములు, ఎరుకలి బిక్షపతి, రేసు రామచంద్రారెడ్డి, టంటం వెంకటేశం, కందాడి దేవేందర్‌రెడ్డి, ఎస్డి.ఉమర్, పొట్ట యాదమ్మ, సిలివేరు రమేశ్, ఎల్లాంల సత్యనారాయణ, బండారు యాదగిరి, ఓవల్దాసు శ్రీనివాస్ పాల్గొన్నారు.
రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలి : కల్లూరి మల్లేశం
గొల్ల కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీచేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. బీబీనగర్ పట్టణకేంద్రంలో పాదయాత్ర బందానికి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. బందం సభ్యులకు గొంగడి కప్పి, గొర్రె పిల్లను బహూకరించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ గొర్రెల పంపిణీ కోసం గొల్ల కురుమ కులస్తులు ప్రభుత్వానికి డీడీలు కట్టి నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదన్నారు. గొర్రెలు పంపిణీచేయకపోతే గొర్రెలతో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామన్నారు.
స్థానిక పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి : కోమటిరెడ్డి చంద్రారెడ్డి
మండలవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఐటీయు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి డిమాండ్‌చేశారు. పట్టణకేంద్రంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు ఇన్సూరెన్స్ చేసి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేయాలన్నారు. కంపెనీ కార్మికులకు కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ చెల్లించాలన్నారు. మండలకేంద్రానికి ఆనుకుని ఉన్న జాతీయ రహదారిపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలన్నారు. స్థానిక బస్టాప్‌లో అన్ని డిపోల బస్సులు ఆపాలని డిమాండ్‌చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుచేసి, సంక్షేమ వసతిగహాలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో స్థానికేతరులకు కాకుండా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.