Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా సమస్యలు పరిష్కరించేదెవరు
- మమ్ములను అడ్డగూడూర్ మండల సభలో కలపండి : సర్పంచులు, ఎంపీటీసీల ఆవేదన
- విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
నవతెలంగాణ-మోత్కూర్
గ్రామాల్లో అభివద్ధి పనులు, ప్రజా సమస్యలపై చర్చించే మండల సభకు ఎమ్మెల్యే రావాలని కోరుతున్నా రావడం లేదని, కనీసం అధికారులు కూడా రాకపోతే మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని సర్పంచులు, ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ దీటి సంధ్యారాణిసందీప్ అధ్యక్షతన నిర్వహించారు. పల్లె ప్రగతిలో గ్రామాల్లో చేపట్టిన శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకతి వనాలు తదితర అభివద్ధి పనులు చేయాలని ప్రభుత్వం, అధికారులు తీవ్ర ఒత్తిళ్లు, మెమోలు ఇవ్వడంతో లక్షల రూపాయలు అప్పులు చేసి పనులు చేశామని, నెలల తరబడి బిల్లులు ఇవ్వకపోవడంతో అప్పుల్లో కూరుకుపోతున్నామని సర్పంచులు మరిపెల్లి యాదయ్య, ఎలుగు శోభ, పేలపూడి మధు, తిరుమలేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నామని, సమస్యలపై ఏ శాఖ అధికారికి ఫోన్ చేసినా స్పందించడం లేదని సభ్యులు వాపోయారు. పక్క మండలమైన అడ్డగూడూరు మండల సభకు ఎమ్మెల్యే వస్తున్నారని, మోత్కూర్ సభకు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఎమ్మెల్యే, ఇతర ఉన్నతాధికారులు మండల సభకు రాకపోవడంతో వివిధ శాఖల అధికారులు కూడా బాధ్యత లేదన్నట్టుగా సభకు రావడం మానేశారని ఆరోపించారు. ప్రతి సమావేశానికి అధికారులు రాకుండా వారి అసిస్టెంట్లను పంపితే ఏం లాభమని ఎంపీటీసీ ఆకవరం లక్ష్మణాచారితో పాటు సర్పంచులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే అడ్డగూడూరు మండల సభకు వస్తున్నందున ఆ మండల సభలో కలిపితేనైనా తమ బాధలు చెప్పుకుంటామని సర్పంచులు, ఎంపీటీసీలు ఎంపీపీ సంధ్యారాణి, ఎంపీడీవో మనోహర్ రెడ్డిని వేడుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 25 శాతం ధాన్యం కూడా కొనలేదని, మళ్ళీ నాట్లు వేసే సమయం వస్తున్నా ధాన్యం కొనక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యలన్నిటిని జెడ్పీ సమావేశంలో లెవనెత్తుతానని ఎంపీపీ సంధ్యారాణి సభ్యులకు హామీ ఇచ్చారు.
కరెంటు ఆఫీసర్ల నిర్లక్ష్యంపై దుమ్మెత్తి పోసిన సభ్యులు
గ్రామాల్లో ఏడాది కాలంగా కరెంటు లైన్ మెన్లు గాని, ఏఈ గాని కనిపించడం లేదని, ఎన్నిమార్లు ఫోన్లు చేసినా స్పందించడం లేదని కరెంట్ ఆఫీసర్ల నిర్లక్ష్యంపై మండల సభ దుమ్మెత్తిపోసింది. గ్రామాల్లో సుమారు ఏడాదిగా వీధి లైట్లు 24 గంటలు వెలుగుతున్నాయని, శ్మశాన వాటికలకు కరెంటు కనెక్షన్లు ఇవ్వాలని డీడీలు కట్టినా కరెంటు ఆఫీసర్లు గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదని సర్పంచులు మధు, యాదయ్య, శోభ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధిలైట్లు ఏడాదికాలంగా రోజంతా పెరుగుతుండటంతో కరెంటు బిల్లులు వేలల్లో వస్తుండడంతో పంచాయతీలపై ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇనుప స్తంభాలు, లూజు వైర్లతో పశువులు చనిపోతున్నాయని, మనుషులు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో పోరెడ్డి మనోహర్ రెడ్డి, వైస్ ఎంపీపీ బుషిపాక లక్ష్మి, ఏవో కె. స్వప్న, ఏపీఎం వెంకటేశ్వర్లు, ఏపీవో కరుణాకర్, ఎంపీవో సురేందర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటేష్, ఉద్యానవన శాఖ క్లస్టర్ అధికారి నసీమా తదితరులు పాల్గొన్నారు.