Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ
నవతెలంగాణ- భువనగిరిరూరల్
వీర తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర కలిగిన భువనగిరి ప్రాంతం ఇంకా అభివృద్ధికి నోచుకోలేదని పాలకుల నిర్లక్ష్యం కారణంగా వెనుకబాటుతనంకు గురయ్యిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ అన్నారు. జిల్లా సమగ్రాభివద్ధి కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర 25వ రోజు భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం, బస్వాపూర్ గ్రామాలకు చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ భువనగిరి మండలంలో 35 గ్రామపంచాయతులు ఉన్న కేవలం ఒకే ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బోల్లేపల్లిలో మాత్రమే ఉండడంతో మండల ప్రజలకు సరైన వైద్యం అందడం లేదన్నారు. అనాజిపురం, హనుమాపురం, చందుపట్ల, బసవపురం గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా విషయంలో కూడా భువనగిరి జిల్లా వెనుకబడి ఉందన్నారు. జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ , ఇంజనీరింగ్ కళాశాల , మెడికల్ కళాశాల, టెక్నికల్ కోర్సులు సంబంధించిన కళాశాలలు లేవన్నారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్లడానికి సరైన లింక్ రోడ్లు లేవన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వాస్పత్రిలో 50మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా కేవలం పది మంది డాక్టర్లు ఉండడంతో ఏ చిన్న గాయం తగిలిన గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళమని సలహా ఇస్తున్నారంటే ప్రభుత్వం ప్రజలకు ఏ మేరకు వైద్య సేవలు అందిస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. డబుల్ బెడ్ రూమ్ఇండ్ల్లు ఇస్తామని చెప్పి ఏ ఒక్కరు కూడా ఇవ్వలేదన్నారు, పింఛన్ 57ఏండ్లకు ఇస్తానని చెప్పి మంజూరుచేయలేదన్నారు. రేషన్ కార్డులో నూతన సభ్యులను చేర్చుకోవడం లేదన్నారు. భువనగిరి జిల్లాలో బీబీనగర్, పోచంపల్లి, భువనగిరి, బొమ్మలరామారం మండలాలను హెచ్ఎండీఏ పరిధిలో నుంచి తొలగించి నిరుపేద దళితులు అందరికీ మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బస్వాపురం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారందరికీ పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ముత్తిరెడ్డిగూడెంలో పాదయాత్ర బందానికి సీపీఐ(ఎం) నాయకులు ఘనస్వాగతం పలికారు, అదేవిధంగా స్థానిక సర్పంచ్ మాకోళ్ల సత్యం, ఉప సర్పంచ్ కొండ వాణి నందు, వార్డు సభ్యులు పాల్గొని మద్దతు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి దయాల్ నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, అనగంటి వెంకటేష్. బొడ్డుపల్లి వెంకటేష్. మండల కమిటీ సభ్యులు. కొండమడుగు నాగమణి,పల్లెర్ల అంజయ్య,కొండ అశోక్ రాసాల వెంకటేశం. మాజీ సర్పంచ్ రాసాల నిర్మల. బస్వాపురం శాఖ కార్యదర్శి అన్నంపట్ల కష్ణ, సీపీఐ శాఖ కార్యదర్శి ఉడుత రాఘవులు, శాఖ సహాయ కార్యదర్శి వెంకటేష్. నాయకులు ఉడుత సత్యనారాయణ,ఉడుత విష్ణు, నరాల బాల్ నరసింహ, మచ్చ జహంగీర్, చంద్రమౌళి, హైమవతి, చొక్కా కుమారి, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు