Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల పడి గాపులు...!
- కేంద్రాల్లో కుప్పలు, తెప్పలుగా ధాన్యపు రాసులు
- ఉరుములు, మెరుపులతో భయాందోళలో రైతులు
- వెంటాడుతున్న గొనె సంచులు, లారీల కొరత
నవతెలంగాణ-పెద్దవూర
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకు నేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నాడు. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 15 రోజులు అవుతున్నా నేటి వరకూ అధికారులు కొనుగోలు చేయడం లేదు. అసలే అకాల వర్షాలు కురుస్తున్న వేళ దీనికి తోడు తుపాను ప్రభావం ఉండడంతో రైతులు నిత్యం భయం భయంతో కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్న పరిస్థితి ఉంది.
మండలంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు 15 కేంద్రాలను ఏర్పాటు చేశారు. చలకుర్తి, పెద్దవూర, నాయినవాని కుంట, పర్వేదుల పులిచర్ల, వెల్మగూడెం తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి. గోనె సంచుల కొరతతో పాటు లారీల సమస్య తీవ్రంగా ఉండడంతో కొనుగోళ్లలో ఆలస్యం అవుతుందని పలువురు చెబుతుండగా అధికారుల నిర్లక్ష్యం ఉందని మరి కొందరు రైతులు చెబుతున్నారు.
వర్షానికి తడుస్తున్న ధాన్యం
ధాన్యం కొనుగోళ్లు సరిగా చేయక పోవడంతో వర్షానికి మొత్తం తడిసి పోతున్నాయి. ఇటీవలే కురిసిన వర్షానికి కాంట పెట్టిన ధాన్యం పోగా ధాన్యం మొత్తం తడిసి పోయింది. దీంతో పాటు రెండు రోజులుగా మబ్బులు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షం వస్తే కష్టపడి పండించిన ధాన్యం మొత్తం తడిచి పోయి తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోన్న నిర్వాహకులు
చలకుర్తి ఐకేపీ కేంద్రంలో అధికారులకు అనుకూలం ఉన్న వారి ధాన్యాన్ని మాత్రమే మ్యాచర్ తీస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇంకా మండలంలో వేలాది బస్తాల ధాన్యం రాసులుగా పోసి ఉంది. 15 రోజుల క్రితం పోసిన ధాన్యాన్ని కొనుగోలు చేయక పోగా కొత్తగా ధాన్యం వచ్చి చేరుతుండడంతో కేంద్రంలో కుప్పలుకుప్పలుగా రాశులు కనిపిస్తున్నాయి.
మబ్బులు పడుతుంటే
గుండె గుబేలు మంటోంది
తుమ్మలపల్లి రవీందర్రెడ్డి - చలకుర్తి
మబ్బులు పడుతున్నాయి.చిన్న చిన్న జల్లులు కూడా పడుతున్నాయి. 15 రోజులుగా ధాన్యం కొనడం లేదు.వాళ్లకు అనుకూలం ఉన్న వారికి మాత్రమే మ్యాచర్ తీసి కొనుగోలు చేస్తున్నారు. వర్షం వస్తే 200 బస్తాలు తడిసి పోవాల్సిందే.
గొనె సంచులు, లారీల కొరత
తీవ్రంగా ఉంది
నాసర్రెడ్డి - రామన్నగూడెం
వారం, పది రోజులైనా ధాన్యం కొనడం లేదు. ఐకేపీ వాళ్లను అడిగితే లాక్డౌన్తో లారీలు రావడం లేదంటున్నారు. వచ్చేంత వరకూ ఆగాలని చెబుతున్నారు. వర్షం వస్తే ధాన్యం మొత్తం తడిచి పోతుంది.