Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని రైల్వే గేటు వద్ద నిలిచిన అండర్‌పాస్ పనులను వేగవంతం చేయాలని, రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోతున్న బాధితులకు వారు కోరిన విధంగా నష్టపరిహారం యుద్ధప్రాతిపదికన చెల్లించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్ సంబంధిత అధికారులను కోరారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన జన చైతన్య పాదయాత్ర మంగళవారం మున్సిపల్ కేంద్రంలో పర్యటించింది. ఈ సందర్భంగా పాదయాత్ర బృందం సభ్యులు అర్థాంతరంగా నిలిచిన అండర్ పాస్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ పట్టణానికి ఇరువైపులా ప్రజలు రోజు వారి పనుల కోసం ఆర్వోబీ చుట్టూ రెండు కిలోమీటర్ల మేర తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. పట్టణంలోని డ్రయినేజీ మురుగునీరు అండర్‌పాస్ లోనికి రావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డిలు స్పందించి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర బృందం సభ్యులు కొండమడుగు నర్సింహా, ధరావత్ రమేష్ నాయక్, సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు మంగ నర్సింహులు, పట్టణ కార్యదర్శి ఎంఏ ఎక్బాల్, నాయకులు వడ్డేమాన్ శ్రీనివాసులు, యేలుగల బాలయ్య, మంగ అరవింద్, భువనగిరి గణేష్, యేలుగల శివ, చెన్న రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు
జనచైతన్య పాదయాత్రలో భాగంగా బృందం సభ్యులు కొండమడుగు నర్సింహా, కల్లూరి మల్లేశం, మాటూరి బాలరాజు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింహులు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నక్కల యాదవరెడ్డి, బచ్చన్నపేట మండలం నారాయణపురం మాజీ ఎంపీటీసీ ఎమ్‌డి.మహబూబ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహయ కార్యదర్శి జూకంటి పౌల్, నాయకులు వడ్డేమాన్ శ్రీనివాసులు, మంగ అరవింద్, చిన్న రాజేష్, భువనగిరి గణేశ్, కె.మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.