Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గొర్రెల పథకంలో..బ్రోకర్స్ దందా
- సాగర్ నియోజకవర్గ కేంద్రంగా అక్కడికక్కడే గొర్రెల మార్పిడీ
- లబ్దిదారులకు డబ్బులు అందజేత
- ఒక్క యూనిట్‌పై బ్రోకర్ల సంపాదన రూ.55 వేలు
గొర్రెలు, మేకల పెంపకందారులను ఆర్ధికంగా చేయూతనందించేందు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశ పెట్టింది. అందులో భాగంగానే రెండేండ్ల నుంచి ఉచితంగా గొర్రెల పంపిణీ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. అనివార్యకారణాల వల్ల ఈ మధ్య తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి మళ్లీ గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. జనవరి మాసంలో పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేతుల మీదుగా జిల్లాలో పంపిణీ చేశారు.
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయప్రతినిధి
జిల్లాలో మొదటి దఫా 30 వేల యూనిట్లు, రెండో దఫా 30వేల యూనిట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో యూనిట్‌కు 21 గొర్రెలకు రూ.1.25 లక్షలుగా ధర నిర్ణయించారు. ఈ మొత్తం సొమ్ములో లబ్దిదారుడు తన వాటాలో భాగంగా రూ.32,050 చెల్లిస్తారు. రూ.93వేలు రాయితీ కింద వర్తిస్తాయి. అయితే ఇప్పటి వరకూ 28,262 మంది వాటా సొమ్ము చెల్లించారు. వారిలో 26,159 మంది సభ్యులకు యూనిట్లు పంపిణీ చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా 2103 మందికి ఇవ్వాల్సి ఉండగా జనవరిలో 234 మంది లబ్దిదారులకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ప్రస్తుతం పెండింగ్‌లో 1869 మందికి సంబంధించిన డీడీలు పెండింగ్‌లో ఉన్నాయి.
ఓట్ల కోసమే ...
జిల్లాలో ఎక్కడ కూడా గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టలేదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మొదటి ప్రాధాన్యతగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గానికి గొర్రెలు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో 726 యూనిట్లకు సంబంధించిన డీడీలు పెండింగ్‌లో ఉన్నాయి. సాగర్‌లో 726, హాలియాలో 24, పెద్దవూరలో 131, నిడమనూర్‌లో 310, త్రిపురారంలో 135, తిరుమలగిరి సాగర్‌లో 116, గుర్రంపోడులో 10 మందికి ఉన్నాయి. అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నెల రోజులుగా పెండింగ్‌లో ఉన్న వాటిని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అవి కూడా సాగర్ నియోజకవర్గంలోనే చేస్తున్నారు.
ఎక్కడికక్కడే గొర్రెల మార్పిడీ...బ్రోకర్ల దందా...
ఉప ఎన్నికల కోసం నియోజకవర్గంలోని లబ్దిదారులకు గొర్రెల పంపిణీ చేస్తున్నారు. అవి కాగితాల వరకే జరుగుతుంది. వారం రోజుల క్రితం నియోజకవర్గంలోని బొప్పారం, తుమ్మడం, వడ్డెరిగూడెం తదితర గ్రామాల్లో అధికారులు గొర్రెలను పంపిణీ చేశారు. అయితే ఆంధ్రా నుంచి బ్రోకర్లు తీసుకొచ్చిన గొర్రెలను లబ్దిదారులకు అప్పగించినట్లు, వాటికి ట్యాగ్లు కూడా వేశారు. ఫొటోలు దిగారు.. కాగితాలపై లబ్దిదారులు, అధికారులు సంతకాలు చేశారు. అధికారికంగా గొర్రెల పంపిణీ ముగిసిన తర్వాత వాటిని తిరిగి బ్రోకర్లు స్వాధీనం చేసుకుని... లబ్దిదారులకు రూ.70వేలు ముట్టజెప్పి వెళ్లిపోయారని సమాచారం. అయితే రూ.1.25 లక్షలు యూనిట్ విలువ అయితే లబ్దిదారుడు డీడీ చెల్లించిన దానికి రెండింతలు సొమ్ము చెల్లించారని తెలిసింది. అంటే ఒక యూనిట్లో రూ.55 వేలు బ్రోకర్లు, అధికారులు కలిసి పంచుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. దాదాపు ఈ మధ్య కాలంలోనే 100 యూనిట్లకు పైగానే పంపిణీ జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ తతంగమంతా పూర్తిగా అధికారుల సమక్షంలోనే జరిగినట్టు తెలిసింది. తమ పని ముగించుకుంటే సరిపోతుందిలే అనే పద్ధతిలో అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికారులకు కూడా వాటా అందినట్టు పుకార్లు వస్తున్నాయి.
మా డబ్బులు మాకే ఇస్తున్నారు...( పేరు చెప్పడానికి ఇష్టపడిని లబ్దిదారుడు)
గొర్రెలు ఇస్తారని ఏడాది కంటే ముందే డీడీలు ఇచ్చినం.. మాకు గొర్రెలు ఇయ్యలే... ఇప్పుడిస్తామని పిలిచి డబ్బులు చేతుల పెడుతున్నరు.. ఇదేంటని అడిగితే గొర్రెలు దొరుకుతలేవు.. ఏం చేస్తం.. మీ సొమ్ముకు డబుల్ ఇస్తున్నంగా.. తీసుకొండి అని బ్రోకర్లు చెపుతున్నారు.. అధికారులు కూడా వారికే వంత పాడుతున్నారు.