Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.ఆదివారం మండలంలోని అవంతీపురం వ్యవసాయ మార్కెట్‌యార్డులో ధాన్యం రాసులను పరిశీలించి రైతులతో మాట్లాడారు.ధాన్యం తెచ్చి 15 రోజులైనా ఇప్పటివరకు తమ ధాన్యం కొనుగోలు చేయలేదని రైతులు ఆయన దష్టికి తెచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రోజుల తరబడి మార్కెట్లలో ధాన్యం పోసి వాటికి కాపలాగా ఉంటూ తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారన్నారు.కొనుగోలు కేంద్రాల్లేకపోవడంతో ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో తెలియక అవస్థలు పడుతున్నారన్నారు.వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని గ్రామాల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు రవాణా ఛార్జీల భారం తగ్గుతుందని, త్వరితగతిన అమ్మకాలు జరిగిన రైతులకు సులువుగా ఉంటుందన్నారు.అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వేసవి కావడంతో ఎండలు మండుతున్నాయని, కేంద్రాల వద్ద టెంట్, మంచినీటి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం విస్మరించి కేవలం ఎన్నికలపైనే దష్టి సారించిందని విమర్శించారు.ఒక్క అభ్యర్థి కోసం రాష్ట్రం మొత్తం సాగర్‌లో పాగా వేసిందని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా ఇక్కడే తిష్ట వేశారని, ఓటమి భయంతోనే సాగర్‌లో మకాం వేసి ప్రచారం చేస్తున్నారన్నారు. సాగర్ ఓటర్లు ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్ పాల్గొన్నారు.