Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చనిపోయిన వారికి ఎన్నికల విధులా ?
- శిక్షణకు హాజరుకాలేదని చర్యలకు సిద్ధమా..
మునుగోడు:ప్రభుత్వ అధికారుల పని తనానికి ఇంత మంచి ఉదాహరణ మరెక్కడా లేక పోవచ్చు. చనిపోయిన ఉపాధ్యాయునికి ఎన్నికల విధుల డ్యూటీ వేశారు.ఎన్నికల శిక్షణకు హాజరు కాలేదని ఏకంగా ఆయనపై చర్యలు తీసుకుంటామని నోటీసుబోర్డులో పేరు కూడా పెట్టేశారు.ఇది చూసిన జనం ఎదెక్కడి పాపంరా..నాయానా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు... వివరాల్లోకి వెళ్తే..మండలంలోని సింగారం గ్రామానికి చెందిన తాళ్లపెళ్లి రవి మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎంగా పని చేస్తూ ఈనెల 3వ తేదీన గుండెపోటుతో మృతి చెందారు.మృతదేహాన్ని మండల, జిల్లా స్థాయి అధికారులతో పాటు స్థానిక రాజకీయ నాయకులు కూడా వచ్చి సందర్శించి నివాళులర్పించారు. ఆయన చనిపోయినట్టు అన్ని పత్రికల్లోనూ వార్తలొచ్చాయి. నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో భాగంగా ప్రధానోపాధ్యాయులకు పోలింగ్ ఆఫీసర్లుగా డ్యూటీ వేశారు.ఇందులో తాళ్లపెల్లి రవి పేరు కూడా ఉంది. బుధవారం ఎన్నికల సిబ్బందికి జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి జూనియర్ కాలేజీలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణకు 21 మంది హాజరు కాలేదు. శిక్షణకు హాజరు కాని ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులు లిస్టు ప్రదర్శించారు. ఈ లిస్టులో చనిపోయిన రవి పేరు కూడా ఉంది. ఇది చూసిన మిగతా ఉపాధ్యాయులు, ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదేందీ..ఆ సారు చనిపోయిండు కదా...ఆయనకు డ్యూటీ వేయడం ఏంటీ.. హాజరుకాకపోతే చర్యలు తీసుకుంటామని నోటీసు బోర్డుపై పేరు ప్రకటించడం ఏంటీ అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఎన్నికల అధికారులది ఇంత నిర్లక్ష్యమా.! సారు చనిపోయిన విషయం విద్యాశాఖ అధికారులకు తెలియదా..? అని ప్రశ్నించారు.